
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. కొత్త క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉత్పాదక రంగంలో ఉద్యోగకల్పన ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగం కల్పిస్తే 15 వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనుంది.
ఈపీఎఫ్ రెండు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు జీతం వచ్చే ఉద్యోగులకు వర్తించనుంది. కొత్తగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది.
పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం లక్ష కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్‌అండ్‌డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదంటే.. 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్‌న ప్రభుత్వం ఇవ్వనుంది. తమిళనాడు పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,853 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది.