సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే విలీన గ్రామ పంచాయతీలకు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు... పంచాయతీలను విలీనం చేస్తూ దాఖలైన దాదాపు 100 పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ పంచాయతీలను డీనోటిఫై చేసి వాటి పరిధిలో వ్యవసాయేతర రంగాలపై ఆధారపడిన వారి జనాభా, వారి స్థితిగతులు, తలసరి ఆదాయం వంటి విషయాలపై అధ్యయనం చేయాల్సి ఉండగా అవేమీ చేయకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గ్రామ పంచాయతీల స్వతంత్రతకు భంగం కలుగుతోందన్నారు. గ్రామ పంచాయతీల విలీనం విషయంలో ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారని, దీంతో ఆ విలీన పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
పంచాయతీలను కాలగర్భంలో కలిపేస్తారా?
చట్ట నిబంధనల మేరకు అధ్యయనం చేశాకే పంచాయతీలపై విలీన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు పేర్కొన్నారు. పలు పంచాయతీలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలన్నీ మున్సిపాలిటీల ద్వారానే అందుతున్నాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మున్సిపాలిటీలను విస్తరించే పరిధి ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించింది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించే అధ్యయం చేశారా అంటూ సందేహం వ్యక్తం చేసింది. జీన్స్ వేసుకొని కాస్త మోడ్రన్‌గా కనిపిస్తే పట్టణీకరణ పేరిట పంచాయతీలను కాలగర్భంలో కలిపేస్తారా? అంటూ నిలదీసింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ పంచాయతీల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు.
ఐదేళ్లపాటు వారిని ఏమీ చేయలేం...
ఈ సమయంలో ధర్మాసనం తిరిగి జోక్యం చేసుకుంటూ పిటిషనర్ల అభ్యర్థనల మేరకు ఆదేశాలు జారీ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీల కాల పరిధి ఐదేళ్లని, ఒకసారి చట్టబద్ధంగా పంచాయతీలకు ఎన్నికైన వారిని ఐదేళ్లపాటు తప్పించడం సాధ్యం కాదని రామచంద్రరావు వివరించారు. దీనివల్ల మున్సిపాలిటీల నుంచి అందే సౌకర్యాలు అందక ప్రజలు ఐదేళ్లపాటు ఇబ్బంది పడుతారని తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చి, పంచాయతీల విలీనం చెల్లదని హైకోర్టు ప్రకటిస్తే ఆ పంచాయతీలకు 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో ఈ హామీని నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21న చేపడతామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment