justice radhakrishnan
-
జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 6లోపు ఆయన కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. జస్టిస్ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న నిర్ణయించి, ఆ మేరకు కేంద్రానికి సిఫారసు పంపింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం.. జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీపై పునరాలోచన చేయాలని కొలీజియాన్ని కోరింది. దీంతో మరోసారి సమావేశమైన కొలీజియం, జనవరి 10న సిఫారసు చేసేటప్పుడే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని, ఆయన బదిలీపై పునరాలోచన చేసేందుకు కొత్త విషయాలేవీ తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. జనవరి 10న చేసిన సిఫారసుకే కట్టుబడి ఉన్నామని కొలీజియం ఫిబ్రవరి 19న పునరుద్ఘాటించింది. అయితే అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి సంబంధించిన ఫైల్‌ను రాష్ట్రపతికి పంపలేదు. దీంతో జస్టిస్ గొగోయ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జస్టిస్ రాధాకృషన్ బదిలీ ఫైల్‌ను రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి కోవింద్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి ఆమోదముద్ర వేశారు. రాధాకృష్ణన్ 2018, జూలై 7న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన బదిలీతో ప్రస్తుతం నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. -
కేంద్రాన్ని వివరణ కోరడం సమంజసం కాదు
సాక్షి, హైదరాబాద్ : రికార్డుల్లో తప్పుగా నమోదైన తన పుట్టిన తేదీని సవరించేందుకు చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి కార్యాలయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. పుట్టిన తేదీ సవరణ విషయంలో చట్ట నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని జస్టిస్ శివశంకరరావుకు హైకోర్టు గుర్తు చేసింది. పుట్టిన తేదీ సవరణ విషయంలో 1996 నుంచి పిటిషనర్ పెట్టుకున్న వినతి పత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం ఎంత మాత్రం సమంజసంగా ఉండదని, ఇలా అడిగితే, అది సమాజానికి తప్పుడు సంకేతం పంపినట్లవుతుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తుల పుట్టిన తేది గురించిన ప్రశ్న ఏదైనా తలెత్తినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 217(3) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని సంప్రదించి, రాష్ట్రపతి ఓ నిర్ణయం తీసుకుంటారని, ఈ అధికారాన్ని ఉపయోగించేందుకు కొన్ని పరిమితులున్నాయని హైకోర్టు పేర్కొంది. దీన్ని రాష్ట్రపతి ఇప్పటి వరకు 3–4 సార్లు మాత్రమే ఉపయోగించారంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.1959 మార్చి 29న తాను పుట్టానని, రికార్డుల్లో అది 1957 ఏప్రిల్ 10గా నమోదైందని, ఈ తప్పును సవరించాలని కోరుతూ రెండు దశాబ్దాలుగా వినతిపత్రాలు సమర్పిస్తున్నా, కేంద్రం స్పందించడం లేదని, అందువల్ల మార్చి 31లోపు ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జస్టిస్ శివశంకరరావు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.జగన్నాథశర్మ వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, పుట్టిన తేదీ సవరణ విషయంలో పిటిషనర్ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు పిటిషన్లు వేశారని, వాటిని హైకోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందని గుర్తు చేసింది. దీనికి శర్మ స్పందిస్తూ, పునః సమీక్షా పిటిషన్లో సుప్రీంకోర్టు తమకు కొంత వెసులుబాటు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ వ్యాజ్యంలో ముందుకెళ్లకుండా విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
జంతువుల హక్కులు ఎవరికీ పట్టడం లేదు
సాక్షి, హైదరాబాద్: జంతువుల హక్కుల గురించి పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మానవుడి వల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతీ జంతువు ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉందని పేర్కొంది. కొన్ని జంతువులను వాహనాల్లో కుక్కి అక్రమంగా తరలిస్తున్నారని, ఈ సమయంలో ఆ జంతువులు కాళ్లు, నడుము విరిగి వర్ణించలేనంత బాధను అనుభవిస్తున్నాయని వ్యాఖ్యానించింది. చనిపోయే సమయంలో కూడా అంత బాధను అనుభవించవని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. జంతువుల హక్కులు, వాటి సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా కొవుటూరు పవన్ కుమార్‌ను నియమించింది. జంతు హక్కుల చట్టా లు, వాటి సంరక్షణ చట్టాలు, ఆయా దేశాల్లో చట్టాలు అమలవుతున్న తీరు తదితర విషయాలన్నింటిపై తగిన అధ్యయనం చేసి తమకు సహకరించాలని పవన్‌ను కోర్టు కోరింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మతపరమైన వ్యవహారంగా భావించవద్దు.. ఇటీవల తుర్కపల్లి నుంచి షామీర్పేట వైపు వెళుతున్న డీసీఎంలో 63 గోవులు, దూడలను తరలిస్తుండగా గో సంరక్షణదళ్ సభ్యులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, తాము కేవలం గోవులను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం లేదని స్పష్టం చేసింది. దీనిని మతపరమైన వ్యవహారంగా భావించరాదని వ్యాఖ్యానించింది. ప్రతీ జంతువు హక్కుల పరిరక్షణ కోసం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. జంతువులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయంది. ఈ మొత్తం వ్యవహారంలో తగిన అధ్యయనం చేసి కోర్టుకు సహకరించేందుకు ఓ యువ న్యాయవాది అవసరమని ధర్మాసనం చెప్పగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ స్పందిస్తూ.. కొవులూరి పవన్ పేరును ప్రతిపాదించారు. ధర్మాసనం కూడా పవన్ పట్ల సానుకూలంగా స్పందించింది. జంతువుల హక్కులకు సంబంధించిన చట్టాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి తమకు సహకరించాలని పవన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ముందు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికంతా అక్రమ నిర్మాణాలు కనపడతాయి. కానీ మీకు (జీహెచ్ఎంసీ) మాత్రం కనిపించవు. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయంటే వాటిని అడ్డుకునే సమర్థత మీకు లేదా? పై స్థాయిలో ఉండే అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే, కింది స్థాయి అధికారులు సక్రమంగా ఉంటారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవచ్చని పలు చట్టాలు చెబుతున్నాయి. పర్యవేక్షణ చేయకుండా కళ్లు మూసుకుని విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై జీహెచ్ఎంసీ ఏం చర్యలు తీసుకుంటున్నట్లు? – హైకోర్టు ధర్మాసనం అక్రమ నిర్మాణాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులపై హైకోర్టు నిప్పులు చెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో వెలిసిన, వెలుస్తున్న అక్రమ కట్టడాల విషయంలో నిర్లిప్తంగా ఉన్న అధికారులపై, సిబ్బందిపై చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని మంగళవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల చేపట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ముందు అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి.. రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని, 5 అంతస్తులు నిర్మిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. మూడో అంతస్తు నిర్మించేటప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించింది. ‘విధి నిర్వహణలో ఉన్నతాధికారులు సక్రమంగా వ్యవహరిస్తే క్షేత్రస్థాయిలోని అధికారులు కూడా విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులకు ఎన్నో అధికారాలున్నాయి. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, ఏ అధికారి కూడా తమ అధికారాన్ని ఉపయోగించట్లేదు. ఆ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించే అధికారులను ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు? అక్రమ నిర్మాణదారులకన్నా ముందు ఈ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి’అని ధర్మాసనం మండిపడింది. అంతకన్నా మీరేం చేయగలరు? జీహెచ్ఎంసీ న్యాయవాది సంపత్ ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, నోటీసులు జారీ చేశామని చెప్పారు. ‘అంతకన్నా మీరేం చేయగలరు? నోటీసులిచ్చామని చెప్పడం సులభం. కానీ అక్రమ నిర్మాణాలను కూల్చేసే సమర్థత మీకు (జీహెచ్ఎంసీ) ఉందా? ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయో పర్యవేక్షించే స్థితిలో మీ అధికారుల్లేరా? విధి నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అంత అసమర్థులుగా ఉన్నారా?, అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే అణిచివేస్తుంటే హైకోర్టులో ఇన్ని వ్యాజ్యాలు దాఖలయ్యే పరిస్థితి ఉండదు. అవినీతి నిరోధక చట్టం కింద ‘అవినీతి’కి విస్తృతమైన అర్థం ఉంది. విధులను సక్రమంగా నిర్వర్తించని అధికారులకు ఈ చట్ట నిబంధనలను వర్తింపచేయాలి. ఐపీసీతో పాటు పలు చట్ట నిబంధనల కింద ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఇలాంటి అధికారుల విషయంలో జీహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్లు?’అంటూ దుయ్యబట్టింది. -
చెరువుల పరిసరాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించాలి
సాక్షి, హైదరాబాద్: చెరువుల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను చెరువుల పరిసరాల్లో నిర్దిష్ట దూరం వరకు నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే సమయంలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాలన్నింటిపై ఏం చేస్తే బాగుంటుందో తగిన సూచనలను ఓ నివేదిక రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల బారి నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్య్సకారుడు సుధాకర్ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం వీటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ (అస్కీ) ద్వారా జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా శుభ్రం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై రెండు వారాల్లో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామన్నారు. తరువాత మల్కం చెరువు పరిరక్షణ గురించి చర్చకు వచ్చింది. చట్ట ప్రకారం చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. మల్కం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అవసరమైతే పోలీసు బలగాల సాయం కూడా తీసుకోవచ్చని జీహెచ్ఎంసీకి తేల్చి చెప్పింది. చెరువుల్లో ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతుండటం వల్ల ఎదురవుతున్న దుష్ప్రభావాలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
తప్పును కప్పిపుచ్చుకునేందుకు పీడీ యాక్టా?
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులు, దానిని కప్పిపుచ్చుకునేందుకు అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అతన్ని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటును బాధితునికి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన సోదరుడు శీలం వినయ్‌కుమార్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ శీలం రవికుమార్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ కేసుకు సంబంధించి వినయ్కుమార్ని పోలీసులు గత ఏడాది అక్టోబర్ 8న అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మాదాపూర్ ఎస్ఐ రామకృష్ణ, సీఐ నాగేశ్వరరావులు కలిసి వినయ్‌ను కొట్టారని, దీంతో ప్రస్తుతం అతను కూర్చునే, నిలబడే పరిస్థితిలో కూడా లేడని ఆమె వివరించారు. అతను తీవ్ర హింసకు గురైనట్లు నిమ్స్ వైద్యులు సైతం ధ్రువీకరించారని తెలిపారు. దీంతో పోలీసులు వినయ్‌పై పలు కేసులున్నాయని పేర్కొంటూ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిని సమర్థిస్తూ హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసుల తీరును తప్పుపట్టింది. ఒక్క కేసు ఉన్న వ్యక్తిపై పలు కేసులున్నట్లు పేర్కొంటూ పీడీ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని తేల్చింది. -
చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: అఘాయిత్యాల బారినపడిన చిన్నారులకు సత్వర న్యాయం అందించడానికి దేశంలోనే తొలిసారిగా నగరంలో ఏర్పాటైన చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తిని కేటాయించనున్నారు. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు పోలీసు ఉన్నతాధికారులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. హాకా భవన్లో ఉన్న ఈ కోర్టును సందర్శించిన హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులు పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలంటే ప్రత్యేక న్యాయమూర్తి అవసరమన్న పోలీసుల ప్రతిపాదనపై సీజే సానుకూలంగా స్పందించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుతో పాటు భరోసా కేంద్రం, షీ–టీమ్స్‌ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, కొత్వాల్ అంజనీకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఇంకెన్నేళ్లు..?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ న్యాయాలయాల ఏర్పాటునకు చర్యలు తీసుకోవాలని 2016 నుంచి తాము కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకెన్నేళ్లు పడుతుందంటూ నిలదీసింది. సచివాలయం నుంచి హైకోర్టుకు ఎంత దూరం ఉం దని ఇన్నేళ్లు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటు విషయంలో సానుకూల నిర్ణయాన్ని తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటునకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.నరేంద్రగౌడ్ 2018లో పిల్ దాఖ లు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు తరఫు న్యాయవాది ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటునకు చర్యలు తీసుకోవాలని 2016లోనే తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 2018లో కూడా మరోసారి గుర్తు చేశామన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే గ్రామ న్యాయాలయాల చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి వివరించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయాలయాల ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది ఎంత మాత్రం సరికాదని, న్యాయాలయాల ఏర్పాటు విషయంలో సానుకూల నిర్ణయంతో తమ ముందుకు రావాలని స్పష్టం చేసింది. ఐకియాకు కేటాయింపులెలా జరిపారు? రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామంలో అత్యంత ఖరీదైన 13.10 ఎకరాల స్థలాన్ని అంతర్జాతీయ ఫర్నిచర్ కంపెనీ ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఐకియా షోరూమ్‌కు కోట్ల రూపాయల విలువ చేసే 13.10 ఎకరాల భూమిని నామినేషన్ పద్ధతిలో కేటాయించారని, దీని వల్ల ఖజానాకు రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంతో విలువైన, ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం తన ఇష్టానుసారం కేటాయించిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఇంతకీ పిటిషనర్ ఎవరని ఆరా తీసింది. మాజీ ఎమ్మెల్యే అని రజనీకాంత్‌రెడ్డి చెప్పగా, మరి పిటిషన్లో ఎమ్మెల్యే అని ఉందే అని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసే నాటికి పిటిషనర్ ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ తరువాత మాజీ అయ్యారని రజనీకాంత్ వివరించారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రజా ప్రతినిధులు ప్రజల గొంతుకలని, వారు తమ స్వరాన్ని చట్ట సభల్లో వినిపించాలని పేర్కొంది. అలా చేయకుండా న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించింది. ఐకియాకు జరిపిన భూకేటాయింపులకు ప్రాతిపదిక ఏమిటో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రోడ్ల వాస్తవ స్థితిగతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు జంట నగరాల్లో ప్రస్తుతం రోడ్ల వాస్తవ స్థితిగతులపై నివేదికను తమ ముందు ఉంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్కు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిని, వాహనదారులకు నరకం చూపిస్తున్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేత ఎన్.రామచంద్రరావు 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ సం దర్భంగా ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం, రోడ్లు దెబ్బతినేందుకు ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) అధికారులు కూడా కారణమని అధికారులు పేర్కొని ఉండటాన్ని గమ నించింది. దీంతో ఈ వ్యాజ్యంలో ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ను ప్రతివాదులుగా చేర్చింది. -
ఆరు ప్రశ్నల తొలగింపు ఆదేశాలపై స్టే
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ నిమిత్తం నిర్వహించిన రాతపరీక్షలో పేపర్ బుక్లెట్–బీ కోడ్‌లోని ఆరు ప్రశ్నలను తొలగించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఈ ప్రశ్నలను తొలగించిన తరువాత ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించి తాజాగా అర్హుల జాబితాను రూపొందించాలన్న ఆదేశాలను కూడా నిలుపుదల చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగినట్లయింది. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో 1,217 ఎస్ఐ పోస్టుల భర్తీ నిమిత్తం రిక్రూట్మెంట్ బోర్డు గత ఏడాది మే 31న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం గతేడాది ఆగస్టు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ బుక్లెట్–బీ కోడ్‌లోని ఆరు ప్రశ్నలు తప్పని, వాటి సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, దీని వల్ల తమకు నష్టం కలిగిందంటూ నల్లగొండకు చెందిన డి.ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, బుక్లెట్–బీ కోడ్‌లోని 117, 138, 172, 181, 185, 189 ప్రశ్న లను తొలగించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించారు. ఆరు ప్రశ్నలు తొలగించిన తరువాత తిరిగి అర్హుల జాబితాను రూపొందించాలని బోర్డుకు స్పష్టం చేశారు. అర్హుల జాబితా రూపొందించేటప్పుడు, అర్హత సాధించినవారిని మినహాయించాలని తెలిపారు. తాజా జాబితాలో ఒక్కో అభ్యర్థి హాల్ టికెట్ ఎదురుగా అతని మార్కులను పొందుపర చాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్‌పై సోమ వారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయ సమీక్ష సరికాదు.. బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్న ఆ ఆరు ప్రశ్నల్లో తప్పులు లేవన్నారు. ప్రశ్నపత్రాన్ని నిపుణుల కమిటీ రూపొందించిందని వివరించారు. ఇలాంటి అంశాలపై న్యాయసమీక్ష సరికాదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మాదిరి అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్లను ప్రచురించడం జరుగుతుందే తప్ప, వారు సాధించిన మార్కులను ప్రచురించడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. పిటిషనర్లకు ప్రయోజనకరం : అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే అర్హత సాధించిన వారి విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలులేవన్నారు. ఆరు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి కాబట్టే, కోర్టుకొచ్చామన్నారు. ఆ ఆరు ప్రశ్నలను తొలగించడం వల్ల పిటిషనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. సామీప్యత ఆధారంగా సమాధానం ఇవ్వొచ్చు.. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఓ ప్రశ్నకు సమాధానాన్ని భిన్న పద్ధతుల్లో చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో సామీప్యత ఆధారంగా సమాధానంపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ కేసులో 610 జీవోకు సంబంధించిన ప్రశ్నకు సమాధానాల్లో గిర్గ్లానీ, జయభారత్ కమిషన్లు సమాధానంగా ఉన్నాయని, ఇందులో గిర్గ్లానీ కమిషన్‌ను సమాధానంగా ఎంచుకుని ఉండొచ్చని తెలిపింది. తన పేరును కొందరు టీబీఎన్ రాధాకృష్ణన్‌గా, టీబీ రాధాకృష్ణన్‌గా రాస్తుంటారని, ఎలా రాసినా తప్పుకాదన్నారు. నియామకాల ప్రక్రియ 90 శాతం పూర్తయిన దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపింది. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. మార్కులు తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. -
హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రా«ధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయిం చింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన డీకే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిజ్ రంజన్‌గొగాయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన కొలీజియం గురువారం భేటీ అయ్యింది. జస్టిస్ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ భేటీలో తీర్మానించింది. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ గతేడాది జూలై 1న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు. వచ్చిన 6 నెలలకే ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో రెండో స్థానంలో కొనసాగుతున్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశముంది. కేరళలో పని చేస్తున్న జస్టిస్ దామ శేషాద్రినాయుడును బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. శేషాద్రినాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. జస్టిస్ రాధాకృష్ణన్ నేపథ్యమిదీ.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కేరళకు చెందినవారు. తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్.. కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1988లో తన ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అతి తక్కువ కాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015న అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. -
అలా తీర్పిస్తే 21 రోజుల్లో ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే విలీన గ్రామ పంచాయతీలకు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు... పంచాయతీలను విలీనం చేస్తూ దాఖలైన దాదాపు 100 పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ పంచాయతీలను డీనోటిఫై చేసి వాటి పరిధిలో వ్యవసాయేతర రంగాలపై ఆధారపడిన వారి జనాభా, వారి స్థితిగతులు, తలసరి ఆదాయం వంటి విషయాలపై అధ్యయనం చేయాల్సి ఉండగా అవేమీ చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గ్రామ పంచాయతీల స్వతంత్రతకు భంగం కలుగుతోందన్నారు. గ్రామ పంచాయతీల విలీనం విషయంలో ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారని, దీంతో ఆ విలీన పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీలను కాలగర్భంలో కలిపేస్తారా? చట్ట నిబంధనల మేరకు అధ్యయనం చేశాకే పంచాయతీలపై విలీన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు పేర్కొన్నారు. పలు పంచాయతీలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలన్నీ మున్సిపాలిటీల ద్వారానే అందుతున్నాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మున్సిపాలిటీలను విస్తరించే పరిధి ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించింది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించే అధ్యయం చేశారా అంటూ సందేహం వ్యక్తం చేసింది. జీన్స్ వేసుకొని కాస్త మోడ్రన్‌గా కనిపిస్తే పట్టణీకరణ పేరిట పంచాయతీలను కాలగర్భంలో కలిపేస్తారా? అంటూ నిలదీసింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ పంచాయతీల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఐదేళ్లపాటు వారిని ఏమీ చేయలేం... ఈ సమయంలో ధర్మాసనం తిరిగి జోక్యం చేసుకుంటూ పిటిషనర్ల అభ్యర్థనల మేరకు ఆదేశాలు జారీ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీల కాల పరిధి ఐదేళ్లని, ఒకసారి చట్టబద్ధంగా పంచాయతీలకు ఎన్నికైన వారిని ఐదేళ్లపాటు తప్పించడం సాధ్యం కాదని రామచంద్రరావు వివరించారు. దీనివల్ల మున్సిపాలిటీల నుంచి అందే సౌకర్యాలు అందక ప్రజలు ఐదేళ్లపాటు ఇబ్బంది పడుతారని తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చి, పంచాయతీల విలీనం చెల్లదని హైకోర్టు ప్రకటిస్తే ఆ పంచాయతీలకు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో ఈ హామీని నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21న చేపడతామని స్పష్టం చేసింది. -
1.87 లక్షల కేసులతో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా కొలువు దీరిన తెలంగాణ హైకోర్టు బుధవారం తొలిరోజు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేసుల విచారణకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) మొదటి కోర్టు హాలులో సమావేశమయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి, న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కావడం తనకు దక్కిన గౌరవం అని సీజే జస్టిస్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 1.87 లక్షల కేసులతో తెలంగాణ హైకోర్టు తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోందని వెల్లడించారు. అనేక చారిత్రక ఘట్టాలకు ఈ న్యా యస్థానం వేదికగా నిలిచిందన్నారు. న్యాయ వాదులు, న్యాయమూర్తులుగా అత్యుత్తమ స్థాయిలో విధులు నిర్వర్తించేందుకు బద్ధులుగా ఉంటామని మనకు మనం ప్రతిజ్ఞ చేసుకోవాలని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయవాదుల సంఘాలు, అడ్వొకేట్లు జనరల్, ప్రభుత్వ అపరిమిత మద్దతు వల్ల, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది కృషి వల్ల ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా రూపాంతరం చెందిందన్నా రు. సకాలంలో న్యాయా న్ని అందించే దిశగా క్రమశిక్షణ, సమతుల్యతను అలవరుచుకో వాలని న్యాయమూర్తులకు సూచించారు. బార్, బెంచ్ కలిస్తేనే.. న్యాయవాదులు(బార్), న్యాయమూర్తులు (బెంచ్) కలసి పరిమాణాత్మక, గుణాత్మక దిశ గా పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని సీజే ఆశాభావం వ్యక్తం చేశారు. బార్, బెంచ్ నాణేనికి రెండు ముఖాలు మాత్రమే కాదని, న్యాయరథానికి రెండు చక్రాలు కూడా అని అన్నారు. ఇవి న్యాయప్రతిష్టను ముందుకు తీసుకెళ్తాయన్నారు. తెలంగాణలో అత్యున్నత న్యాయస్థానం ఉన్న ఈ కేంద్రం నుంచి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు కలసి నడుద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఏజీ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ చారిత్రకఘట్టాలకు సాక్షులుగా నిలవడం గౌరవంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట, విలువను కాపాడేందుకు న్యాయవాదులంతా కృషి చేస్తామన్నారు. బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి, న్యాయవ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు బార్‌కౌన్సిల్ కట్టుబడి ఉందన్నారు. న్యా యవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జడ్జీల ఖాళీలను భర్తీచేయాలని, అప్పుడే సత్వర న్యాయం సాధ్యమవుతుందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమం అనంతరం కేసుల విచారణ ప్రారంభమైంది. -
హైకోర్టు ఉద్యోగుల కేటాయింపులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల విభజన కూడా పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చిన వారందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించారు. వీరంతా నాలుగో తేదీలోపు అమరావతి వెళ్లి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) వద్ద రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ (అడ్మిన్) డి.నాగార్జున సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన వారిలో చాలా మందిని వారి వారి కేడర్‌లో పోస్టులు ఖాళీ లేకపోవడంతో డిప్యుటేషన్‌పై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పేర్కొన్నారు. మరికొంత మందిని తెలంగాణలోనే కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై చేరాలని స్పష్టం చేశారు. జాయింట్ రిజిస్ట్రార్ పి.శ్రీధర్‌రావు తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇవ్వగా ఆయనను ఏపీ హైకోర్టుకు డిప్యూట్ చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో 12 మందిని, సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 51 మందిని, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 13 మందిని, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో 36 మందిని, ఎగ్జామినర్ల కేడర్‌లో 7 మందిని ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లాలని ఆదేశించారు. అసిస్టెంట్ కేడర్‌లో 67 మందిని, ఆఫీస్ సబార్డినేట్ కేడర్‌లో 151 మందిని తెలంగాణలోని కింది కోర్టులో పనిచేయాలని స్పష్టం చేశారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చి కేడర్ పోస్టులు ఖాళీగా లేనందున ఏపీ హైకోర్టుకు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులతో ఆయా కేడర్‌లో భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేశారు. తెలంగాణ హైకోర్టులో ఆయా కేడర్‌లో ఖాళీ అయ్యే పోస్టుల్లోకి వీరు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో తెలంగాణ హైకోర్టులో ఒక పోస్టు ఖాళీ అయిందనుకుంటే, ఆ పోస్టును ఏపీ హైకోర్టు డిప్యుటేషన్‌పై పంపిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లలో సీనియర్ అయిన అధికారి చేత భర్తీ చేస్తారు. ఇదే రీతిలో మిగిలిన కేడర్ పోస్టులను సైతం భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి గతంలోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త బెంచీల ఏర్పాటు.. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన జనవరి 1 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇరు హైకోర్టులకు వేర్వేరు వెబ్సైట్లను రూపొందించారు. హైకోర్టు విభజన జరిగిన నేపథ్యంలో కొత్త న్యాయమూర్తులతో కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేసుల విచారణలో పాత కేసులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. సీజే సహా మొదటి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో బెంచీలు ఏర్పాటయ్యాయి. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ బెంచ్‌లుగా కేసులను విచారిస్తారు. మొదటి బెంచీలో సీజే జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, రెండో బెంచీలో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, మూడో బెంచీలో జస్టిస్ ఆర్.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావు ఉంటారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, రిట్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్‌లు, పర్యావరణ, వినియోగదారుల వివాదాలు తదితర కేసులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. క్రిమినల్ అప్పీళ్లు, ఉరిశిక్ష ఖరారు తదితర కేసులపై జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఇన్‌కంట్యాక్స్ ట్రిబ్యునల్ అప్పీళ్లు, వివిధ చట్టాలను, చట్ట నిబంధనలను, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులను, మనీలాండరింగ్ కేసులను జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, సివిల్ రివిజన్ పిటిషన్లు, ఒరిజినల్ పిటిషన్లను జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, హోం (ఎఫ్ఐఆర్ల కొట్టివేత కేసులు మినహా), కేంద్ర ప్రభుత్వ శాఖలు, వైద్య, ఆరోగ్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు పలు ఇతర శాఖల కేసులను జస్టిస్ పి.నవీన్‌రావు, పురపాలకశాఖ, భూ సేకరణ, గనులు, రవాణా, దేవాదాయం, ఎక్సైజ్, అటవీ తదితర శాఖల కేసులను జస్టిస్ చల్లా కోదండరాం, క్రిమినల్ రివిజన్లు, క్రిమినల్ పిటిషన్లను జస్టిస్ బి.శివశంకర్‌రావు, బెయిళ్లు, క్రిమినల్ అప్పీళ్లను జస్టిస్ షమీమ్ అక్తర్, పరిపాలన ట్రిబ్యునల్ నుంచి వచ్చిన కేసులను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారిస్తారు. -
కొలువుదీరిన కొత్త హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు. తల్లిదండ్రులు ఎన్.భాస్కరన్ నాయర్, కె.పారుకుట్టి అమ్మ.. ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్, కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అనతికాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా, అక్కడి నుంచి బదిలీపై ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ఉమ్మడి హైకోర్టు విభజన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్, 1959 డిసెంబర్ 24న జన్మించారు.1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ సాధించారు. అదే ఏడాది రాజస్తాన్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2005 వరకు రాజస్తాన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, రాజ్యాంగపర, సర్వీసు కేసుల్లో పట్టు సాధించారు. 2005 జూన్ 13న రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బదిలీపై 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్ 23న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టీఆర్మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మంచివక్తగా పేరున్న జస్టిస్ రామసుబ్రమణియన్ 2016 ఏప్రిల్ 27న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ 1963 ఆగస్టు 14న పులిగోరు రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జన్మించారు. రామచంద్రారెడ్డి 1969 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో ఢిల్లీ యూని వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి, తన తండ్రి వద్దే వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. న్యాయవాద వృత్తి నుంచి తండ్రి తప్పుకొన్న తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టు 8న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు 1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. తాత జస్టిస్ రామచంద్రరావు 1960–61 సంవత్సరా ల్లో హైకోర్టు జడ్జిగా పనిచేశారు. చిన్న తాత జస్టిస్ ఎం.కృష్ణారావు కూడా హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. జస్టిస్ రామచంద్రరావు ఎస్సెస్సీ సెయింట్ పాల్ హైస్కూల్, ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ, బీఎస్సీ మ్యాథ్స్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో చదివారు. మ్యాథ్స్‌లో ఆయన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. 1989లో ఓయూ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్బీ చివరి ఏడాదిలో అత్యధిక మార్కు లు సాధించినందుకు సీవీఎస్ఎస్ చార్యులు బంగారు పతకాన్ని సాధించారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రఖ్యాత క్రేంబిడ్జి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. ఈ సమయంలో ఆయనకు క్రేంబిడ్జి కామన్వెల్త్ స్కాలర్షిప్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ లభించింది. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2012లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి నల్లగొండ జిల్లా, సిరిసినగండ్ల గ్రామంలో ఎ.రామానుజరెడ్డి, జయప్రద దంపతులకు 1960 మే 4న జన్మించారు. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ ఏజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకంతో బీఎల్ డిగ్రీ సాధించారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది మహమూద్ అలీ వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నుంచి 2009 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు. 2013న న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.నవీన్‌రావు కరీంనగర్ జిల్లా, నంది మైడారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విమల, తండ్రి మురళీధర్‌రావు. 1986లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏ డాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి 1963 అక్టోబర్ 8న సుబ్బారావు, యశోద దంపతులకు జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యా రు. న్యాయవాది డి.లింగారావు వద్ద జూనియర్‌గా చేరారు. తర్వాత విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు వద్ద చేరి, ఉద్యోగుల సర్వీసు వివాదాల కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ చల్లా కోదండరామ్ అనంతపురం జిల్లా, చల్లావారిపల్లె గ్రామంలో 1959లో జన్మించారు. 1983లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1979 నుంచి 1988 వరకు పారిశ్రామిక రంగంలో పనిచేశారు. కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరించారు. 1988 జూన్ 24న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్న్యాయవాది ఎ.వెంకటరమణ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ట్యాక్స్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. సుప్రీంకోర్టు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. ఆయన వాదించిన కేసులు వివిధ జర్నల్స్‌లో 250 వరకు ప్రచురితమయ్యాయి. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ శివశంకర్‌రావు జస్టిస్ శివశంకర్‌రావు 1959 మార్చి 29న తూర్పు గోదావరి జిల్లా, సకుర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి గవర్రాజు సర్పంచ్‌గా వ్యవహరించారు. తల్లి సూర్యకాంతం గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పీహెచ్డీ పూర్తి చేశారు. 1984 మార్చిలో న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయ వాదులు పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయులు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఏపీ, తెలంగాణలో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ షమీమ్ అక్తర్ 1961 జనవరి 1న నల్లగొండలో రెహీమున్సీసా బేగం, జాన్ మహ్మద్ దంపతులకు జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. పీజీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1986 నుంచి 2002 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2002లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.కేశవరావు 1961 మార్చి 29న ప్రకాశరావు, జయప్రద దంపతులకు జన్మించారు. కాకతీయ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్‌కు ప్రాక్టీస్ మార్చి, ఎంవీ రమణారెడ్డి ఆఫీసులో చేశారు. 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 1965 మార్చి 1న కృష్ణ, సావిత్రి దంపతులకు జన్మించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని శివాజీ కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వద్ద జూనియర్‌గా చేరారు. అనతికాలంలోనే సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. అమర్నాథ్ గౌడ్ తాత టి.అంజయ్య సంఘ సంస్కర్త. ప్యారడైజ్ థియేటర్ య జమాని. సొంత భూమిని కవాడిగూడ శ్మశానం కోసం ఇచ్చారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
కొలువు దీరిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్:అమరావతి రాజధాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలువు తీరింది. రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సలసా వెంకట నారాయణ బట్టు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మందాడ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్‌చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యానారాయణ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావులు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ వేదికపై ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జిల్లా జడ్జి వై.లక్ష్మణరావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు ఏర్పడినంత మాత్రాన మన కర్తవ్యం తీరిపోలేదని, దీన్ని ఒక ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని, అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కలసి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత(10 కోర్టు హాల్స్) న్యాయస్థానం భవన సముదాయాలను ప్రారంభించారు. మొత్తం పది కోర్టులను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. హైకోర్టు నిర్వహించాల్సిన విధులు క్లిష్టతరంగాను, సున్నితంగాను ఉంటాయన్నారు. వ్యక్తికి–వ్యక్తికి, వ్యక్తికి–ప్రభుత్వానికి వచ్చే వ్యాజ్యాలు విచారించి న్యాయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కర్తవ్యాన్ని నిష్కర్షగా నిర్వహించాల్సి ఉందని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా రాజ్యాంగంలో నిబిడీకృతమైన అంశాలకూ ప్రాధాన్యమివ్వాలన్నారు. తీర్పులు వెల్లడించే సమయంలో న్యాయమూర్తులు స్వతంత్రంగానూ, నిష్కర్షగానూ వ్యవహరించాలని ఉద్బోధించారు. అనువైన సంఘ నిర్వహణకు నిర్మించబడిన సంస్థల్లో న్యాయ సంస్థ కూడా ఒకటన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవభావం ఉండేలా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. హైకోర్టు తరలిరావడంతో ఇక్కడి కక్షిదారులకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఈ నెల 21న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాక.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సందేశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ చదివి విన్పించారు. రాష్ట్రంలో న్యాయ విభాగం కార్యకలాపాలు విస్తృతమయ్యాయని, మరింత బలోపేతమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన సందేశంలో పేర్కొన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుది అతిపిన్న వయస్సు అని అన్నారు. మన న్యాయవ్యవస్థ నిస్సందేహంగా గర్వించదగినదిగా ఉండాలని, ఇందుకు మన బాధ్యత ఎంతో ఉందని, ఆనందంతో మన విధుల్లో భాగస్వాములమవ్వాలని ఉద్బోధించారు. న్యాయవ్యవస్థలో న్యాయవాదులు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని తన సందేశంలో ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల 21న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ చేతుల మీదుగా అమరావతిలోని తాత్కాలిక హైకోర్టు నూతన భవనాలను ప్రారంభించి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించారు. ఇదో చరిత్రాత్మక ఘట్టం: జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అమరావతి రాజధాని కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు కావడం చరిత్రాత్మక ఘట్టమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోవడం ప్రశంసనీయమని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు వ్యవస్థ చరిత్రలో పునరావృతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి హైకోర్టు గుంటూరు కేంద్రంగా పనిచేసిందని, తదుపరి 1956లో హైదరాబాద్‌కు తరలించడం జరిగిందని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగాక తిరిగి అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలు చేపట్టడం చరిత్రాత్మకమైన ఘట్టమని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. విభజన పూర్తయ్యింది: సీఎం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు రాకతో విభజన పూర్తయిందని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిధులు, ఆస్తుల విభజన తప్ప తరలింపు మొత్తం పూర్తయినట్టేనన్నారు. అమరావతికి హైకోర్టు తరలడానికి తక్కువ సమయం ఇచ్చారన్నారు. హైకోర్టు విధుల నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా చూస్తామని చెప్పారు. విభజన సమస్యలున్నా అన్నింటినీ అధిగమిస్తున్నామని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1న నూతన హైకోర్టును ప్రారంభించుకోవడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా తాను, తొలి గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టామని, ఇప్పుడు హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్ వ్యవహరించడం చరిత్ర అని పేర్కొన్నారు. ఇక్కడినుంచే న్యాయపరిపాలనకు శ్రీకారం చుట్టామని, మనందరం కలసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదామని అన్నారు. నేటినుంచి తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు.. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తయింది. అమరావతి కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు కార్యాలయం కోసం 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక హైకోర్టును సందర్శించిన చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తుళ్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పలువురు న్యాయవాదుల బృందం ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ బృందం అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ద్వారా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్థానమిదీ.. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. ఎంతోమంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించి న్యాయ సహాయాన్ని చేశారు. ఆయన కుమారుడైన ప్రవీణ్‌కుమార్ 10వ తరగతి వరకు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదివారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అతి తక్కువ కాలంలోనే తండ్రి మాదిరిగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టుకు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పివీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్థానమిదీ.. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. ఎంతోమంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించి న్యాయ సహాయాన్ని చేశారు. ఆయన కుమారుడైన ప్రవీణ్‌కుమార్ 10వ తరగతి వరకు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదివారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అతి తక్కువ కాలంలోనే తండ్రి మాదిరిగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాత్కాలిక హైకోర్టును సందర్శించిన చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తుళ్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పలువురు న్యాయవాదుల బృందం ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ బృందం అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ద్వారా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జస్టిస్ ఎస్.వి నారాయణబట్టు 1962లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో రామకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా మదనపల్లెలో కొనసాగింది. బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఈ.కళ్యాణ్‌రామ్ వద్ద వృత్తిపరమైన మెళకువలు నేర్చుకున్నారు. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ కుటుంబంలో 1962లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా భీమవరంలోనే సాగింది. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాదులు పి.రాజగోపాలరావు, పి.రాజారావుల వద్ద వృతి జీవితాన్ని ఆరంభించారు. సివిల్, క్రిమినల్, సర్వీసు చట్టాలపై పట్టు సాధించారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేపట్టారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సంగీతం, కళలపై మంచి మక్కువ. జస్టిస్ ఎం.సీతారామమూర్తి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో న్యాయవాద కుటుంబంలో జన్మించారు. వారి వంశంలో మూడో తరం న్యాయవాదిగా ఈయన నిలిచారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 12 సంవత్సరాలపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తరువాత జ్యుడీషియల్ సర్వీసుల్లో ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. ఉత్తమ న్యాయాధికారిగా పలు పతకాలు అందుకున్నారు. యోగా, సంగీతం, ప్రయాణాలంటే ఆసక్తి. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విజయనగరం జిల్లాలో 1962లో న్యాయవాద కుటుంబంలో జన్మించారు. తాత ఉప్మాక నారాయణమూర్తి విజయనగరం, పార్వతీపురంలలో ప్రముఖ న్యాయవాదిగా, శతావధానిగా పేరుగాంచారు. తల్లి తరఫున వారు కూడా న్యాయవాదులే. భార్య, ఆమె తండ్రి కూడా న్యాయవాదులే. 1986లో బొబ్బిలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1998లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి 1957 ఫిబ్రవరి 4న ప్రకాశం జిల్లా కారం చేడులో వెంకటాద్రి, వీరమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కారంచేడులోనే కొనసాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. చీరాలలో పి.వెంకటాద్రి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. తరువాత జస్టిస్ జె.చలమేశ్వర్(సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేశారు) వద్ద పనిచేశారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 1998లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1960 జూన్ 14న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యాభాస్యమంతా మచిలీపట్నంలోనే సాగింది. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ సాధించారు. న్యాయవాదిగా ఎన్రోల్ అయి, మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. యక్కాల పాండురంగారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1991లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సతీమణి రమణకుమారి ప్రస్తుతం న్యాయాధికారిగా పనిచేస్తున్నారు. జస్టిస్ జి.శ్యాంప్రసాద్ గుంటూరులో 1958 సెప్టెంబర్ 27న మల్లికార్జునరావు, సావిత్రమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులోనే సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ సాధించారు. న్యాయవాదిగా ఎన్రోల్ అయి ఎన్.చలపతిరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు.1985లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో సేవలు అందించారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ జె.ఉమాదేవి 1959 సెప్టెంబర్ 26న అనంతపురం జిల్లాలో జ్ఞానోబారావు, తులసీబాయి దంపతులకు జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ, అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టాలు పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వరదారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి ఉభయ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్.బాలయోగి తూర్పుగోదావరి జిల్లా పెయ్యలవారిపేట గ్రామంలో 1957 జనవరి 15న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, సీనియర్ న్యాయవాదిగా వెంకటరామయ్య వద్ద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తరువాత జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ టి. రజని ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో 1958 నవంబర్ 6న వెంకటప్పయ్య, రామతులసమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల నుంచి కాలేజీ వరకు విద్యాభ్యాసం గుంటూరులో సాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1981లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2002 వరకు గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు 1961 సెప్టెంబర్ 26న జన్మించారు. తండ్రి డీవీ సుబ్బారావు ప్రముఖ న్యాయకోవిదుడు. విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే సాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యునిగా కొనసాగారు. స్వచ్ఛభారత్ అంబాసిడర్‌గా నామినేట్ అయ్యారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కింది కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ కొంగర విజయలక్ష్మి గుళ్లాపల్లి వెంకటేశ్వరరావు, సీతారత్నం దంపతులకు 1960 సెప్టెంబర్ 20న జన్మించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. విద్యార్థి దశలో వివిధ బహుమతులు అందుకున్నారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, న్యాయవాదిగా పనిచేశారు. ఈమె జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వద్ద కూడా పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.గంగారావు అనంతపురం జిల్లా గుంతకల్లులో 1961 ఏప్రిల్ 8న చింతామణి, గోవిందమ్మ దంపతులకు జన్మించారు. అనంతపురంలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1987లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ బీఎస్ఏ స్వామి, జస్టిస్ సీవీ రాములు వద్ద జూనియర్‌గా చేరి వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
-
తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్ లా కాలేజీ నుంచి లాయర్ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్ లాయర్‌గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్ చేతుల మీదుగా 12మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీ రామచంద్ర రావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావ్ 5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి 6. జస్టిస్ బులుసు శివ శంకర్ రావు 7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్ 8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు 9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్ 11. జస్టిస్ వి రామ సుబ్రహ్మణ్యన్ 12.ఆర్ ఎస్ చౌహన్ -
బార్‌కు.. బెంచ్‌కి మధ్య సమన్వయం అవసరం
సాక్షి, విశాఖపట్నం: బార్ అసోసియేషన్‌లో కూర్చున్న వారే తర్వాతి రోజుల్లో బెంచ్‌లో తీర్పులిస్తుంటారని.. అందువల్ల బార్‌కు, బెంచ్‌కి మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ అన్నారు. దిగువ కోర్టు తీర్పులను కనీసం చదవకుండా పైస్థాయి కోర్టుల్లో వాదించడం వల్ల తీర్పులకు ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తున్నాయని, తద్వారా సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో శనివారం సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రాధాకృష్ణన్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ దివంగత డీవీ సుబ్బారావు స్మారకోపన్యాసం చేశారు. న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, నగర మేయర్‌గా, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు అధ్యక్షుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి మన్ననలు అందుకున్న సుబ్బారావు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. కొందరు కక్షిదారులు కేసులో తమ తరఫున న్యాయవాదులను నియమించుకొని, విచారణ సమయంలో వారు కోర్టులకు రావట్లేదన్నారు. కక్షిదారులు విధిగా కోర్టులకు రావాలని, అప్పుడే తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది, న్యాయవాదులు ఏవిధంగా వాదిస్తున్నారో అర్థమవుతుందన్నారు. తీర్పు చెప్పేటప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్న వారు ఒకటి రెండుసార్లు ఆలోచించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీర్పులివ్వాలని సూచించారు. న్యాయస్థానాల్లో అందరూ సమానులేనని స్పష్టం చేశారు. తాను న్యాయవాదిగా ఉన్నంత కాలం ఏనాడూ అలసత్వం వహించలేదని, సత్యం మాత్రమే ప్రకటించి కక్షిదారులకు సహాయం చేశానని గుర్తు చేశారు. సత్యాన్ని నమ్ముకుంటే న్యాయం దానంతట అదే వస్తుందన్న సిద్ధాంతాన్ని న్యాయవాదులు ముందుగా తెలుసుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ (బెంగుళూరు) ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీ సోమయాజులు, విశాఖకు చెందిన న్యాయనిపుణులు, విద్యావేత్తలు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిషేధంపై ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులు ముందుకెళ్లనివ్వరని, వారు తమ ఆర్థిక, రాజకీయ పరపతిని ఉపయోగిస్తారని, దీనిని తట్టు కుని నిలబడితేనే నిషేధం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణ(ఈపీ) చట్టం కింద ప్రభుత్వానికి విస్తృతాధికారాలు ఉన్నాయని, అయితే వాటిని ఉపయోగించ డం లేదని హైకోర్టు ఆక్షేపించింది. ప్లాస్టిక్ నిషేధ నిర్ణ యం ప్రభుత్వస్థాయిలో తీసుకోవాల్సినదని తెలిపింది. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాల తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడే నిషేధం సాధ్యమవుతుందని వివరించింది. ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేకుంటే తామే ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తామంటూ హైకోర్టు తన వైఖరిని తేల్చిచెప్పింది. కుంకుమ, పసుపు తదితరాలను ప్లాస్టిక్ కవర్లో వేసి వాటిని అయ్యప్ప ఇరుముడిలో ఉంచేందుకు సైతం శబరిమల ఆలయంలో అనుమతించడం లేదని, అక్కడ అంతస్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఇక్కడ కూడా అదేస్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్ప నిషేధం సాధ్యం కాదని పేర్కొంది. దేవస్థానాల్లో పూజాసామగ్రి అమ్మేషాపులు విరివిగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నాయని, అధికారులకు ఆ షాపులపై వచ్చే ఆదాయం తప్ప, సామగ్రికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు కనిపించవని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్లాస్టిక్ నిషేధంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవస్థానాల్లో అసౌకర్యాలు, నిర్వహణ లోటుపాట్లపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ నిషేధంపై ఏజీ నివేదిక దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధానికి తీసుకుంటున్న చర్యలపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం తమ ఆదేశాలను దేవాదాయశాఖ అధికారులు సక్రమంగా అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. దేవస్థానాల వద్ద ఉన్న షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల ద్వారానే పూజాసామగ్రిల విక్రయాలు సాగుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతానికి ప్లాస్లిక్‌పై దశలవారీగా నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలంది. దేవస్థానాల చుట్టూ నిర్ధిష్ట పరిధిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది. ప్లాస్టిక్ వల్ల మురుగుకాలువలు పూడిపోయి, మురుగునీరు సాఫీగా వెళ్లడంలేదంది. ప్లాస్టిక్ భూతం వల్ల అడవుల్లో పులులు వంటి ఎన్నో జంతువులను కోల్పోతున్నామంది. విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. -
ఏమిటీ జాప్యం..
సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో న్యాయస్థానాలు పంపుతున్న నోటీసులు, సమన్లు తదితరాలను ఆయా వ్యక్తులకు అందచేయడంలో పోస్టల్ విభాగం చూపుతున్న నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. న్యాయస్థానాల నుంచి వెళ్లే నోటీసులు, సమన్లు తదితరాలను అందచేసే విషయంలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పోస్టల్‌శాఖపై ప్రజలు నమ్మకం కోల్పోతారంది. ఇదే సమయంలో నోటీసుల అందచేతలో జరిగే అసాధారణ జాప్యంవల్ల మొత్తం న్యాయవ్యవస్థే కదిలిపోయే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టుల నుంచి వెళ్లే నోటీసులు తదితరాలను అందచేసే విషయంలో పోస్టల్ సిబ్బంది చాలా ఉదాసీనంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, ఎవరికి నోటీసులు అందచేయాలో ఆవ్యక్తి లేరని, గ్రామం నుంచి వెళ్లిపోయారని, అసలు అటువంటి చిరునామానే లేదని, చిరునామా తప్పు అని పలు కారణాలతో నోటీసులు అందచేయకుండా తిరిగి వెనక్కి పంపుతున్నారంది. ఇలా చేయడం విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడమేనని స్పష్టం చేసింది. కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వ్యక్తులకు సకాలంలో నోటీసులు అందకపోవడం వల్ల న్యాయస్థానాల్లో కేసులు సత్వర విచారణకు నోచుకోవడం లేదని పేర్కొంది. కింది కోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో పోస్టల్ శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితిపై పోస్టల్ శాఖలోని ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పేర్కొంది. ఉదాసీనంగా ఉండే సిబ్బందిపై చర్యలకు ఆదేశం విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం వారికి బయటకు వెళ్లే ద్వారాలను చూపాలంది. న్యాయస్థానాలు ఇచ్చే నోటీసులను సంబంధిత వ్యక్తులకు అందచేయకపోవడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. పోస్టల్ అధికారులు తాము నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించకపోవడమేనని పేర్కొంది. ఈ ఆదేశాల గురించి తెలంగాణ పోస్ట్‌మాస్టర్ జనరల్ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇందులో కేంద్ర పోస్టల్‌శాఖ కార్యదర్శి, తెలంగాణ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చాలంది. ఈ వ్యాజ్యంపై ఈ నెల 28న విచారణ చేపడతామని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
గుత్తికోయల గుడిసెలను కూల్చొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వారి గుడిసెలను కూల్చివేయరాదని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారి జీవనానికి కావా ల్సిన కనీస సౌకర్యాలను కల్పించాలని తెలిపింది. అక్కడే నివాసం ఉంటున్న వారిని తాత్కాలిక ప్రాతిపదికన వ్యవసాయం చేసుకునేందుకు అనుమతించాలని పేర్కొంది. చెట్లను కూల్చి వ్యవసాయం చేయరాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అక్కడ ఉంటున్న వారు మినహా కొత్తవారు వెళ్లి వ్యవసాయ కార్యకలాపాలను విస్తరించడానికి వీల్లేదని తెలిపింది. మొత్తం వ్యవహారంలో తమ వైఖరిని తెలియచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులకు ఏ ఏ చట్టాలు వర్తిస్తాయి.. వాటి ప్రకారం వారికి రావాల్సిన ప్రయోజనాలు ఏమిటి.. వారికి అందాల్సిన పథకాలు ఏమిటి.. తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వలస వచ్చి రాష్ట్రంలోని పలు జిల్లాల అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గుత్తికోయలను ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించడం లేదని, వారికి ప్రభుత్వ పథకాలు సైతం అందడం లేదంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. కథనాలపై స్పందించిన హైకోర్టు, వీటిని సుమోటో పిల్‌గా మలిచింది. గుత్తికోయలకు సంబంధించి గతంలో దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కూడా పిల్‌కు జత చేసింది. ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో ధర్మాసనం ఇచ్చి న ఆదేశాల మేరకు మొత్తం వ్యవహారంపై ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఓ నివేదికను కోర్టు ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వలస వచ్చి దశాబ్దాలుగా నివాసం ఉంటున్న గుత్తికోయలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. గుత్తికోయల స్థితిగతులు తదితర అంశాలకు సంబంధించి తమకు ఓ నివేదికను సమర్పించాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. -
విధి నిర్వహణలో రాజీపడలేదు
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తిగా ఉన్న సమయంలో తనపై జరిగిన కుట్ర గురించి ఇప్పటివరకు ఎక్కడా వ్యాఖ్యానించని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తొలిసారి పెదవి విప్పారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, నీతి నిజాయితీ విషయంలో రాజీపడనందుకు తనను కొందరు లక్ష్యంగా చేసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువసార్లు తనను ఉరికంబం వరకు తీసుకెళ్లారని, అయితే ప్రతీసారి దేవుడు తనను రక్షించారని అన్నారు. తనపై జరిగిన పెద్దకుట్ర నుంచి ఏ మచ్చా లేకుండా బయటపడ్డానంటే అందుకు దేవుడి దయే కారణమని తెలిపారు. ఆ సమయంలో తన కుటుంబసభ్యులు, స్నేహితులు, న్యాయవాదుల మద్దతు కూడా చాలా ఉందని, వీరందరి రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. తాను అనుభవించిన కష్టాలు, బాధలకు ఏ వ్యక్తి గానీ, బృందాన్ని గానీ నిందించడం లేదని అన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు వారి విషయంలో సరైన తీర్పునిస్తాడని చెప్పారు. పదవీ విరమణ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డికి వీడ్కోలు కార్యక్రమాన్ని హైకోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. ముళ్లబాటా.. పూలబాటా.. ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ‘న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు నేను సరైన వైపే ఉన్నాను. నాకు ఎవరూ ఎలాంటి హాని చేయబోరని భావించాను. అయితే నా అంచనాలకు విరుద్ధంగా న్యాయమూర్తిగా ఉన్న నా మొత్తం పదవీకాలంలో పలు ఇబ్బందులకు గురయ్యాను. నీతి నిజాయితీ విషయంలో రాజీపడనందుకే ఇలా జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎనిమిదేళ్ల సర్వీసు ఉన్నప్పుడే నేను న్యాయమూర్తి పదవిని త్యజించేందుకు సిద్ధపడ్డాను. నాపై కుట్ర పన్నిన వారు నన్ను వదిలేసేందుకు నాకు ఓ అవకాశం ఇచ్చారు. ముళ్లబాట కావాలా.. పూలబాట కావాలా అని. నేను ముళ్లబాటనే ఎంచుకున్నాను. నేను ముళ్లబాటను ఎంచుకున్నాను కాబట్టే ఈ రోజు నేను మీ అందరి ముందు ఉన్నాను. మీ ద్వారా వీడ్కోలు తీసుకుంటున్నాను. ఒకవేళ పూలబాటను ఎంచుకుని ఉంటే ఎప్పుడో చరిత్రలో కలిసి పోయేవాడిని’అని అన్నారు. ఇన్నేళ్ల తన న్యాయప్రస్థానంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. జస్టిస్ నాగార్జునరెడ్డి న్యాయవ్యవస్థకు అందించిన సేవలు నిరుపమానమన్నారు. న్యాయమూర్తిగా ఆయన 43 వేల తీర్పులను వెలువరించారని చెప్పారు. అలాగే 53,500 అనుబంధ వ్యాజ్యాల్లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తీర్పుల విషయంలో ఆయన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని చెప్పారు. కమిటీ సమావేశాల్లో ఆయన తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని పేర్కొన్నారు. జ్యుడీషియల్ అకాడమీలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ఆయన దూరదృష్టి, సృజనాత్మకతతో అనేక విషయాలను ఆచరణ సాధ్యంగా మార్చారని కొనియాడారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయవ్యవస్థకు జస్టిస్ నాగార్జునరెడ్డి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాలు జస్టిస్ నాగార్జునరెడ్డిని ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డి ఇరు సంఘాలకు చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదులకు ఉపయోగపడేలా చూడాలని వారిని కోరారు. -
హైకోర్టు విభజనపై సీజేను కలిసిన సీనియర్ న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్ : అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనంలో న్యాయవాదులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని సీనియర్ న్యాయవాదులు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకున్న సమాచారం ప్రకారం న్యాయవాదులకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని, హైకోర్టును అమరావతికి తరలించేలోపే అడ్వకేట్లకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తే తదుపరి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు సీజేకు వివరించారు. తినేందుకు చిన్నపాటి హోటళ్లు కూడా లేవని తెలిపారు. సీనియర్ న్యాయవాదులకు చాంబర్లను ఏర్పాటు చేయాలని కోరారు. హైకోర్టు భవన నిర్మాణం నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తయ్యే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయని వారు సీజే దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణ పనులను ఎల్అండ్టీ చూస్తోందని, చెప్పిన సమయానికి భవనాన్ని అప్పగిస్తామని అది హామీ ఇచ్చిందని సీజే ఈ సందర్భంగా వారికి తెలిపారు. తాము (న్యాయమూర్తుల కమిటీ) కూడా ఆ హామీని నిలబెట్టుకుంటుందని నమ్ముతున్నామని ఆయన వారికి చెప్పారు. సానుకూలంగా స్పందించిన సీజే.. సీనియర్ న్యాయవాదులు చెప్పిన విషయాలను రాసుకున్న ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు విభజన కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రామసుబ్రమణియన్‌తో మాట్లాడి లాయర్లకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. కొన్ని రకాల కేసులను హైకోర్టు విభజనకు ముందే తేల్చాల్సిన అవసరం ఉందని, విభజన జరిగితే వాటిని సుప్రీంకోర్టు మాత్రమే తేల్చాల్సి ఉంటుందని వారు సీజే దృష్టికి తీసుకొచ్చారు.ఆ పరిస్థితి తలెత్తకుండా విభజనకు ముందే ఆ కేసుల పరిష్కరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సీజే జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ సానుకూలంగా స్పందించారు. -
ఆలయాల్లోనూ ప్లాస్టిక్కా...?
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రాణం పోయాల్సిందిపోయి దాని ఊపిరి తీసి పాతరేస్తారా? దేవుడిచ్చిన ప్రకృతి ప్రకోపించేలా చేస్తారా?.. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమే కాకుండా ప్రకృతిపై ప్రతికూల పరిణామాలు ఉంటాయని తెలియదా? దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడూ పర్యావరణానికి ముప్పు తెచ్చే మహాపాపానికి ఒడిగడతారా? ఆలయా ల్లోనైనా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అడ్డుకోలే రా? అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. భూ గ్రహానికి అతి హీనమైన జాతిగా మానవుడు అడుగుపెట్టాడంటూ వ్యాఖ్యానించింది. దేవుడి పూజ సామగ్రిని ప్లాస్టిక్‌కవర్లో తీసుకువెళ్లే కొందరు భక్తుల కారణంగా ఆలయాల్లో అపరిశుభ్రతే కాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు ఏం చేస్తున్నారో తెలియచేయాలని 2 ప్రభుత్వాలను ఆదేశించింది. వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మొత్తం వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని ఇరు రాష్ట్రాల ఏజీలను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, మత సంస్థల నిర్వహణ, సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఆయా జిల్లాల ఆలయాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు అందజేశారు. వీటిని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి మంగళవారం విచారణ చేపట్టింది. పుణ్యం కోసం ఆలయాలు, మత సంస్థలకు ప్లాస్టిక్ కవర్లతో వెళ్లి ప్రకృతికే ముప్పు వాటిల్లే పాపానికి ఒడిగడతారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాల్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని అమలు చేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వాల వైఖరిని తెలియజేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలుపై 2 ప్రభుత్వాలతోపాటు కాలుష్య నియంత్రణ మండళ్లు తమ వైఖరిని కూడా చెప్పాలని కోరింది. ప్రభుత్వాల తరఫున అడ్వొకేట్ జనరల్స్ వాదనల నిమిత్తం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులు రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యా యత్నం నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాల విచారణ గురు వారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ఆకస్మిక సెలవు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యాజ్యాలకు గురువారం వచ్చే కేసుల విచారణ జాబితాలో స్థానం కల్పించాలని రిజిస్ట్రీని న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శేషసాయి, జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)తో ఈ రెండు వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జగన్, వైవీ సుబ్బారెడ్డిలు దాఖలు చేసిన వ్యాజ్యాలు కూడా మంగళవారం కేసు విచారణ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే, మంగళవారం ఆయన ఆకస్మికంగా సెలవు పెట్టడంతో, అత్యవసరమున్న వ్యాజ్యాల గురించి మరో సీనియర్ న్యాయ మూర్తి జస్టిస్ రామసు బ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించే వెసులుబాటును రిజిస్ట్రీ కల్పించింది. దీంతో జగన్మోహన్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తమ వ్యాజ్యాల గురించి జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అందుకే స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతున్నాం.. హత్యాయత్నం జరిగిన గంటలోపు డీజీపీ విలేకరుల సమావేశం పెట్టి మరీ నింది తు డు ప్రచారం కోసమే జగన్‌పై హత్యాయత్నం చేశారంటూ మాట్లాడారని మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సైతం ఈ ఘటనను తక్కువ చేసేలా మాట్లాడారని మోహన్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశంలేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సం స్థకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నామన్నారు. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైందని తెలిపారు. ఈ సమయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ, తాము కూడా సీబీఐ దర్యాప్తునకు కోరుతున్నామని, ఆ రెండు వ్యాజ్యాల్లోని అభ్యర్థనలాగే తమ అభ్యర్థన కూడా ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిం చాల్సింది సీజే ధర్మాసనమని, సీజే సెలవు నేపథ్యంలో మొదటి కోర్టు బాధ్యతలను తాము తాత్కాలికంగా నిర్వర్తిస్తున్నామని తెలిపింది. ఈ మూడు వ్యాజ్యాలను కలిపి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే విచారించడం సబబని అభిప్రాయపడింది.