సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని కేంద్రంగా కొత్తగా కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తన తొలి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హైకోర్టు(10 కోర్టు హాల్స్)లోని మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోర్టు హాలు చిన్నది కావడంతో న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. న్యాయవాదులనుద్దేశించి మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదులు(బార్), న్యాయమూర్తులు (బెంచ్) కలిసి పనిచేస్తేనే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత బార్ అండ్ బెంచ్‌పై ఉందన్నారు. కేసుల విచారణలో న్యాయవాదుల సహకారం లేకుండా న్యాయమూర్తులు ఏమీ చేయలేరన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలగలమని న్యాయవాదులకు ఉద్బోధించారు. సామాజిక న్యాయస్థానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే విషయంలో ఎంతమాత్రం వెనుకడుగు వేయరాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment