సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విపక్ష పార్టీల నాయకులు జీవో నం.1పై రాజకీయాలు చేస్తున్నారని విద్యావంతులు, న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత స్వార్థ ప్రయోజనాలకు 11 మంది అమాయకులు బలైతే పోలీసులపై నిందలు వేయడం ఏమిటని నిలదీశారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచి్చతో 29 మంది మృత్యువాత పడితే అందుకు ప్రజలదే బాధ్యతంటూ టీడీపీ నిస్సిగ్గుగా వ్యవహరించిందని మండిపడ్డారు.
వాస్తవానికి మన దేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణంతో పాటు చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివేనని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలను రోడ్లపై కాకుండా అనువైన ప్రదేశంలో తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1పై శుక్రవారం విజయవాడలో చర్చా వేదిక నిర్వహించారు. పౌర హక్కులపై ఏపీ ఇంటెలెకు్చవల్ అండ్ సిటిజన్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో పి.విజయబాబు అధ్యక్షతన ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్యులను సమిధలుగా మారుస్తున్నారని సిద్ధార్థ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరహక్కులే ప్రధానమని, వాటి పరి రక్షణకు చట్టాలు చేయడం ప్రభుత్వాల బాధ్యతని విజయబాబు పేర్కొన్నారు.
ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి..
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1లో ఏముందో తెలుసుకోకుండా ఓ వర్గం మీడియా భావ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. రోడ్లు, ఇరుకైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించరాదని అందులో ఉంది. సభలు నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతి, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రోడ్లు ఉన్నది ప్రజలు తిరిగేందుకేగానీ సభల కోసం కాదని కోర్టు పేర్కొంది. రోడ్లను రాజకీయ క్రీడా మైదానాలుగా మారుస్తున్న కొందరు నాయకులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు విష ప్రచారం చేస్తున్నారు. ప్రాథమిక హక్కులనేవి రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినా కమ్యూనిస్టులు స్పందించలేదు. కారకులను వదిలేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టిన గోడ కూల్చినందుకే ఉద్యమ స్థాయిలో స్పందించిన జనసేన అధినేత 11 మంది అమాయకులు చనిపోతే ఎందుకు స్పందించడం లేదు?
– పి.విజయబాబు, ఎపిక్ ఫోరం అధ్యక్షుడు
చట్టంపై వక్రభాష్యం
ఏదైనా దుర్ఘటన జరిగి సామాన్యులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1తో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. ఈ చట్టం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. తన చర్యలతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా హక్కులను వినియోగించుకుంటున్నానని చెప్పే వారిని ఏమనాలి? రోడ్లపై ర్యాలీలు నిర్వహించరాదని చట్టంలో లేదు. సభలు మాత్రమే వద్దని అందులో పేర్కొన్నారు.
– జి.రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్
చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే..
శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. అలాంటి వాటిలో 1861 పోలీస్ చట్టం ఒకటి. జీవో నం.1 పోలీస్ చట్టానికి అనుగుణంగానే ఉంది. ఇందులోని నిబంధనలు ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఈ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారు. బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్ల బాధ్యత నిర్వాహకులదే. సమయం, ప్రదేశం, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహిస్తారు? వలంటీర్ల ఏర్పాటు లాంటి వివరాలతో పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిర్దిష్ట సమయానికి నిర్వహించలేకపోతే కారణాలను వివరిస్తూ మరోసారి అనుమతి పొందాలి. పోలీసులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చట్టంలో ఉంది. జీవో నం.1లో సభలపై నిషేధం గానీ, అభ్యంతరకర
అంశాలుగానీ లేవు.
– ఏఎస్‌ఎన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పీ
జీవో వచ్చాక కూడా సభలు జరిగాయ్
ఓ ఘటన జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1 తెచ్చింది. ఇది సభలను, ర్యాలీలను నిషేధిస్తూ చేసింది కాదు. ఈ చట్టం చేశాక ఒంగోలులో బాలకృష్ణ, విశాఖలో చిరంజీవి సినిమా సభలు జరిగాయి. తర్వాత పవన్ కళ్యాణ్ సభ కూడా జరిగింది. ఒకవేళ జీవోలో నిషేధం అని ఉంటే ఈ సభలు జరిగేవా? ప్రతిపక్ష పార్టీలు స్వలాభం కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఈ చట్టంలో ఏముందో తెలియదంటే అవివేకమే అవుతుంది.
– పిళ్లా రవి, న్యాయవాది
రోడ్లను దిగ్బంధించే హక్కు లేదు
నిరసనలు తెలిపేందుకు, బహిరంగ సభల నిర్వహణకు ప్రత్యేక వేదికలుంటాయి. అక్కడ మాత్రమే చేపట్టాలి. రోడ్లను దిగ్బంధించి సభలు నిర్వహించే హక్కు ఎవరికీ లేదని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దండి మార్చ్ సైతం మహాత్మాగాంధీ 78 మందితోనే నిర్వహించారు. ఇప్పుడు రాజకీయ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు, స్వలాభం కోసం రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు పునరావృతం కాకుండా సరిదిద్దే బాధ్యత ప్రభుత్వానిది. అందుకోసమే జీవో నం.1 జారీ చేశారు. అందులో సభలు, ర్యాలీలను నిషేధించలేదు. రోడ్లపై సభలు వద్దని మాత్రమే పేర్కొన్నారు. ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించే సభలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ జీవోను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ యువకుడు హైకోర్టుకు వెళితే దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. కానీ నాలుగు రోజుల్లోనే ఈ జీవోను రద్దు చేయాలని ఒకరు ఆశ్రయిస్తే ఇది బ్రిటీష్ కాలం నాటి చట్టమని ఆక్షేపించింది. వాస్తవానికి మన న్యాయ వ్యవస్థ నిర్మాణం, చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే.
– కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment