నా తప్పేమీ లేకున్నా.. నన్ను బలిచేశారు
విజ్జి, పిల్లలు ఏమైపోతారో.. అంతా అయిపోయింది
ఆత్మహత్యకు ముందు స్నేహితుడితో ఎస్సై మూర్తి తీవ్ర ఆవేదన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్
సాక్షి, భీమవరం/తణుకు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు, పై అధికారుల వేధింపులే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ నెట్‌లో ఆడియో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయం, తన భార్య, పిల్లలు ఏమైపోతారోనని ఆయన పడిన ఆవేదన అందరిని కలచివేస్తోంది. తణుకు రూరల్ ఎస్సైగా పనిచేసిన సమయంలో గేదెల చోరీకి సంబంధించిన కేసు మాఫీకి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు వచ్చిన ఆరోపణల్లో తన ప్రమేయం లేకపోయినా తనను బలిపశువును చేశారని అప్పటి నుంచి మూర్తి తీవ్రంగా కుమిలిపోతున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్సై మూర్తి తన స్నేహితుడితో మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది. పై అధికారులు తనను ఏ విధంగా బలిపశువును చేశారనే విషయమై స్నేహితుడి వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఆడియో సంభాషణల్లో కొంత భాగం..
ఎస్సై: ఇంట్రెస్ట్ లేదురా..
ఫ్రెండ్: ఏంటి జాబా?
ఎస్సై: లేదురా లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా. నన్ను మోసం చేసిన వాళ్లు హ్యాపీగా ఉన్నారు.
ఎస్సై: ఆ కృష్ణకుమార్, ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈ రోజు నేను ఏదో అలా గెంటుతున్నాను. సరే వీఆర్ భీమవరం కదా చూద్దాం చూద్దాం అని.. చెప్పాను ఆ కృష్ణకుమార్‌కు నన్ను ఇబ్బంది పెట్టకండి సార్! అని. లేదు లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అదీ ఇదీ అని పెంట చేశాడు నా జీవితాన్ని. సీఐ నాగేశ్వరరావుకు చెప్తే ఇలా పెంట చేశాడు. ఇద్దరు కలిసి సర్వనాశనం చేశారు నా జీవితాన్ని.. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటూ ఫ్యామిలీతో ఉండొచ్చు కదా అనుకున్నాను.
ఫ్రెండ్: పోన్లే ఇప్పటి దాకా ఉన్నావ్.. నాకు లూప్ కావాలి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిపోతానని అడుగు ఒకసారి
ఎస్సై: అంతా ఊహించిందే జరుగుతుంది.
ఎస్సై: పిల్లలు, విజ్జిని చూస్తుంటే బాధేస్తుంది రా..
ఫ్రెండ్: ఏం మాట్లాడుతున్నావ్ రా ఊరుకో..
ఎస్సై: లేదురా పిల్లలు, విజ్జి గురించి ఆలోచిస్తుంటే చాలా చాలా బాధేస్తుంది రా.
ఫ్రెండ్: అసలేమైనా బుర్రా ఉందా! నీకు
ఎస్సై: మనం చాలా హ్యాపీగా ఉంటామనకున్నాం.
ఫ్రెండ్: రేయ్ ఏమైంది రా! ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని తెలుసుకోకుండా.. పాజిటివ్ నెగిటివో తెలుసుకోకుండా.
ఎస్సై: అక్కడికి వెళ్తే కృష్ణా జిల్లా ఎలాట్‌మెంట్ అనేది తెలుసు నాకు. నేను అస్సలు ఉండలేను. ఒక్కరోజు కూడా నేను అక్కడ ఉండలేను. అక్కడ వాతావరణం అది నా వల్ల అయితే కాదు.
ఫ్రెండ్: రేయ్ బాబు నువ్ కంగారు పడకు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు!
Comments
Please login to add a commentAdd a comment