మంగళవారం రాజ్‌భవన్‌లో హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్‌లతో ప్రమాణం చేయించారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది.
జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్
1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు. తల్లిదండ్రులు ఎన్.భాస్కరన్ నాయర్, కె.పారుకుట్టి అమ్మ.. ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్, కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అనతికాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా, అక్కడి నుంచి బదిలీపై ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ఉమ్మడి హైకోర్టు విభజన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్, 1959 డిసెంబర్ 24న జన్మించారు.1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ సాధించారు. అదే ఏడాది రాజస్తాన్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2005 వరకు రాజస్తాన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, రాజ్యాంగపర, సర్వీసు కేసుల్లో పట్టు సాధించారు. 2005 జూన్ 13న రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బదిలీపై 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్ 23న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ వి.రామసుబ్రమణియన్
1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టీఆర్‌మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మంచివక్తగా పేరున్న జస్టిస్ రామసుబ్రమణియన్ 2016 ఏప్రిల్ 27న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్
1963 ఆగస్టు 14న పులిగోరు రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జన్మించారు. రామచంద్రారెడ్డి 1969 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో ఢిల్లీ యూని వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యి, తన తండ్రి వద్దే వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. న్యాయవాద వృత్తి నుంచి తండ్రి తప్పుకొన్న తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టు 8న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు
1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. తాత జస్టిస్ రామచంద్రరావు 1960–61 సంవత్సరా ల్లో హైకోర్టు జడ్జిగా పనిచేశారు. చిన్న తాత జస్టిస్ ఎం.కృష్ణారావు కూడా హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. జస్టిస్ రామచంద్రరావు ఎస్సెస్సీ సెయింట్ పాల్ హైస్కూల్, ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ, బీఎస్సీ మ్యాథ్స్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో చదివారు. మ్యాథ్స్‌లో ఆయన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. 1989లో ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌బీ చివరి ఏడాదిలో అత్యధిక మార్కు లు సాధించినందుకు సీవీఎస్‌ఎస్ చార్యులు బంగారు పతకాన్ని సాధించారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రఖ్యాత క్రేంబిడ్జి యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. ఈ సమయంలో ఆయనకు క్రేంబిడ్జి కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ లభించింది. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2012లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి
నల్లగొండ జిల్లా, సిరిసినగండ్ల గ్రామంలో ఎ.రామానుజరెడ్డి, జయప్రద దంపతులకు 1960 మే 4న జన్మించారు. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ ఏజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకంతో బీఎల్ డిగ్రీ సాధించారు. 1985లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది మహమూద్ అలీ వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నుంచి 2009 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు. 2013న న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ పి.నవీన్‌రావు
కరీంనగర్ జిల్లా, నంది మైడారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విమల, తండ్రి మురళీధర్‌రావు. 1986లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏ డాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి
1963 అక్టోబర్ 8న సుబ్బారావు, యశోద దంపతులకు జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యా రు. న్యాయవాది డి.లింగారావు వద్ద జూనియర్‌గా చేరారు. తర్వాత విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు వద్ద చేరి, ఉద్యోగుల సర్వీసు వివాదాల కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ చల్లా కోదండరామ్
అనంతపురం జిల్లా, చల్లావారిపల్లె గ్రామంలో 1959లో జన్మించారు. 1983లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1979 నుంచి 1988 వరకు పారిశ్రామిక రంగంలో పనిచేశారు. కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరించారు. 1988 జూన్ 24న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్‌న్యాయవాది ఎ.వెంకటరమణ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ట్యాక్స్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. సుప్రీంకోర్టు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. ఆయన వాదించిన కేసులు వివిధ జర్నల్స్‌లో 250 వరకు ప్రచురితమయ్యాయి. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ శివశంకర్‌రావు
జస్టిస్ శివశంకర్‌రావు 1959 మార్చి 29న తూర్పు గోదావరి జిల్లా, సకుర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి గవర్రాజు సర్పంచ్‌గా వ్యవహరించారు. తల్లి సూర్యకాంతం గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1984 మార్చిలో న్యాయ వాదిగా ఎన్‌రోల్ అయ్యారు. న్యాయ వాదులు పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయులు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఏపీ, తెలంగాణలో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
జస్టిస్ షమీమ్ అక్తర్
1961 జనవరి 1న నల్లగొండలో రెహీమున్సీసా బేగం, జాన్ మహ్మద్ దంపతులకు జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. పీజీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1986 నుంచి 2002 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2002లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ పి.కేశవరావు
1961 మార్చి 29న ప్రకాశరావు, జయప్రద దంపతులకు జన్మించారు. కాకతీయ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్‌కు ప్రాక్టీస్ మార్చి, ఎంవీ రమణారెడ్డి ఆఫీసులో చేశారు. 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్
1965 మార్చి 1న కృష్ణ, సావిత్రి దంపతులకు జన్మించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని శివాజీ కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వద్ద జూనియర్‌గా చేరారు. అనతికాలంలోనే సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. అమర్‌నాథ్ గౌడ్ తాత టి.అంజయ్య సంఘ సంస్కర్త. ప్యారడైజ్ థియేటర్ య జమాని. సొంత భూమిని కవాడిగూడ శ్మశానం కోసం ఇచ్చారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment