టీడీపీ కార్యాలయంపైదాడి ఘటనలో న్యాయవాది గవాస్కర్‌పై కేసు నమోదు
దీన్ని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ
విజయవాడస్పోర్ట్స్: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన దాడి ఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ను నిందితుడుగా చేర్చడాన్ని బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) న్యాయవాదులు తప్పుబట్టారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ దాడి ఘటనలో న్యాయవాదులను ఇరికించేందుకు మంగళగిరి రూరల్ పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్ తరుఫున న్యాయస్థానానికి వాదనలు వినిపించేందుకు వెళ్లిన గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
పోలీసుల తీరును ఖండిస్తూ బీబీఏ న్యాయవాదులు విధులు బహిష్కరించి గవాస్కర్‌కు సంఘీభావంగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి మాట్లాడుతూ 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, అప్పట్లోనే పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే పలువురు నిందితుల తరుఫున వకల్తా పుచ్చుకున్న గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి 88వ నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సబబని ప్రశి్నంచారు.
సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాది గవాస్కర్ మాట్లాడుతూ ఈ కేసులో తన పేరు ఉందని వారం కిందటి వరకు తనకు తెలీదన్నారు. నాలుగు రోజుల క్రితం కోర్టుకు వెళితే హత్యాయత్నం కేసులో నిందితుడిగా తన పేరును పోలీసులు చేర్చడంతో ఒక్క సారిగా ఖంగుతిన్నట్టు చెప్పారు.
ఇదేంటని ప్రశి్నస్తే.. పై నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళన కార్యక్రమంలో న్యాయవాదులు మన్మథరావు, నిర్మల్‌రాజేష్, కోటంరాజు, బసవరెడ్డి, సాయిరామ్, ఆదాం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment