అనుమానాలు ఉన్నాయంటున్న కుటుంబ సభ్యులు
అధికారులను నిలదీసిన దళిత సంఘాల నాయకులు
నందిగాం: స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న లిమ్మక అక్షిత (16) మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపాల్ దమయంతి, నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం పారాపురం సమీపంలోని మహసింగి గ్రామానికి చెందిన లిమ్మక గిరి, శ్రావణిలకు ఇద్దరు కుమార్తెలు.
చిన్న కుమార్తె అక్షిత జూలై 24న జరిగి న రెండో విడత కౌన్సిలింగ్‌లో నందిగాం బాలికల గురుకులంలో ఇంటర్మీడియెట్‌లో చేరింది. 26వ తేదీన హోమ్ సిక్ అంటూ ఇంటికి వెళ్లి మరలా 29న గురుకులానికి వచ్చింది. యథావిధిగా తరగతులకు హాజరైంది. మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు స్టడీ అవర్‌లో చదివి అందరితో పాటు నిద్రపోయింది. బుధవారం వేకువజామున సెక్యూరిటీ గార్డులు వచ్చి విద్యార్థులను నిద్రలేపుతుండగా 6వ తరగతికి చెందిన వనగాల్ల పల్లవి టాయ్‌లెట్‌కు వెళ్లగా పక్కనే ఉన్న కిటికీకి అక్షిత వేలాడుతూ కనిపించింది.
వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో వారు ప్రిన్సిపాల్‌కు సమాచారమిచ్చారు. పక్కనే క్వార్టర్స్‌లో ఉన్న ప్రిన్సిపాల్ వచ్చి చూసి విషయా న్ని ఉన్నతాధికారులకు, నందిగాం ఎస్సైకు, తహసీల్దారు, విద్యార్థిని తల్లికి తెలియజేశారు. నందిగాం ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
న్యాయం చేయాలి..
అనంతరం గురుకులానికి చేరుకున్న విద్యార్థిని తల్లి దండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాము వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచకుండా ఆస్పత్రికి తరలించడంపై అభ్యంతం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్, ఎస్సైలను నిలదీశారు. అక్షిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని తల్లి శ్రావణి, మేనమామ బాడ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రిన్సిపాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పోస్టుమార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. అనంతరం దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి అక్కురాడ లోకనాధం, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగాన తిరుపతిరావు, కులనిర్మూలన పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకరరావు, స్థానిక నాయకులు జడ్యాడ జయరాంలు మాట్లాడుతూ బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థినులు అధైర్యపడవద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: నందిగాంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వైనంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు అధైర్య పడవద్దని, సమస్యలు ఉంటే హెచ్‌ఎంకు తెలియజేయాలన్నారు. కాగా, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి మనోధైర్యం కల్పించారు.
శ్రీకాకుళం అర్బన్: విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంపై జిల్లా అధికారులు, గురుకులం జిల్లా కో–ఆర్డినేటర్‌లు పూర్తి నివేదిక అందించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment