లాస్ట్ మినిట్‌లో ‘అయామ్ సారీ’ అనేశారు బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధాని ఆయన. ముందనుకున్నట్లుగా నేటి మన గణతంత్ర దినోత్సవానికి జాన్సన్ రావడం లేదు. వచ్చే పరిస్థితి లేదు. బ్రిటన్‌లో కరోనా ‘రెండో రూపం’ దాల్చింది. అందుకే సెంట్రల్ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న వాళ్ల ప్రధాని పాలనా భవనం ఇండియాకు ‘సారీ’ నోట్ పంపించింది. డిసెంబర్‌లోనే ఆయన కు ఆహ్వానం పంపాం. ఓకే కూడా అన్నారు. జనవరి కంతా సీన్ మారి పోయింది. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే అతిథి లేకుండా మన రిపబ్లిక్ పరేడ్ జరగబోవడం. ఇంకో అతిథిని పిలవొచ్చు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు జరుగుతున్నది 72 వ గణతంత్ర దినోత్సవం. ఇండియా ఆవిర్భవించాక ఇంతవరకు మూడుసార్లు మాత్రమే ముఖ్య అతిథి లేకుండా రిపబ్లిక్ డే జరిగింది. నేటి పరేడ్ కూడా పూర్తిగా ఇక మన ఇంటి కార్యక్రమం. మనలో మన మాట... అతిథి లేకపోతేనేం! ఈ కార్యక్రమాన్ని నేరుగా సందర్శించే వారు, టీవీలలో వీక్షించే వారు అందరూ అతిథులే ఈసారికి!
రిపబ్లిక్ పరేడ్‌లో ప్రధాని ఇందిరాగాంధీ (1967)
అతిథి లేని రిపబ్లిక్ ‘డే’లు
మూడంటే మూడేసార్లు 1952లో, 1953లో, 1966లో అతిథి లేకుండా మన రిపబ్లిక్ డే పరేడ్‌లు జరిగాయి. 1966లో అతిథి లేకపోవడమూ, రాకపోవడమూ కాదు. రాజకీయంగా మనం కొంచెం అస్థిమితంగా ఉన్నాం. ఇండో–పాక్ యుద్ధాన్ని ముగింపునకు తెచ్చేందుకు శాంతి ఒప్పందం విషయమై రష్యాలోని తాష్కెంట్‌కు వెళ్లిన అప్పటి మన ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి ఒప్పందంపై సంతకాలు అయిన రెండో రోజే 1966 జనవరి 11న హటాత్తుగా మరణించారు. ప్రధాని లేకుండా ఒక్క రోజైనా దేశం ఉండకూడదు. అదే రోజు గుల్జారీలాల్ నందా దేశ ప్రధాని అయ్యారు. జనవరి 24 వరకు ప్రధానిగా ఉన్నారు. జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇక రిపబ్లిక్ డేకి ఉత్సవాలకు ఉన్న సమయం 48 గంటలు. అతిథిని పిలవలేకపోయాం. ఆ ముందు కూడా 1952, 1953 లలో ఎవర్నీ ఆహ్వానించలేదు. అందుకు ప్రత్యేక కారణం అంటూ లేదు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
అసలు అతిథి ఎందుకు?
ఇది మరీ బాగుంది. అతిథి వస్తే ఆ కళే వేరుగా ఉండదా! మన మిలటరీని చూపించుకోవచ్చు. మన ప్రజల్ని, మన సంప్రదాయాల్ని, మనం ఇచ్చే గౌరవ మర్యాదల్ని అతిథికి చూపించవచ్చు. ఇవన్నీ పైపైన. రాజనీతి వ్యూహాలు కొన్ని ఉంటాయి. బ్రిటన్ ప్రధానినే ఈసారి ఎందుకు ఆహ్వానించామంటారు? కారణం ఉంది. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి అధికారికంగా బయటికి వచ్చేసి ఉంది. ఇండియా ఆర్.సి.ఇ.పి. (రీజనల్ కాంప్రెహె న్సివ్ ఎకనమిక్ పార్ట్‌నర్‌షిప్) లోకి వెళ్లేందుకు సంశయిస్తోంది. ఆర్.సి.ఇ.పి. మీద ఇప్పటికే ఆసియాదేశాలు చాలావరకు సంతకాలు చేసేశాయి. బ్రిటన్‌కి, ఇండియాకు గ్రూప్‌లో ఒకరిగా ఉండటం ఇష్టం లేదు. అందుకే బ్రిటన్ బయటికి వచ్చేస్తే, ఇండియా లోపలికి వెళ్లడం లేదు. ఈ సమయంలో లండన్, ఢిల్లీ ఒకటిగా ఉంటే.. వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఏ ప్రయోజనాలైతే కలిసి సాధిస్తామని ఆ గ్రూపులు అంటున్నాయో వాటినే ఈ రెండు దేశాలూ కలిసి వేరుగా సాధించుకోవచ్చు. అందుకు ఒక సోపానం గౌరవ ఆతిథ్యం కూడా.
తొలి అతిథి సుకర్నోతో ప్రధాని నెహ్రూ
తొలి అతిథి సుకర్ణో
1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. రెండున్నరేళ్లకు 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తేదీ జనవరి 26. అదే రిపబ్లిక్ డే. అదే గణతంత్ర దినం. ఆ ఏడాది మన గెస్టు.. స్వతంత్ర భారత గణతంత్ర ఉత్సవానికి తొలి ముఖ్య అతిథి.. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో. అప్పుడు మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. మన తొలి రిపబ్లిక్ డేకి సుకర్ణోను ఆహ్వానించడానికి తగిన కారణమే ఉంది. మనకు 47లో స్వాతంత్య్రం వస్తే, వాళ్లకు 45లో వచ్చింది. ఇంచుమించు అదే సమయంలో ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాలు సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి పొందిన తొలినాళ్ల నడకలో ఉన్నాయి. అవన్నీ.. మన ఇండియా సహా.. లోలోపల ఒక స్నేహ వలయంలా ఏర్పడ్డాయి. ఆ స్నేహంతోనే మనం సుకర్ణోను ఆహ్వానించాం.
తొలి రిపబ్లిక్ పరేడ్ (1950)
తొలి పరేడ్ రాజ్‌పథ్‌లోనే!
తొలి రిపబ్లిక్ వేడుకలు (1950) కూడా ఇప్పుడు జరుగుతున్నట్లే రాజ్‌పథ్‌లోనే జరిగాయి. ఆ ఏడాది రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఓపెన్ టాప్ గుర్రాల బగ్గీలో కూర్చొని రాష్ట్రపతి భవన్ నుంచి పరేడ్ గ్రౌడ్స్‌కి బయల్దేరారు. పరేడ్ ను చూడ్డానికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం స్వీట్లు పంచిపెట్టింది. తర్వాతి పరేడ్‌లు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఎర్రకోటలో ఒకసారి, ఇర్విన్ స్టేడియంలో ఒకసారి, రామ్‌లీలా మైదానంలో ఒకసారి.. ఇలా. 1955 నుంచి మాత్రం రాజ్‌పథ్‌లోనే రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment