సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన కె.కోటేశ్వర్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment