Justice Praveen kumar
-
జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని హైకోర్టు ప్రాథమికంగా సమర్ధించింది. ఇందులో తప్పేముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. జ్యుడిషియల్ ప్రివ్యూకు, రివ్యూకు తేడా తెలుసుకోకుండా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలకు సంబంధించి గతంలో ఏవైనా తీర్పులుంటే వాటిని తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. వాటిని సమర్పించడంలో విఫలమైతే.. పిటిషన్‌ను కొట్టేస్తూ ఖర్చుల చెల్లింపునకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ దొనాడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ తిరుపతికి చెందిన వ్యాపారి విద్యాసాగర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలో జ్యుడిషియల్ రివ్యూ గురించి మాత్రమే ఉంది తప్ప, జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి లేదని తెలిపారు. అందువల్ల జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది. -
దేవదాసీలకు చేయూత నిద్దాం..
సాక్షి, విజయవాడ: అణగదొక్క బడుతున్న దేవదాసీలకు చేయూత నివ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఏపీ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ నేతృత్వంలో దేవదాసీ వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు 1988లో చట్టం వచ్చిందని..వ్యవస్థలోని కొందరి వలన ఆ చట్టంతో అనుకున్న స్థాయిలో దేవదాసీలకు న్యాయం జరగలేదన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలించడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం న్యాయమూర్తి కేసీ భాను ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నారు... దేవదాసీ వ్యవస్థ నిర్మూలన చట్టం రూపొందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చల్లప్పా మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు నాయకులకు లోబడి పనిచేస్తున్నారని..గతంలో ఏ ప్రభుత్వం కూడా దేవదాసీ నిర్మూలన కోసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాసీ నిర్మూలనకు కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు. సీఎం జగన్ సాంఘిక సంక్షేమం కోసం విదేశాల్లో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. ఐఏఎస్‌లు రవిచంద్ర, దమయంతి.. దేవదాసీ నిర్మూల కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్,ఎస్సీ కార్పొరేషన్ ఎండి గంథం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం ప్రధానం
చంద్రగిరి రూరల్ (చిత్తూరు జిల్లా): దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ అంశాలు కీలకమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఉన్న ఓ హోటల్ల్లో జాతీయ ట్యాక్స్ సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తొలిరోజు జస్టిస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం ఉండటం ప్రధానం అన్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్‌పై అధ్యయనం నిరంతర ప్రక్రియ అని, అవగాహన కల్పనలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ప్రముఖ పాత్ర పోషించడం అభినందనీయమని చెప్పారు. పన్నుల వల్ల సామాజికాభివృద్ధి, సామాజిక న్యాయం అందుతాయని చెప్పారు. పన్నుల పాలసీపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. పన్నుల మినహాయింపు కూడా దేశాభివృద్ధిలో భాగమేనని చెప్పారు. పన్నుల చెల్లింపులో ఉన్న సాధక బాధకాలను పారదర్శకతతో చర్చించి కేంద్రానికి సమర్పించగలిగితే నూతన విధానాలకు అవకాశం కలుగుతుందన్నారు. నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి అవగాహన సదస్సులు అమరావతిలో చేపట్టాలని, ఇలాంటి వాటి వల్ల న్యాయవాదులకు, ఆడిటర్లకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ సూచనపై ఏపీ ఫెడరేషన్ స్పందించి.. త్వరలో అమరావతిలో సదస్సు నిర్వహణకు అంగీకారం తెలిపింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గంగారావు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా ట్యాక్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ష్రాఫ్, జనరల్ సెక్రటరీ ఆనంద్ పాసారి, సౌత్‌జోన్ చైర్మన్ సీతాపతిరావు, సెక్రటరి సంజీవరావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కృష్ణ మోహన్‌తో పాటు జిల్లాలోని పలువురు ఆడిటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. సక్రమంగా పన్నులు చెల్లించేందుకు ప్రాక్టీషనర్లు వారధిగా పనిచేయాలి ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లించేందుకు ప్రాక్టీషనర్లు వారధిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. జాతీయ ట్యాక్స్ సదస్సుకు ఆయన సాయత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నుల సేకరణలో ప్రాక్టీషనర్ల కృషి అభినందనీయమని, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలు సీఎం తనకు అప్పగించడం సంతోషమన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష పన్నుల వసూల్లో జీఎస్టీ కీలకపాత్ర అని, చిన్న, సన్నకారు వ్యాపారస్థులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వారికి బ్యాంకు రుణాలు మరింత సులభతరం అవుతుందన్నారు. అనంతరం 40 ఏళ్లకు పైగా సేవలందించిన ట్యాక్స్ ప్రాక్టీషనర్లు మహబూబ్ బాషా, నాగభూషణం, మోహన్ రాజు గుప్తా, ఫాల్గుణ కుమార్, రాజారెడ్డి, రామకృష్ణలను ఆయన ఘనంగా సత్కరించారు. సదస్సులో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సావనీర్‌ను తిరుపతి కేంద్రంగా నిర్వహించినందుకు లోగోను ఆవిష్కరించారు. -
అవినీతి రహిత పాలన దిశగా..
సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. అవినీతితో కునారిల్లిపోయిన టెండరింగ్ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవినీతి జరిగిందని న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్న స్థితిని మార్చి, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా న్యాయ వ్యవస్థ చేతికే టెండరింగ్ విధాన నిర్ణయాన్ని అప్పగించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గొప్ప పారదర్శక విధానానికి శ్రీకారం చుడుతూ అడుగు వేశారు. సీఎం పదవి స్వీకరిస్తూ, మే 30న తాను ప్రకటించిన విధంగా టెండర్ విధానంలో సంస్కరణలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌ను వైఎస్ జగన్ కలిశారు. సాయంత్రం 6 గంటలకు ఏసీజే ఇంటికి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు అక్కడ గడిపారు. సీఎం వెంట ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, అడ్వొకేట్ జనరల్‌గా నియమితులైన సుబ్రహ్మణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులు కానున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఏసీజేను జగన్మోహన్రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం టెండర్లలో అవినీతికి ఆస్కారమే లేని పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఏసీజేకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇందు కోసం ప్రత్యేకించి ఒక హైకోర్టు జడ్జిని కేటాయించాలని కోరారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలోని కమిషన్‌కు, సిబ్బందికి అయ్యే వ్యయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కమిషన్ సూచన మేరకు టెండర్ల ప్రక్రియలో మార్పులు వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పిలిచే టెండర్లను ముందుగానే హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిషన్‌కు పంపుతామని, టెండర్‌కు సంబంధించిన అంశాలపై జుడిషియల్ కమిషన్ సంబంధిత ప్రభుత్వ అధికారులతో చర్చించి మార్పు, చేర్పుల్ని సూచిస్తే ఆ ప్రకారంగానే టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రి జగన్.. ఏసీజేకు విన్నవించారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టైలర్ మేడ్‌గా, అంటే.. కమీషన్ల కోసం తాను ముందుగానే నిర్ణయించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న అనుభవం, అర్హతల ప్రకారం టెండర్ నిబంధనలు తయారు చేసి, వారికే టెండర్ దక్కేలా చేసిన విధానం వల్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్న సమయంలోనే ప్రజలకు వివరించిన విషయం తెలిసిందే. ప్రతి టెండర్లోనూ 20 నుంచి 25 శాతం మేర అవినీతి జరిగిందని, ఆమేరకు ప్రజాధనాన్ని మిగిల్చే విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు. తద్వారా ఇరిగేషన్ కాంట్రాక్టులంటేనే అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన పరిస్థితి నుంచి పూర్తి పాదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ముందడుగు వేశారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా సంస్కరణలు తీసుకురానున్నారు. -
న్యాయప్రతిష్టను కాపాడాలి
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని కేంద్రంగా కొత్తగా కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తన తొలి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హైకోర్టు(10 కోర్టు హాల్స్)లోని మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోర్టు హాలు చిన్నది కావడంతో న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. న్యాయవాదులనుద్దేశించి మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదులు(బార్), న్యాయమూర్తులు (బెంచ్) కలిసి పనిచేస్తేనే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత బార్ అండ్ బెంచ్‌పై ఉందన్నారు. కేసుల విచారణలో న్యాయవాదుల సహకారం లేకుండా న్యాయమూర్తులు ఏమీ చేయలేరన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలగలమని న్యాయవాదులకు ఉద్బోధించారు. సామాజిక న్యాయస్థానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే విషయంలో ఎంతమాత్రం వెనుకడుగు వేయరాదన్నారు. -
హైకోర్టు ఉద్యోగుల కేటాయింపులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల విభజన కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చిన వారందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించారు. వీరంతా నాలుగో తేదీలోపు అమరావతి వెళ్లి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) వద్ద రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ (అడ్మిన్) డి.నాగార్జున సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన వారిలో చాలా మందిని వారి వారి కేడర్‌లో పోస్టులు ఖాళీ లేకపోవడంతో డిప్యుటేషన్‌పై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పేర్కొన్నారు. మరికొంత మందిని తెలంగాణలోనే కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై చేరాలని స్పష్టం చేశారు. జాయింట్ రిజిస్ట్రార్ పి.శ్రీధర్‌రావు తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇవ్వగా ఆయనను ఏపీ హైకోర్టుకు డిప్యూట్ చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో 12 మందిని, సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 51 మందిని, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 13 మందిని, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 36 మందిని, ఎగ్జామినర్ల కేడర్‌లో 7 మందిని ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని ఆదేశించారు. అసిస్టెంట్ కేడర్‌లో 67 మందిని, ఆఫీస్ సబార్డినేట్ కేడర్‌లో 151 మందిని తెలంగాణలోని కింది కోర్టులో పనిచేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చి కేడర్ పోస్టులు ఖాళీగా లేనందున ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులతో ఆయా కేడర్‌లో భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేశారు. తెలంగాణ హైకోర్టులో ఆయా కేడర్‌లో ఖాళీ అయ్యే పోస్టుల్లోకి వీరు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో తెలంగాణ హైకోర్టులో ఒక పోస్టు ఖాళీ అయిందనుకుంటే, ఆ పోస్టును ఏపీ హైకోర్టు డిప్యుటేషన్‌పై పంపిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లలో సీనియర్ అయిన అధికారి చేత భర్తీ చేస్తారు. ఇదే రీతిలో మిగిలిన కేడర్ పోస్టులను సైతం భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి గతంలోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త బెంచీల ఏర్పాటు.. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన జనవరి 1 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇరు హైకోర్టులకు వేర్వేరు వెబ్సైట్లను రూపొందించారు. హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో కొత్త న్యాయమూర్తులతో కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేసుల విచారణలో పాత కేసులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. సీజే సహా మొదటి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో బెంచీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ బెంచ్‌లుగా కేసులను విచారిస్తారు. మొదటి బెంచీలో సీజే జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, రెండో బెంచీలో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, మూడో బెంచీలో జస్టిస్ ఆర్.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావు ఉంటారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రిట్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్‌లు, పర్యావరణ, వినియోగదారుల వివాదాలు తదితర కేసులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. క్రిమినల్ అప్పీళ్లు, ఉరిశిక్ష ఖరారు తదితర కేసులపై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఇన్‌కంట్యాక్స్ ట్రిబ్యునల్ అప్పీళ్లు, వివిధ చట్టాలను, చట్ట నిబంధనలను, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులను, మనీలాండరింగ్ కేసులను జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, సివిల్ రివిజన్ పిటిషన్లు, ఒరిజినల్ పిటిషన్లను జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, హోం (ఎఫ్ఐఆర్ల కొట్టివేత కేసులు మినహా), కేంద్ర ప్రభుత్వ శాఖలు, వైద్య, ఆరోగ్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్ పి.నవీన్‌రావు, పురపాలకశాఖ, భూ సేకరణ, గనులు, రవాణా, దేవాదాయం, ఎక్సైజ్, అటవీ తదితర శాఖల కేసులను జస్టిస్ చల్లా కోదండరాం, క్రిమినల్ రివిజన్లు, క్రిమినల్ పిటిషన్లను జస్టిస్ బి.శివశంకర్‌రావు, బెయిళ్లు, క్రిమినల్ అప్పీళ్లను జస్టిస్ షమీమ్ అక్తర్, పరిపాలన ట్రిబ్యునల్ నుంచి వచ్చిన కేసులను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారిస్తారు. -
కొలువు దీరిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్:అమరావతి రాజధాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలువు తీరింది. రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సలసా వెంకట నారాయణ బట్టు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మందాడ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్‌చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యానారాయణ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావులు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ వేదికపై ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జిల్లా జడ్జి వై.లక్ష్మణరావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు ఏర్పడినంత మాత్రాన మన కర్తవ్యం తీరిపోలేదని, దీన్ని ఒక ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని, అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కలసి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత(10 కోర్టు హాల్స్) న్యాయస్థానం భవన సముదాయాలను ప్రారంభించారు. మొత్తం పది కోర్టులను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. హైకోర్టు నిర్వహించాల్సిన విధులు క్లిష్టతరంగాను, సున్నితంగాను ఉంటాయన్నారు. వ్యక్తికి–వ్యక్తికి, వ్యక్తికి–ప్రభుత్వానికి వచ్చే వ్యాజ్యాలు విచారించి న్యాయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కర్తవ్యాన్ని నిష్కర్షగా నిర్వహించాల్సి ఉందని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా రాజ్యాంగంలో నిబిడీకృతమైన అంశాలకూ ప్రాధాన్యమివ్వాలన్నారు. తీర్పులు వెల్లడించే సమయంలో న్యాయమూర్తులు స్వతంత్రంగానూ, నిష్కర్షగానూ వ్యవహరించాలని ఉద్బోధించారు. అనువైన సంఘ నిర్వహణకు నిర్మించబడిన సంస్థల్లో న్యాయ సంస్థ కూడా ఒకటన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవభావం ఉండేలా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. హైకోర్టు తరలిరావడంతో ఇక్కడి కక్షిదారులకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఈ నెల 21న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాక.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సందేశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ చదివి విన్పించారు. రాష్ట్రంలో న్యాయ విభాగం కార్యకలాపాలు విస్తృతమయ్యాయని, మరింత బలోపేతమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన సందేశంలో పేర్కొన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుది అతిపిన్న వయస్సు అని అన్నారు. మన న్యాయవ్యవస్థ నిస్సందేహంగా గర్వించదగినదిగా ఉండాలని, ఇందుకు మన బాధ్యత ఎంతో ఉందని, ఆనందంతో మన విధుల్లో భాగస్వాములమవ్వాలని ఉద్బోధించారు. న్యాయవ్యవస్థలో న్యాయవాదులు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని తన సందేశంలో ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల 21న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ చేతుల మీదుగా అమరావతిలోని తాత్కాలిక హైకోర్టు నూతన భవనాలను ప్రారంభించి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించారు. ఇదో చరిత్రాత్మక ఘట్టం: జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అమరావతి రాజధాని కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు కావడం చరిత్రాత్మక ఘట్టమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోవడం ప్రశంసనీయమని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు వ్యవస్థ చరిత్రలో పునరావృతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి హైకోర్టు గుంటూరు కేంద్రంగా పనిచేసిందని, తదుపరి 1956లో హైదరాబాద్‌కు తరలించడం జరిగిందని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగాక తిరిగి అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలు చేపట్టడం చరిత్రాత్మకమైన ఘట్టమని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. విభజన పూర్తయ్యింది: సీఎం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు రాకతో విభజన పూర్తయిందని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిధులు, ఆస్తుల విభజన తప్ప తరలింపు మొత్తం పూర్తయినట్టేనన్నారు. అమరావతికి హైకోర్టు తరలడానికి తక్కువ సమయం ఇచ్చారన్నారు. హైకోర్టు విధుల నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా చూస్తామని చెప్పారు. విభజన సమస్యలున్నా అన్నింటినీ అధిగమిస్తున్నామని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1న నూతన హైకోర్టును ప్రారంభించుకోవడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా తాను, తొలి గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టామని, ఇప్పుడు హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్ వ్యవహరించడం చరిత్ర అని పేర్కొన్నారు. ఇక్కడినుంచే న్యాయపరిపాలనకు శ్రీకారం చుట్టామని, మనందరం కలసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదామని అన్నారు. నేటినుంచి తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు.. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తయింది. అమరావతి కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు కార్యాలయం కోసం 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక హైకోర్టును సందర్శించిన చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తుళ్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పలువురు న్యాయవాదుల బృందం ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ బృందం అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ద్వారా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్థానమిదీ.. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. ఎంతోమంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించి న్యాయ సహాయాన్ని చేశారు. ఆయన కుమారుడైన ప్రవీణ్‌కుమార్ 10వ తరగతి వరకు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదివారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అతి తక్కువ కాలంలోనే తండ్రి మాదిరిగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టుకు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పివీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్థానమిదీ.. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. ఎంతోమంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించి న్యాయ సహాయాన్ని చేశారు. ఆయన కుమారుడైన ప్రవీణ్‌కుమార్ 10వ తరగతి వరకు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదివారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అతి తక్కువ కాలంలోనే తండ్రి మాదిరిగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాత్కాలిక హైకోర్టును సందర్శించిన చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తుళ్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పలువురు న్యాయవాదుల బృందం ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ బృందం అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ద్వారా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జస్టిస్ ఎస్.వి నారాయణబట్టు 1962లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో రామకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా మదనపల్లెలో కొనసాగింది. బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఈ.కళ్యాణ్‌రామ్ వద్ద వృత్తిపరమైన మెళకువలు నేర్చుకున్నారు. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ కుటుంబంలో 1962లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా భీమవరంలోనే సాగింది. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాదులు పి.రాజగోపాలరావు, పి.రాజారావుల వద్ద వృతి జీవితాన్ని ఆరంభించారు. సివిల్, క్రిమినల్, సర్వీసు చట్టాలపై పట్టు సాధించారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేపట్టారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సంగీతం, కళలపై మంచి మక్కువ. జస్టిస్ ఎం.సీతారామమూర్తి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో న్యాయవాద కుటుంబంలో జన్మించారు. వారి వంశంలో మూడో తరం న్యాయవాదిగా ఈయన నిలిచారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 12 సంవత్సరాలపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తరువాత జ్యుడీషియల్ సర్వీసుల్లో ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. ఉత్తమ న్యాయాధికారిగా పలు పతకాలు అందుకున్నారు. యోగా, సంగీతం, ప్రయాణాలంటే ఆసక్తి. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విజయనగరం జిల్లాలో 1962లో న్యాయవాద కుటుంబంలో జన్మించారు. తాత ఉప్మాక నారాయణమూర్తి విజయనగరం, పార్వతీపురంలలో ప్రముఖ న్యాయవాదిగా, శతావధానిగా పేరుగాంచారు. తల్లి తరఫున వారు కూడా న్యాయవాదులే. భార్య, ఆమె తండ్రి కూడా న్యాయవాదులే. 1986లో బొబ్బిలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1998లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి 1957 ఫిబ్రవరి 4న ప్రకాశం జిల్లా కారం చేడులో వెంకటాద్రి, వీరమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కారంచేడులోనే కొనసాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. చీరాలలో పి.వెంకటాద్రి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. తరువాత జస్టిస్ జె.చలమేశ్వర్(సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేశారు) వద్ద పనిచేశారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 1998లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1960 జూన్ 14న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యాభాస్యమంతా మచిలీపట్నంలోనే సాగింది. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ సాధించారు. న్యాయవాదిగా ఎన్రోల్ అయి, మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. యక్కాల పాండురంగారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1991లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సతీమణి రమణకుమారి ప్రస్తుతం న్యాయాధికారిగా పనిచేస్తున్నారు. జస్టిస్ జి.శ్యాంప్రసాద్ గుంటూరులో 1958 సెప్టెంబర్ 27న మల్లికార్జునరావు, సావిత్రమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులోనే సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ సాధించారు. న్యాయవాదిగా ఎన్రోల్ అయి ఎన్.చలపతిరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు.1985లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో సేవలు అందించారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ జె.ఉమాదేవి 1959 సెప్టెంబర్ 26న అనంతపురం జిల్లాలో జ్ఞానోబారావు, తులసీబాయి దంపతులకు జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ, అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టాలు పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వరదారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి ఉభయ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్.బాలయోగి తూర్పుగోదావరి జిల్లా పెయ్యలవారిపేట గ్రామంలో 1957 జనవరి 15న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, సీనియర్ న్యాయవాదిగా వెంకటరామయ్య వద్ద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తరువాత జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ టి. రజని ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో 1958 నవంబర్ 6న వెంకటప్పయ్య, రామతులసమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల నుంచి కాలేజీ వరకు విద్యాభ్యాసం గుంటూరులో సాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1981లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2002 వరకు గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు 1961 సెప్టెంబర్ 26న జన్మించారు. తండ్రి డీవీ సుబ్బారావు ప్రముఖ న్యాయకోవిదుడు. విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే సాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యునిగా కొనసాగారు. స్వచ్ఛభారత్ అంబాసిడర్‌గా నామినేట్ అయ్యారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కింది కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ కొంగర విజయలక్ష్మి గుళ్లాపల్లి వెంకటేశ్వరరావు, సీతారత్నం దంపతులకు 1960 సెప్టెంబర్ 20న జన్మించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. విద్యార్థి దశలో వివిధ బహుమతులు అందుకున్నారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, న్యాయవాదిగా పనిచేశారు. ఈమె జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వద్ద కూడా పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.గంగారావు అనంతపురం జిల్లా గుంతకల్లులో 1961 ఏప్రిల్ 8న చింతామణి, గోవిందమ్మ దంపతులకు జన్మించారు. అనంతపురంలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1987లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ బీఎస్ఏ స్వామి, జస్టిస్ సీవీ రాములు వద్ద జూనియర్‌గా చేరి వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
‘56 ఏళ్ల తర్వాత ఏపీకి హై కోర్టు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్‌తో సహ 13మంది న్యాయమూర్తులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చరిత్రను తిరగరాయడానికి ఇది మంచి సందర్భం అని కొనియాడారు. సమయం తక్కువగా ఉన్నప్పటికి.. వసతులు పూర్తిగా లేనప్పటికి ఎలాంటి లోటు లేకుండా హై కోర్టు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టును దేశంలోనే అత్యున్నత హై కోర్టుగా తీర్చిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని ప్రశంసించారు. హైకోర్టు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని హామి ఇచ్చారు. 56 ఏళ్ల తర్వాత ఏపీకి హైకోర్టు : ప్రవీణ్ కుమార్ ఏపీకి ప్రత్యేక హై కోర్టు రావడం ఓ చారిత్రక ఘట్టమంటూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ప్రశంసించారు. 56 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి హైకోర్టు వచ్చిందని తెలిపారు. అందరి సమన్వయంతో హై కోర్ట్ నిర్వహణను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. కొత్త చరిత్రను ఇక్కడి నుంచి మొదలు పెడదామని కోరారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. సుప్రీం కోర్టు ప్రారంభానికి సీజే వస్తారు : ఎన్వీ రమణ ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జనవరి 25 నాటికి హై కోర్టు బిల్డింగ్ పూర్తి అవుతుందని సీఎం చెప్పారన్నారు. హై కోర్టు ప్రారంభోత్సవానికి రావడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సన్నద్దంగా ఉన్నారని తెలిపారు. ఇన్చార్జి చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఏపీ హైకోర్టు దేశంలోనే ఉత్తమ హై కోర్టుగా గుర్తింపు పొందాలని ఎన్వీ రమణ కోరుకున్నారు. -
కొలువుదీరిన ఏపీ హైకోర్టు
-
ఏపీ సీజేగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రమాణస్వీకారం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. (కొత్త అధ్యాయం) జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్ విద్యాభ్యాసం హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సాగింది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్ ఏర్పాటు చేయమని సీఆర్డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మిగతా న్యాయమూర్తులు.. 1. జస్టిస్ వెంకట నారాయణ భట్టి 2. జస్టిస్ వెంకట శేష సాయి 3. జస్టిస్ సీతారామ మూర్తి 4. జస్టిస్ దుర్గా ప్రసాద రావు 5. జస్టిస్ సునీల్ చౌదరి. 6. జస్టిస్ సత్యనారాయణ మూర్తి 7. జస్టిస్ శ్యాం ప్రసాద్ 8. జస్టిస్ ఉమ దేవి 9. జస్టిస్ బాలయోగి 10. జస్టిస్ రజని 11. జస్టిస్ వెంకట సుబ్రమణ్య సోమయాజులు 12. జస్టిస్ విజయ లక్ష్మి 13. జస్టిస్ గంగా రావు -
కొత్త అధ్యాయం
విజయవాడ లీగల్/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/ గరికపాడు (జగ్గయ్యపేట)/సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం ముగిసిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నూతన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జనవరి 2వ తేదీ నుంచి హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందుకోసం విజయవాడలోని సివిల్ కోర్టుల పక్కనున్న సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టులను ఏర్పాటు చేశారు. ఇక హైకోర్టు కార్యాలయం కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్ ఏర్పాటు చేయమని సీఆర్డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. న్యాయమూర్తులు, అధికారుల వసతికోసం ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను హైకోర్టు రిజిస్టార్ జనరల్(విజిలెన్స్) సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వై.లక్ష్మణరావు, హరిహరనాథ్ శర్మలు దగ్గరుండి చూశారు. హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్ట్రార్లకు నగరంలోని హోటల్ నోవాటెల్‌లో వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. ఇతర న్యాయశాఖ అధికారులకు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస కల్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి విజయవాడకు తరలివెళ్తున్న ఏపీ న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయమూర్తులకు ఘన స్వాగతం.. రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టుకు కేటాయించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర న్యాయమూర్తులందరూ సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన విజయవాడకు చేరుకున్నారు. వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, ప్రోటోకాల్ సెక్రటరీ ఎన్.శ్రీకాంత్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, సబ్ కలెక్టర్ మిషాసింగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నుంచి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమితులైన జస్టిస్ ప్రవీణ్‌కుమార్ గౌరవ వందనం అందుకున్నారు. ప్రధాన న్యాయమూర్తులతోపాటు వారి కుటుంబసభ్యులు ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ వచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కలసిన బీబీఏ ప్రతినిధులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.నారాయణ బట్టి, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ టి.రజనీ, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావులను బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) అధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణరావు, ఉపాధ్యక్షుడు కనిశెట్టి వెంకటరంగారావు, ప్రధాన కార్యదర్శి దొడ్ల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు మువ్వల జయప్రకాష్, ఎం.హనుమంత్, సి.హెచ్.రాధాకుమారి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్, బీబీఏ మాజీ అధ్యక్షులు చేకూరి శ్రీపతిరావు, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, మట్టా జయకర్, సోము కృష్ణమూర్తి, చోడిశెట్టి మన్మథరావు తదితరులు హోటల్ నోవాటెల్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. నేడు నగరానికి రానున్న జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ మంగవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు, ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్ హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరిత వాతావరణం హైకోర్టు విభజన నేపథ్యంలో ఏపీకి చెందిన సిబ్బంది, న్యాయవాదులు సోమవారం విజయవాడకు పయనమైనప్పుడు హైదరాబాద్‌లోని హైకోర్టు ఆవరణలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో కలసిమెలసి పనిచేసిన న్యాయవాదులు, సిబ్బంది విడిపోతుండడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధాతప్త హృదయంతోనే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏపీ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులు, న్యాయవాదులు వీడ్కోలు చెప్పారు. అనంతరం హైకోర్టు నుంచి ఐదు ప్రత్యేక బస్సులు బయల్దేరి సోమవారం రాత్రికి విజయవాడకు చేరాయి. కోర్టు రికార్డులను కూడా తీసుకొచ్చారు. ఆ ఫైళ్లను ఆయా కోర్టుల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
1న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ జనవరి ఒకటో తేదీ, ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించనున్న మిగిలిన 13 మంది ఆ రోజే ప్రమాణం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కూడా జనవరి ఒకటినే ప్రమాణం చేయనున్నారు. ఆయనతో రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించి అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడ వస్తారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను శుక్రవారం హైకోర్టులో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో కలిసి అభినందించారు. న్యాయమూర్తులకు ‘నోవాటెల్’లో బస ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు విజయవాడలోని నోవాటెల్‌లో తాత్కాలిక బస కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్లకు సైతం అక్కడే బస ఏర్పాటు చేశారు. ఇతర న్యాయాధికారులకు ప్రభుత్వ అతిథి గృహం/హోటళ్లలో బస ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. అయితే హైకోర్టు ఉద్యోగులు, సిబ్బంది గురించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. న్యాయమూర్తులకు ఏడాది పాటు అద్దె ప్రాతిపదికన 12 విల్లాలను సిద్ధం చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏపీఏటీకి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేయాలని దాని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. అలాగే ఫర్నిచర్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. గవర్నర్ వచ్చేందుకు వీలుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలని ఏవియేషన్ ఎండీని ఆదేశించింది. -
ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 1 నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారం భించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో లాంఛనాలన్నీ శరవేగంగా పూర్తవు తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నియ మితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జనవరి 1న హైకోర్టుకు సెలవు దినం కావడంతో 2వ తేదీన ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏపీకి కేటాయించిన 14 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ ప్రవీణ్‌కుమారే సీనియర్. దీంతో రాష్ట్రపతి ఆయనవైపు మొగ్గు చూపారు. అత్యంత సౌమ్యుడిగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు పేరుంది. ఆ ముగ్గురూ తెలంగాణ హైకోర్టుకు... ఇదిలా ఉంటే ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అలాగే న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్ర మణియన్‌లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్రపతి కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో సంప్రదించిన తరువాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు కేవలం 10 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జస్టిస్ రాధాకృష్ణన్ కేరళ హైకోర్టుకు చెందిన వారు కాగా, జస్టిస్ చౌహాన్ రాజస్తాన్, జస్టిస్ రామసుబ్రమణియన్ చెన్నై హైకోర్టులకు చెందిన వారు. వీరు ముగ్గురు కూడా బయట న్యాయమూర్తులు కావడంతో వీరిని ఏపీ హైకోర్టుకు పంపాలా? తెలంగాణ హైకోర్టుకు పంపాలా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రపతి ఈ ముగ్గురు కూడా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగుతారంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జస్టిస్ రామసుబ్రమణియన్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారని హైకోర్టు వర్గాల్లో గట్టిగా ప్రచారం జరిగింది. 1న ప్రమాణ స్వీకారం... జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మిగిలిన ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులు జనవరి 1న ప్రమాణం చేయ నున్నట్లు తెలిసింది. వీరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారని సమాచారం. ఉన్నతస్థాయి వర్గాల్లో దీనిపై ఓ నిర్ణయం జరిగిందని హైకోర్టు వర్గాల ద్వారా తెలుస్తున్నప్పటికీ, దీనిని ఎవ్వరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తండ్రికి తగ్గ తనయుడు... జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. పద్మనాభరెడ్డి ఎంతో మంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్ విద్యాభ్యాసం హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో సాగింది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అతి తక్కువ కాలంలో తండ్రి లాగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. -
అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను, ఫీజులను నియంత్రించే అధికారం యూనివర్సిటీల చట్టం కింద తమకు ఉందన్న ప్రభుత్వ వాదనను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. కాలేజీల వాదనలు వినకుండా, వారి వ్యయాల గురించి తెలుసుకోకుండా ఫీజులను నిర్ణయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చింది. న్యాయస్థానానికి వచ్చిన పలు డిగ్రీ కాలేజీలకు ఆన్లైన్ ద్వారా కాకుండా పాత విధానంలో(ఆన్లైన్ ద్వారా కాదు) ప్రవేశాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ప్రవేశాలన్నీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని, ఒకవేళ భవిష్యత్తులో కాలేజీలు ఓడిపోతే డిగ్రీ సర్టిఫికెట్లు రావన్న విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్లైన్ ద్వారా ప్రవేశాల నిమిత్తం జారీ చేసిన జీవోను.. అలాగే తమ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలు అన్ ఎయిడెడ్ మైనారిటీ, మైనారిటీయేతర, అటానమస్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల నిమిత్తం జీవో 67 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్), ఏ చట్టం కింద ఈ విధానాన్ని తీసుకొచ్చిందో ఎక్కడా పేర్కొనలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. యూనివర్సిటీ చట్టం కింద ఫీజులను, ప్రవేశాలను నియంత్రించే అధికారం తమకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వాదన సమర్థనీయంగా లేదన్నారు. ‘యూనివర్సిటీల చట్టంలో యూనివర్సిటీ అన్న పదం పరిధిలోకి అన్ని అఫిలియేటెడ్ కాలేజీలు, వర్సిటీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు వస్తాయని అదనపు ఏజీ చెబుతున్నారు. ఈ వాదనను ఆమోదిస్తే రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ప్రవేశాలే కాదు పోస్టుల సృష్టి, ప్రొఫెసర్లు, రీడర్లు, పాలనా సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, హాస్టళ్ల నిర్వహణ, ఫీజుల ఖరారు ఇలా అన్నీ విషయాల్లో కూడా అధికారాలు యూనివర్సిటీకే చెందుతాయి. వాస్తవానికి శాసనకర్త ఉద్దేశం ఇది కాదు. చట్ట ప్రకారం యూనివర్సిటీ కాలేజీలు వేరు, అఫిలియేటెడ్ కాలేజీలు, రికగ్నైజ్డ్ కాలేజీలు, మహిళా కాలేజీలు వేరు. అదనపు ఏజీ వాదన నిజమైతే చట్టంలో ఇలా ఒక్కో కాలేజీ గురించి ప్రస్తావన చేసి ఉండేవారు కాదు. యూనివర్సిటీల పరిధిని పాలనా సౌలభ్యం కోసమే నిర్ణయించారు తప్ప, ప్రవేశాలను నియంత్రించడానికి కాదు. కాబట్టి అదనపు ఏజీ వాదన సరికాదు. అటానమస్ కాలేజీలు యూజీసీ చట్ట నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తాయి. కాబట్టి ప్రవేశాలను ప్రభుత్వం నియంత్రించజాలదు. అన్ ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ప్రభుత్వం నియంత్రంచ లేదని టీఎంఏ పాయ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది’అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మంత్రులపై పిటిషన్ కొట్టివేత
ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి పదవులు కట్టబెట్టారని, దీని వెనుక అవినీతి దాగి ఉందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారని పిటిషనర్‌కు గుర్తు చేసిన హైకోర్టు, పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇదే హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చిందని, అందువల్ల వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అవినీతి కింద పరిగణించలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 164 కింద గవర్నర్ ఉపయోగించే అధికారాన్ని అవినీతి కిందకు రాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు. తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు పదవులు ఆశజూపి పార్టీ మారేలా చేశారని, తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని, దీని వెనుక అవినీతి కూడా దాగి ఉందని, అందువల్ల దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, సామాజిక కార్యకర్త ఫర్హత్ ఇబ్రహీం హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు ఈ ఫిర్యాదును తోసిపుచ్చింది. కింది కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇబ్రహీం హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై వాదనలు విని ఈ నెల 16న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తన తీర్పును వెలువరించారు. ముఖ్యమంత్రి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకష్ణారెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అవినీతి నిరోధక చట్టం కింద చేసే ఫిర్యాదులను ఆ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించగలవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు ఏ కోర్టులో అయితే ఫిర్యాదు దాఖలు చేశారో అది ప్రత్యేక కోర్టు కాదన్నారు. అందువల్ల అక్కడ దాఖలు చేసిన ఫిర్యాదుకు విచారణార్హతే లేదని స్పష్టం చేశారు. తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలోని అంశమని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ ఇదే హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందని, వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్న ఏజీ వాదనలను న్యాయమూర్తి ఈ సందర్భంగా తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. మంత్రుల నియామకం గవర్నర్ చేస్తారని, గవర్నర్ ఉపయోగించే అధికారాలు అవినీతి చట్ట పరిధిలోకి రావన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు ఏ కోణంలో చూసినా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు.