సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిషేధంపై ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులు ముందుకెళ్లనివ్వరని, వారు తమ ఆర్థిక, రాజకీయ పరపతిని ఉపయోగిస్తారని, దీనిని తట్టు కుని నిలబడితేనే నిషేధం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణ(ఈపీ) చట్టం కింద ప్రభుత్వానికి విస్తృతాధికారాలు ఉన్నాయని, అయితే వాటిని ఉపయోగించ డం లేదని హైకోర్టు ఆక్షేపించింది. ప్లాస్టిక్ నిషేధ నిర్ణ యం ప్రభుత్వస్థాయిలో తీసుకోవాల్సినదని తెలిపింది. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాల తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడే నిషేధం సాధ్యమవుతుందని వివరించింది. ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేకుంటే తామే ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తామంటూ హైకోర్టు తన వైఖరిని తేల్చిచెప్పింది. కుంకుమ, పసుపు తదితరాలను ప్లాస్టిక్ కవర్‌లో వేసి వాటిని అయ్యప్ప ఇరుముడిలో ఉంచేందుకు సైతం శబరిమల ఆలయంలో అనుమతించడం లేదని, అక్కడ అంతస్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉందని హైకోర్టు గుర్తు చేసింది.
ఇక్కడ కూడా అదేస్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్ప నిషేధం సాధ్యం కాదని పేర్కొంది. దేవస్థానాల్లో పూజాసామగ్రి అమ్మేషాపులు విరివిగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నాయని, అధికారులకు ఆ షాపులపై వచ్చే ఆదాయం తప్ప, సామగ్రికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు కనిపించవని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్లాస్టిక్ నిషేధంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవస్థానాల్లో అసౌకర్యాలు, నిర్వహణ లోటుపాట్లపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ప్లాస్టిక్ నిషేధంపై ఏజీ నివేదిక
దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధానికి తీసుకుంటున్న చర్యలపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం తమ ఆదేశాలను దేవాదాయశాఖ అధికారులు సక్రమంగా అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. దేవస్థానాల వద్ద ఉన్న షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల ద్వారానే పూజాసామగ్రిల విక్రయాలు సాగుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతానికి ప్లాస్లిక్‌పై దశలవారీగా నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలంది. దేవస్థానాల చుట్టూ నిర్ధిష్ట పరిధిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది. ప్లాస్టిక్ వల్ల మురుగుకాలువలు పూడిపోయి, మురుగునీరు సాఫీగా వెళ్లడంలేదంది. ప్లాస్టిక్ భూతం వల్ల అడవుల్లో పులులు వంటి ఎన్నో జంతువులను కోల్పోతున్నామంది. విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment