ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీ ల్యాండ్స్) నిధుల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగం కోసం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కేంద సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగానికి ఈ పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని పేర్కొన్నారు.
చదవండి: ఏ సీఎంకి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికే: కేంద్రానికి లేఖ
దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున ఒకే విడుదలో అందనున్నాయని పేర్కొన్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రూ. 5 కోట్లు.. రెండు విడతలుగా రూ. 2.5 కోట్ల చొప్పునమంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే గతేడాది ఏప్రిల్‌లో కేంద్రం ఎంపీ ల్యాండ్స్‌ను కరోనా మహమ్మారి కారణంగా నిలిపి వేసింది. ఈ నిధులను కోవిడ్ ఆరోగ్య సేవలకు వినియోగిస్తామని పేర్కొంది.
చదవండి: లోక్‌సత్తా, ఎఫ్‌డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే...
అలాగే పత్తి కొనుగోలు కోసం కాటన్ కార్పొరేషన్‌కు భారీగా నిధులు విడుదల చేసింది. పత్తి మద్దతు ధర కోసం రూ. 17,408 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా గిరిజన నాయకుడు, స్వతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను జరుపుకోవడానికి నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు వారం రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment