ఇంకెన్నేళ్లు..?: హైకోర్టు | High Court On the formation of village judges | Sakshi
Sakshi News home page

ఇంకెన్నేళ్లు..?: హైకోర్టు

Published Wed, Jan 30 2019 2:04 AM | Last Updated on Wed, Jan 30 2019 8:10 AM

High Court On the formation of village judges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ న్యాయాలయాల ఏర్పాటునకు చర్యలు తీసుకోవాలని 2016 నుంచి తాము కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకెన్నేళ్లు పడుతుందంటూ నిలదీసింది. సచివాలయం నుంచి హైకోర్టుకు ఎంత దూరం ఉం దని ఇన్నేళ్లు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటు విషయంలో సానుకూల నిర్ణయాన్ని తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటునకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.నరేంద్రగౌడ్‌ 2018లో పిల్‌ దాఖ లు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా హైకోర్టు తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటునకు చర్యలు తీసుకోవాలని 2016లోనే తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 2018లో కూడా మరోసారి గుర్తు చేశామన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే గ్రామ న్యాయాలయాల చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి వివరించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయాలయాల ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది ఎంత మాత్రం సరికాదని, న్యాయాలయాల ఏర్పాటు విషయంలో సానుకూల నిర్ణయంతో తమ ముందుకు రావాలని స్పష్టం చేసింది.  

ఐకియాకు కేటాయింపులెలా జరిపారు? 
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ పన్మక్త గ్రామంలో అత్యంత ఖరీదైన 13.10 ఎకరాల స్థలాన్ని అంతర్జాతీయ ఫర్నిచర్‌ కంపెనీ ఐకియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఐకియా షోరూమ్‌కు కోట్ల రూపాయల విలువ చేసే 13.10 ఎకరాల భూమిని నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారని, దీని వల్ల ఖజానాకు రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎంతో విలువైన, ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం తన ఇష్టానుసారం కేటాయించిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఇంతకీ పిటిషనర్‌ ఎవరని ఆరా తీసింది. మాజీ ఎమ్మెల్యే అని రజనీకాంత్‌రెడ్డి చెప్పగా, మరి పిటిషన్‌లో ఎమ్మెల్యే అని ఉందే అని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసే నాటికి పిటిషనర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ తరువాత మాజీ అయ్యారని రజనీకాంత్‌ వివరించారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రజా ప్రతినిధులు ప్రజల గొంతుకలని, వారు తమ స్వరాన్ని చట్ట సభల్లో వినిపించాలని పేర్కొంది. అలా చేయకుండా న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించింది. ఐకియాకు జరిపిన భూకేటాయింపులకు ప్రాతిపదిక ఏమిటో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.   

రోడ్ల వాస్తవ స్థితిగతులపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు 
జంట నగరాల్లో ప్రస్తుతం రోడ్ల వాస్తవ స్థితిగతులపై నివేదికను తమ ముందు ఉంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్‌ దాఖలు చేయా లని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిని, వాహనదారులకు నరకం చూపిస్తున్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేత ఎన్‌.రామచంద్రరావు 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ సం దర్భంగా ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం, రోడ్లు దెబ్బతినేందుకు ఎల్‌ అండ్‌ టీ, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు కూడా కారణమని అధికారులు పేర్కొని ఉండటాన్ని గమ నించింది. దీంతో ఈ వ్యాజ్యంలో ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను ప్రతివాదులుగా చేర్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement