జస్టిస్ నాగార్జునరెడ్డిని సన్మానిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్. చిత్రంలో నాగార్జునరెడ్డి సతీమణి శోభారెడ్డి, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాద సంఘాల ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తిగా ఉన్న సమయంలో తనపై జరిగిన కుట్ర గురించి ఇప్పటివరకు ఎక్కడా వ్యాఖ్యానించని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తొలిసారి పెదవి విప్పారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, నీతి నిజాయితీ విషయంలో రాజీపడనందుకు తనను కొందరు లక్ష్యంగా చేసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువసార్లు తనను ఉరికంబం వరకు తీసుకెళ్లారని, అయితే ప్రతీసారి దేవుడు తనను రక్షించారని అన్నారు. తనపై జరిగిన పెద్దకుట్ర నుంచి ఏ మచ్చా లేకుండా బయటపడ్డానంటే అందుకు దేవుడి దయే కారణమని తెలిపారు. ఆ సమయంలో తన కుటుంబసభ్యులు, స్నేహితులు, న్యాయవాదుల మద్దతు కూడా చాలా ఉందని, వీరందరి రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. తాను అనుభవించిన కష్టాలు, బాధలకు ఏ వ్యక్తి గానీ, బృందాన్ని గానీ నిందించడం లేదని అన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు వారి విషయంలో సరైన తీర్పునిస్తాడని చెప్పారు. పదవీ విరమణ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డికి వీడ్కోలు కార్యక్రమాన్ని హైకోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది.
ముళ్లబాటా.. పూలబాటా..
ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ‘న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు నేను సరైన వైపే ఉన్నాను. నాకు ఎవరూ ఎలాంటి హాని చేయబోరని భావించాను. అయితే నా అంచనాలకు విరుద్ధంగా న్యాయమూర్తిగా ఉన్న నా మొత్తం పదవీకాలంలో పలు ఇబ్బందులకు గురయ్యాను. నీతి నిజాయితీ విషయంలో రాజీపడనందుకే ఇలా జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎనిమిదేళ్ల సర్వీసు ఉన్నప్పుడే నేను న్యాయమూర్తి పదవిని త్యజించేందుకు సిద్ధపడ్డాను. నాపై కుట్ర పన్నిన వారు నన్ను వదిలేసేందుకు నాకు ఓ అవకాశం ఇచ్చారు. ముళ్లబాట కావాలా.. పూలబాట కావాలా అని. నేను ముళ్లబాటనే ఎంచుకున్నాను. నేను ముళ్లబాటను ఎంచుకున్నాను కాబట్టే ఈ రోజు నేను మీ అందరి ముందు ఉన్నాను. మీ ద్వారా వీడ్కోలు తీసుకుంటున్నాను. ఒకవేళ పూలబాటను ఎంచుకుని ఉంటే ఎప్పుడో చరిత్రలో కలిసి పోయేవాడిని’అని అన్నారు. ఇన్నేళ్ల తన న్యాయప్రస్థానంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు..
అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. జస్టిస్ నాగార్జునరెడ్డి న్యాయవ్యవస్థకు అందించిన సేవలు నిరుపమానమన్నారు. న్యాయమూర్తిగా ఆయన 43 వేల తీర్పులను వెలువరించారని చెప్పారు. అలాగే 53,500 అనుబంధ వ్యాజ్యాల్లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తీర్పుల విషయంలో ఆయన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని చెప్పారు. కమిటీ సమావేశాల్లో ఆయన తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారని పేర్కొన్నారు. జ్యుడీషియల్ అకాడమీలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ఆయన దూరదృష్టి, సృజనాత్మకతతో అనేక విషయాలను ఆచరణ సాధ్యంగా మార్చారని కొనియాడారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయవ్యవస్థకు జస్టిస్ నాగార్జునరెడ్డి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాలు జస్టిస్ నాగార్జునరెడ్డిని ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జునరెడ్డి ఇరు సంఘాలకు చెరో రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదులకు ఉపయోగపడేలా చూడాలని వారిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment