హైకోర్టు ఉద్యోగుల కేటాయింపులు పూర్తి | High Court Bifurcation Totally Complete | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 2 2019 4:39 AM | Last Updated on Wed, Jan 2 2019 4:39 AM

High Court Bifurcation Totally Complete - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగుల విభజన కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్‌ ఇచ్చిన వారందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించారు. వీరంతా నాలుగో తేదీలోపు అమరావతి వెళ్లి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) వద్ద రిపోర్ట్‌ చేయాలని రిజిస్ట్రార్‌ (అడ్మిన్‌) డి.నాగార్జున సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చిన వారిలో చాలా మందిని వారి వారి కేడర్‌లో పోస్టులు ఖాళీ లేకపోవడంతో డిప్యుటేషన్‌పై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పేర్కొన్నారు. మరికొంత మందిని తెలంగాణలోనే కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై చేరాలని స్పష్టం చేశారు.

జాయింట్‌ రిజిస్ట్రార్‌ పి.శ్రీధర్‌రావు తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్‌ ఇవ్వగా ఆయనను ఏపీ హైకోర్టుకు డిప్యూట్‌ చేశారు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కేడర్‌లో 12 మందిని, సెక్షన్‌ ఆఫీసర్‌ కేడర్‌లో 51 మందిని, డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్‌ కేడర్‌లో 13 మందిని, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కేడర్‌లో 36 మందిని, ఎగ్జామినర్ల కేడర్‌లో 7 మందిని ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని ఆదేశించారు. అసిస్టెంట్‌ కేడర్‌లో 67 మందిని, ఆఫీస్‌ సబార్డినేట్‌ కేడర్‌లో 151 మందిని తెలంగాణలోని కింది కోర్టులో పనిచేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చి కేడర్‌ పోస్టులు ఖాళీగా లేనందున ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులతో ఆయా కేడర్‌లో భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేశారు.

తెలంగాణ హైకోర్టులో ఆయా కేడర్‌లో ఖాళీ అయ్యే పోస్టుల్లోకి వీరు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కేడర్‌లో తెలంగాణ హైకోర్టులో ఒక పోస్టు ఖాళీ అయిందనుకుంటే, ఆ పోస్టును ఏపీ హైకోర్టు డిప్యుటేషన్‌పై పంపిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లలో సీనియర్‌ అయిన అధికారి చేత భర్తీ చేస్తారు. ఇదే రీతిలో మిగిలిన కేడర్‌ పోస్టులను సైతం భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి గతంలోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 

కొత్త బెంచీల ఏర్పాటు.. 
ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన జనవరి 1 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇరు హైకోర్టులకు వేర్వేరు వెబ్‌సైట్లను రూపొందించారు. హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో కొత్త న్యాయమూర్తులతో కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేసుల విచారణలో పాత కేసులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. సీజే సహా మొదటి ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులతో బెంచీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్‌ బెంచ్‌లుగా కేసులను విచారిస్తారు.

మొదటి బెంచీలో సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, రెండో బెంచీలో జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్, మూడో బెంచీలో జస్టిస్‌ ఆర్‌.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావు ఉంటారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రిట్‌ అప్పీళ్లు, హెబియస్‌ కార్పస్‌లు, పర్యావరణ, వినియోగదారుల వివాదాలు తదితర కేసులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. క్రిమినల్‌ అప్పీళ్లు, ఉరిశిక్ష ఖరారు తదితర కేసులపై జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఇన్‌కంట్యాక్స్‌ ట్రిబ్యునల్‌ అప్పీళ్లు, వివిధ చట్టాలను, చట్ట నిబంధనలను, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన కేసులను, మనీలాండరింగ్‌ కేసులను జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది.

రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్, సివిల్‌ రివిజన్‌ పిటిషన్లు, ఒరిజినల్‌ పిటిషన్లను జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, హోం (ఎఫ్‌ఐఆర్‌ల కొట్టివేత కేసులు మినహా), కేంద్ర ప్రభుత్వ శాఖలు, వైద్య, ఆరోగ్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్‌ పి.నవీన్‌రావు, పురపాలకశాఖ, భూ సేకరణ, గనులు, రవాణా, దేవాదాయం, ఎక్సైజ్, అటవీ తదితర శాఖల కేసులను జస్టిస్‌ చల్లా కోదండరాం, క్రిమినల్‌ రివిజన్లు, క్రిమినల్‌ పిటిషన్లను జస్టిస్‌ బి.శివశంకర్‌రావు, బెయిళ్లు, క్రిమినల్‌ అప్పీళ్లను జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, పరిపాలన ట్రిబ్యునల్‌ నుంచి వచ్చిన కేసులను జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement