మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి | ERC Chairman Justice Nagarjuna Reddy exhortation to young lawyers: AP | Sakshi
Sakshi News home page

మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి

Published Sun, Jun 16 2024 5:38 AM | Last Updated on Sun, Jun 16 2024 5:38 AM

ERC Chairman Justice Nagarjuna Reddy exhortation to young lawyers: AP

ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డిని సత్కరిస్తున్న బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్‌. ద్వారకనాథరెడ్డి, ఇతర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు

అప్పుడే న్యాయవాద వృత్తిలో రాణించగలరు

వాదనలు వినిపించడం ఓ కళ.. దానిని నేర్చుకోండి

ఫీజుల విషయంలోనూ సహేతుకంగా ఉండాలి

యువ లాయర్లకు ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి ఉద్బోధ

పెద్ద కలలు కనండి.. ఏదో ఒక స్థాయికి చేరుకుంటారు

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులు వృత్తి మెళకువలు నేర్చుకుని పైకి రావాలంటే ఓ మంచి న్యాయవాదిని ఎంపిక చేసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేయాలని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. మంచి న్యాయవాది అంటే ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాదని, న్యాయశాస్త్రంలో అంశాల మీద మంచి పట్టున్న వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తి వద్ద చేరితే కేసులను వాదించే అవకాశం దక్కి, మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని, తద్వారా వృత్తిలో ముందుకెళ్లే అవకాశం దొరుకుతుందని చెప్పారు.

వాదించే అవకాశం సులభంగా రాదని, బాగా కష్టపడాలని ఉద్బోధించారు. తాను కూడా అలా కష్టపడితేనే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు. యువ న్యాయవాదులకు రాష్ట్ర న్యాయవాద మండలి (బార్‌ కౌన్సిల్‌), కేఎల్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతుల్లో రెండో రోజు శనివారం “ఆర్ట్‌ ఆఫ్‌ అడ్వొకసీ’ అనే అంశంపై జస్టిస్‌ నాగార్జునరెడ్డి మాట్లాడారు. కేవలం వాదనలు వినిపిస్తే సరిపోదని, వాదనలు ఎలా వినిపించాలో నేర్చుకోవాలని, అది ఓ కళ అని తెలిపారు. ఆ కళని ఒంటబట్టించుకుంటేనే విజయవంతమైన న్యాయవాది అవుతారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.

అందరిలో ఒకరిలా ఉండిపోకండి
‘న్యాయ పాలనలో న్యాయవాదులు, న్యాయమూర్తుల పాత్ర’ అన్న అంశంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడారు. న్యాయమూర్తిగాకంటే న్యాయవాదిగా తాను ఎక్కువ ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. మూడుసార్లు తాను న్యాయమూర్తి పోస్టును తిరస్కరించానని, చివరకు విధి లేని పరిస్థితుల్లో ఆ పోస్టును అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఆ మరుసటి రోజే తన అంగీకారన్ని ఉపసంహరించుకుంటానని అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కోరానని, అప్పటికే జాబితా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.

తాను ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. ఎప్పుడూ పెద్ద కలలు కనాలని, అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికి చేరుకుంటారని, అసలు కలలు కనకుంటే ఏ స్థాయికీ రాలేరని తెలిపారు. అందరిలో ఒకరిలా ఉండపోకూడదని, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని చెప్పారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.  న్యాయవ్యవస్థపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. అనంతరం జస్టిస్‌ నాగార్జునరెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావును బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్‌.ద్వారకనాథరెడ్డి, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు.

కక్షిదారుడు న్యాయవాదులకు దేవుడు
మనకు కేసు అప్పగించే కక్షిదారుడిని ఎప్పుడూ దేవుడిలా చూడాలని జస్టిస్‌ నాగార్జునరెడ్డి చెప్పారు. కక్షిదారుడిని అవమానించడం, తక్కువ చేసి చూడటం, అతనితో కర్కశంగా మాట్లాడటం వంటివి చేయకూడదన్నారు. కక్షిదారుడు ఇచ్చే ఫీజుతో మన కుటుంబాలు నడుస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు. అలాగే కక్షిదారుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలో కూడా సహేతుకంగా ఉండాలని హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement