సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులు, దానిని కప్పిపుచ్చుకునేందుకు అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అతన్ని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటును బాధితునికి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన సోదరుడు శీలం వినయ్‌కుమార్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ శీలం రవికుమార్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ కేసుకు సంబంధించి వినయ్‌కుమార్‌ని పోలీసులు గత ఏడాది అక్టోబర్ 8న అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మాదాపూర్ ఎస్‌ఐ రామకృష్ణ, సీఐ నాగేశ్వరరావులు కలిసి వినయ్‌ను కొట్టారని, దీంతో ప్రస్తుతం అతను కూర్చునే, నిలబడే పరిస్థితిలో కూడా లేడని ఆమె వివరించారు. అతను తీవ్ర హింసకు గురైనట్లు నిమ్స్ వైద్యులు సైతం ధ్రువీకరించారని తెలిపారు. దీంతో పోలీసులు వినయ్‌పై పలు కేసులున్నాయని పేర్కొంటూ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిని సమర్థిస్తూ హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసుల తీరును తప్పుపట్టింది. ఒక్క కేసు ఉన్న వ్యక్తిపై పలు కేసులున్నట్లు పేర్కొంటూ పీడీ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని తేల్చింది.
తప్పును కప్పిపుచ్చుకునేందుకు పీడీ యాక్టా?
Published Wed, Feb 13 2019 3:16 AM | Last Updated on Wed, Feb 13 2019 3:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment