సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికంతా అక్రమ నిర్మాణాలు కనపడతాయి. కానీ మీకు (జీహెచ్‌ఎంసీ) మాత్రం కనిపించవు. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయంటే వాటిని అడ్డుకునే సమర్థత మీకు లేదా? పై స్థాయిలో ఉండే అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తే, కింది స్థాయి అధికారులు సక్రమంగా ఉంటారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవచ్చని పలు చట్టాలు చెబుతున్నాయి. పర్యవేక్షణ చేయకుండా కళ్లు మూసుకుని విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై జీహెచ్‌ఎంసీ ఏం చర్యలు తీసుకుంటున్నట్లు?
– హైకోర్టు ధర్మాసనం
అక్రమ నిర్మాణాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులపై హైకోర్టు నిప్పులు చెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వెలిసిన, వెలుస్తున్న అక్రమ కట్టడాల విషయంలో నిర్లిప్తంగా ఉన్న అధికారులపై, సిబ్బందిపై చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని మంగళవారం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల చేపట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ముందు అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి..
రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని, 5 అంతస్తులు నిర్మిస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని విచారణ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. మూడో అంతస్తు నిర్మించేటప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించింది. ‘విధి నిర్వహణలో ఉన్నతాధికారులు సక్రమంగా వ్యవహరిస్తే క్షేత్రస్థాయిలోని అధికారులు కూడా విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులకు ఎన్నో అధికారాలున్నాయి. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, ఏ అధికారి కూడా తమ అధికారాన్ని ఉపయోగించట్లేదు. ఆ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించే అధికారులను ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు? అక్రమ నిర్మాణదారులకన్నా ముందు ఈ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలి’అని ధర్మాసనం మండిపడింది.
అంతకన్నా మీరేం చేయగలరు?
జీహెచ్‌ఎంసీ న్యాయవాది సంపత్ ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, నోటీసులు జారీ చేశామని చెప్పారు. ‘అంతకన్నా మీరేం చేయగలరు? నోటీసులిచ్చామని చెప్పడం సులభం. కానీ అక్రమ నిర్మాణాలను కూల్చేసే సమర్థత మీకు (జీహెచ్‌ఎంసీ) ఉందా? ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయో పర్యవేక్షించే స్థితిలో మీ అధికారుల్లేరా? విధి నిర్వహణలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అంత అసమర్థులుగా ఉన్నారా?, అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే అణిచివేస్తుంటే హైకోర్టులో ఇన్ని వ్యాజ్యాలు దాఖలయ్యే పరిస్థితి ఉండదు. అవినీతి నిరోధక చట్టం కింద ‘అవినీతి’కి విస్తృతమైన అర్థం ఉంది. విధులను సక్రమంగా నిర్వర్తించని అధికారులకు ఈ చట్ట నిబంధనలను వర్తింపచేయాలి. ఐపీసీతో పాటు పలు చట్ట నిబంధనల కింద ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఇలాంటి అధికారుల విషయంలో జీహెచ్‌ఎంసీ ఏం చేస్తున్నట్లు?’అంటూ దుయ్యబట్టింది.
ముందు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి
Published Wed, Feb 27 2019 2:52 AM | Last Updated on Wed, Feb 27 2019 2:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment