సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ నిమిత్తం నిర్వహించిన రాతపరీక్షలో పేపర్ బుక్‌లెట్–బీ కోడ్‌లోని ఆరు ప్రశ్నలను తొలగించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఈ ప్రశ్నలను తొలగించిన తరువాత ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించి తాజాగా అర్హుల జాబితాను రూపొందించాలన్న ఆదేశాలను కూడా నిలుపుదల చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగినట్లయింది. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో 1,217 ఎస్‌ఐ పోస్టుల భర్తీ నిమిత్తం రిక్రూట్‌మెంట్ బోర్డు గత ఏడాది మే 31న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం గతేడాది ఆగస్టు 26న రాతపరీక్ష నిర్వహించింది.
ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ బుక్‌లెట్–బీ కోడ్‌లోని ఆరు ప్రశ్నలు తప్పని, వాటి సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, దీని వల్ల తమకు నష్టం కలిగిందంటూ నల్లగొండకు చెందిన డి.ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, బుక్‌లెట్–బీ కోడ్‌లోని 117, 138, 172, 181, 185, 189 ప్రశ్న లను తొలగించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించారు. ఆరు ప్రశ్నలు తొలగించిన తరువాత తిరిగి అర్హుల జాబితాను రూపొందించాలని బోర్డుకు స్పష్టం చేశారు. అర్హుల జాబితా రూపొందించేటప్పుడు, అర్హత సాధించినవారిని మినహాయించాలని తెలిపారు. తాజా జాబితాలో ఒక్కో అభ్యర్థి హాల్ టికెట్ ఎదురుగా అతని మార్కులను పొందుపర చాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్‌పై సోమ వారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
న్యాయ సమీక్ష సరికాదు..
బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్న ఆ ఆరు ప్రశ్నల్లో తప్పులు లేవన్నారు. ప్రశ్నపత్రాన్ని నిపుణుల కమిటీ రూపొందించిందని వివరించారు. ఇలాంటి అంశాలపై న్యాయసమీక్ష సరికాదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మాదిరి అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్లను ప్రచురించడం జరుగుతుందే తప్ప, వారు సాధించిన మార్కులను ప్రచురించడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.
పిటిషనర్లకు ప్రయోజనకరం : అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే అర్హత సాధించిన వారి విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలులేవన్నారు. ఆరు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి కాబట్టే, కోర్టుకొచ్చామన్నారు. ఆ ఆరు ప్రశ్నలను తొలగించడం వల్ల పిటిషనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు.
సామీప్యత ఆధారంగా సమాధానం ఇవ్వొచ్చు..
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఓ ప్రశ్నకు సమాధానాన్ని భిన్న పద్ధతుల్లో చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో సామీప్యత ఆధారంగా సమాధానంపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఈ కేసులో 610 జీవోకు సంబంధించిన ప్రశ్నకు సమాధానాల్లో గిర్‌గ్లానీ, జయభారత్ కమిషన్లు సమాధానంగా ఉన్నాయని, ఇందులో గిర్‌గ్లానీ కమిషన్‌ను సమాధానంగా ఎంచుకుని ఉండొచ్చని తెలిపింది. తన పేరును కొందరు టీబీఎన్ రాధాకృష్ణన్‌గా, టీబీ రాధాకృష్ణన్‌గా రాస్తుంటారని, ఎలా రాసినా తప్పుకాదన్నారు. నియామకాల ప్రక్రియ 90 శాతం పూర్తయిన దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపింది. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. మార్కులు తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment