నారాయణమ్మ . నాగలక్ష్మి
ఈసారి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ నుంచి ‘అసామాన్యులు’ హాజరై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒకరు హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ. మరొకరు కోదాడ మొబైల్ షీ టాయిలెట్ నిర్వహిస్తున్న నాగలక్ష్మి. ప్రజల కోసం భిన్నమైన ఉపాధుల్లో అంకితభావంతో పని చేస్తున్న వీరిద్దరూ ‘శ్రమయేవ జయతే’కు నిజమైన ప్రతీకలు. నారాయణమ్మ, నాగలక్ష్మిల పరిచయం.
నారాయణమ్మ దినచర్యను చూస్తే కర్మయోగుల దినచర్యలా అనిపిస్తుంది. తెల్లవారుజాము నాలుగ్గంటలకు నిద్ర లేస్తుందామె. స్నానపానాదులు ముగించుకుని గంటసేపు గురుధ్యానం చేసి కొద్దిగా టీ తాగి ఆరు గంటలకంతా బంజారాహిల్స్‌లోని కాలనీలో రోడ్లు ఊడ్చే పనిలోకి వస్తుంది. పెదాల మీద ఏదో ఒక జానపదగీతమో, గురు తత్వమో, స్మరణో లేకుండా నారాయణమ్మ కనిపించదు. అందుకే ఆమెను అందరూ ‘సింగింగ్ స్వీపర్’ అంటారు.
22 సంవత్సరాలుగా నగరాన్ని తన చేతులతో శుభ్రం చేస్తూ స్వస్థతనిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా భజనలకు, భక్తి కార్యక్రమాలకు హాజరయ్యి ముక్తిమార్గాన్ని చూపుతూ నారాయణమ్మ చేస్తున్న సేవ సామాన్యం కాదు. అందుకే ఆమెను రిపబ్లిక్ డేకి ఢిల్లీ పంపాలని జి.హెచ్.ఎం.సి. అధికారులు నిశ్చయించారు. ‘ఇది విని మావాళ్లంతా చాలా సంతోషించారు. మంచి కర్మల ఫలితం ఇది’ అంటుంది నారాయణమ్మ.
బావులు తవ్వుతూ
రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన నారాయణమ్మ భర్తతో కలిసి బావులు తవ్వే పనికి వెళ్లేది. అది చాలా శ్రమతో కూడిన పని. అయినా పదిహేను ఇరవై రోజుల్లో బావిని తవ్వి జలను బయటకు తేవడంలో ఆమెకు తృప్తి కలిగేది. తర్వాత జెసీబీలు వచ్చాయి.
బావుల స్థానంలో బోర్లు వచ్చాయి. దాంతో పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ చేరుకుంది నారాయణమ్మ. అప్పటికే తల్లి స్వీపర్‌గా చేస్తుండంతో తన పని కూతురికి అప్పజెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పనిలో కొనసాగుతూ ఉంది నారాయణమ్మ. నెలకు 14 వేలు వస్తాయి. కొడుకు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. కూతురిని స్వీపర్ ఉద్యోగంలోనే పెట్టించింది.
జీవుడే దేవుడు
నారాయణమ్మకు భక్తి ఎక్కువ. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి దేశంలోని గుళ్లన్నీ తిరిగేది. సంపాదించినది అంతా తీర్థయాత్రలకే ఖర్చు పెట్టింది. ‘కాని గుళ్లన్నీ తిరిగాక జీవుడిలోనే దేవుడు ఉన్నాడని గ్రహించాను. కరీంనగర్ జిల్లాకు చెందిన నిత్యానంద రాజేశ్వరాచార్యుల దగ్గర గురుబోధ తీసుకున్నా. నన్ను నేను ఆత్మజ్ఞానిగా మార్చుకున్నా. మనిషి చిత్తం విచిత్రం.
అతను లోకాన్ని తరచి చూసి ముక్తిపొందాలంటే గురువును తెలుసుకుని గురుబోధతో నడుచుకోవాలి. అజ్ఞానాన్ని తవ్వి బయట పారేయాలి’ అంటుంది నారాయణమ్మ. ఆమెకు రోకటి పాటల దగ్గరి నుంచి మంగళహారతి పాటల వరకూ కరతామలకం. రామయణ, భారతాలను కూడా పాటలుగా పాడుతుంది. వేమన పద్యాల నుంచి సంస్కృత పద్యాల వరకూ అన్నీ చెబుతుంది. ఆమె ధారణకు, ఆధ్యాత్మిక అవగాహనకు ఎవరైనా నమస్కరించాల్సిందే.
కోదాడలో అమూల్యసేవ
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాగలక్ష్మి నిర్వహించే మొబైల్ షీ టాయిలెట్ కనిపిస్తుంది. 30 ఏళ్ల ఈ డబుల్ డిగ్రీ హోల్డర్ కోదాడ మునిసిపల్ ఉద్యోగిగా మొబైల్ టాయిలెట్‌ను నిర్వహించడానికి, తిప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడదు. ‘ఐదేళ్లుగా ఈ టాయిలెట్‌ను నిర్వహిస్తున్నాను. ఆటోకు బిగించిన టాయిలెట్‌ను రోజూ నేను ఉదయం ఎనిమిదన్నర నుంచి పట్టణంలో తిప్పుతాను.
గుళ్ల దగ్గర, బస్టాండ్ దగ్గర, మార్కెట్ దగ్గర అవసరాన్ని బట్టి ఉంచుతాను. పనుల కోసం పల్లెల నుంచి వచ్చిన స్త్రీలు తగిన టాయిలెట్‌లు లేక ఇబ్బంది పడతారు. వారు నా మొబైల్ టాయిలెట్‌ను చూడగానే ఎంతో రిలీఫ్ ఫీలవుతూ ఉపయోగిస్తారు. నేను గమనించేదేమిటంటే ఆ ఒత్తిడి తీరాక వారు చల్లగా బతకమ్మా ఆని ఆశీర్వదించడం. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎంతో సంతోషపడతారు’ అంటుంది నాగలక్ష్మి.
ఈ మొబైల్ టాయిలెట్ ఉపయోగించుకోవడానికి ఏమీ రుసుము చెల్లించనక్కర లేదు. మధ్యాహ్నం వరకూ ఈ వాహనాన్ని నడిపే నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన విరామం తీసుకుని మళ్లీ సాయంత్రం వరకూ తిప్పుతుంది. ‘మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది’ అంటుందామె. ఆమె అంకితభావాన్ని గమనించిన జి.హెచ్.ఎం.సి. అధికారులు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీకి పంపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment