
విశాఖ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు(ఆదివారం) సదస్సు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రజలకి సైతం విశాఖ అందుబాటులో ఉంటుందని ఉత్తరాంధ్రకు చెందిన ఆరు జిల్లాల న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు బెంచ్ విశాఖకు ఇచ్చేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల న్యాయవాదులతో సదస్సు నిర్వహించారు. విఖాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత 20 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందని న్యాయవాదులు అంటున్నారు. విజయవాడలో ఉన్న హైకోర్టుకు వెళ్లాలంటే సుమారు 700 కి.మీ ప్రయాణించాల్సిన కారణంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ అనేది అనివార్యమని వారు డిమాండ్ చేస్తున్నారు.