సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం.
కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.
అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.
ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment