ban on plastic
-
ప్లాస్టిక్ నిషేధం తక్షణ అవసరం
విశాఖ లీగల్/సింహాచలం/దొండపర్తి (విశాఖ దక్షిణ): భావితరాల మనుగడకు, పర్యావరణ పరి రక్షణకు ప్లాస్టిక్ నిషేధాన్ని తక్షణమే చేపట్టాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవా ప్రాధికారసంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ చెప్పారు. జాతీయ, రాష్ట్ర, విశాఖ జిల్లా న్యాయసేవా ప్రాధి కారసంస్థల ఆధ్వర్యంలో ‘పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, అసంఘటిత కార్మికులు’ అనే అంశంపై గురువారం విశాఖలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అందరం కలిసి ప్లాస్టిక్‌పై పోరాడదామన్నారు. ప్లాస్టిక్ నివారణకు విశాఖ మహా నగరపాలకసంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ప్లాస్టిక్ వినియోగంపై జూలై నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ఉత్పత్తి చేసే వారిని కూడా బాధ్యులుగా చేర్చాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయం అవసరం ప్లాస్టిక్ వద్దు, పేపరు ముద్దు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం అవసరమని చెప్పారు. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ భావితరాల జీవితం, పర్యావరణ సంరక్షణ కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ఈ సదస్సులో విశాఖ జిల్లా ప్రధాన న్యాయాధికారి హరిహరనాథశర్మ, కలెక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దంపతులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని, విశాఖ పోర్టును సందర్శించారు. సింహాచలం ఆలయ రాజగోపురం వద్ద కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. -
సీఎంకు డ్రైప్రూట్స్ బుట్ట.. మేయర్‌కు ఫైన్
బెంగళూరు : కొన్నిసార్లు మనం అనాలోచితంగా చేసే పనులు.. తప్పుల జాబితాలో చేరతాయి. తాజాగా ఇలాంటి అనుభవమే బెంగళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్‌కు ఎదురైంది. ఇటీవల కర్ణాటక సీఎంగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గంగాంబికే కూడా సీఎంను కలిసి శుభాకాంకక్షలు తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేయడానికి తీసుకెళ్లిన డ్రైప్రూట్స్ బుట్ట పైభాగంలో ప్లాస్టిక్ కవర్‌తో మూశారు. మేయర్ ప్లాస్టిక్ వినియోగించడం పట్ల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గంగాంబికే సీఎం ఇచ్చిన పండ్ల బుట్టకు ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్ లోగ్రేడ్కు చెందినదిగా కొందరు నెటిజన్లు గుర్తించారు. ఈ రకం ప్లాస్టిక్‌పై బెంగళూరులో నిషేధం ఉన్నట్టు వారు గుర్తుచేశారు. మేయర్ అయి ఉండి నిషేధిత ప్లాస్టిక్‌ను వినయోగిచడంపై గంగాంబికేను ప్రశ్నించారు. ఈ విషయం గంగాంబికేకు తెలియడంతో ఆమె స్వచ్ఛందంగా తన తప్పును అంగీకరించారు. అందుకు క్షమాపణ కూడా కోరారు. బెంగళూరు నగరపాలక సంస్థ జారీ చేసిన 500 రూపాయల జరిమానాను చెల్లించారు. పండ్ల బుట్టను తీసుకురావడానికి వేరే వారిని పంపించడంతోనే ఈ తప్పిదం జరిగిందని గంగాంబికే తెలిపారు. తాను కూడా దానిని చూడకుండానే సీఎంకు అందజేశానని.. చట్టం ముందు అందరు సమానులేనని పేర్కొన్నారు. కాగా, లోగ్రేడ్ ప్లాస్టిక్ వాడకం బెంగళూరు నగరపాలక సంస్థ 2016లో నిషేధం విధించింది. బెంగళూరు నగరంలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధించాలని పాలికె లక్ష్యంగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. -
ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిషేధంపై ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులు ముందుకెళ్లనివ్వరని, వారు తమ ఆర్థిక, రాజకీయ పరపతిని ఉపయోగిస్తారని, దీనిని తట్టు కుని నిలబడితేనే నిషేధం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణ(ఈపీ) చట్టం కింద ప్రభుత్వానికి విస్తృతాధికారాలు ఉన్నాయని, అయితే వాటిని ఉపయోగించ డం లేదని హైకోర్టు ఆక్షేపించింది. ప్లాస్టిక్ నిషేధ నిర్ణ యం ప్రభుత్వస్థాయిలో తీసుకోవాల్సినదని తెలిపింది. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాల తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడే నిషేధం సాధ్యమవుతుందని వివరించింది. ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేకుంటే తామే ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తామంటూ హైకోర్టు తన వైఖరిని తేల్చిచెప్పింది. కుంకుమ, పసుపు తదితరాలను ప్లాస్టిక్ కవర్లో వేసి వాటిని అయ్యప్ప ఇరుముడిలో ఉంచేందుకు సైతం శబరిమల ఆలయంలో అనుమతించడం లేదని, అక్కడ అంతస్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఇక్కడ కూడా అదేస్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్ప నిషేధం సాధ్యం కాదని పేర్కొంది. దేవస్థానాల్లో పూజాసామగ్రి అమ్మేషాపులు విరివిగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నాయని, అధికారులకు ఆ షాపులపై వచ్చే ఆదాయం తప్ప, సామగ్రికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు కనిపించవని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్లాస్టిక్ నిషేధంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవస్థానాల్లో అసౌకర్యాలు, నిర్వహణ లోటుపాట్లపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ నిషేధంపై ఏజీ నివేదిక దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధానికి తీసుకుంటున్న చర్యలపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం తమ ఆదేశాలను దేవాదాయశాఖ అధికారులు సక్రమంగా అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. దేవస్థానాల వద్ద ఉన్న షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల ద్వారానే పూజాసామగ్రిల విక్రయాలు సాగుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతానికి ప్లాస్లిక్‌పై దశలవారీగా నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలంది. దేవస్థానాల చుట్టూ నిర్ధిష్ట పరిధిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది. ప్లాస్టిక్ వల్ల మురుగుకాలువలు పూడిపోయి, మురుగునీరు సాఫీగా వెళ్లడంలేదంది. ప్లాస్టిక్ భూతం వల్ల అడవుల్లో పులులు వంటి ఎన్నో జంతువులను కోల్పోతున్నామంది. విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. -
కాలుష్య నివారణ దిశగా అడుగులు
మే నెలలో గోదావరి శుద్ధి కార్యక్రమం తీరంలో ప్లాస్టిక్‌పై నిషేధం ‘సాక్షి’ కథనానికి స్పందన రాజమండ్రి : కాలుష్యం కోరల నుంచి గోదావరికి విముక్తి కలిగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మలినాలను తొలగించి పుష్కరాలనాటికి నదీజలాలను కాలుష్యరహితం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నదీ కాలుష్యంపై ‘కాలుష్య కాసారం’ శీర్షికన గత నెల 28న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్.. ఈ బాధ్యతను ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు హెచ్.అరుణ్‌కుమార్, కాటమనేని భాస్కర్లకు అప్పగించారు. మే నెలలో గోదావరి నది నీటిమట్టం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. ఆ సమయంలో తీరగ్రామాల్లో నదిలో పెరిగిన నాచు, ఇతర పదార్థాలను తొలగిస్తారు. నీటి అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. ఇందుకు మత్స్యకారుల సహకారం తీసుకుంటారు. స్నానఘట్టాల్లో గోదావరిని కలుషితం చేయవద్దనే బోర్డులు పెట్టి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిఘా ఉంచుతారు. ఈ బాధ్యతను ప్రధానంగా ఆధ్యాత్మిక సేవాసంస్థలకు అప్పగించాలని ప్రసాద్ సూచించారు. నదీ కాలుష్యాన్ని నివారించాలనే నినాదంతో ఘాట్ల వద్ద ఇప్పటినుంచే ప్రచారం చేపట్టే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. ఇందుకోసం ఇప్పటికే యానాం ఎమ్మెల్యే ముందుకు వచ్చినట్టు సమాచారం. గోదావరి తీర గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. రాజమండ్రిలోని పలు స్నానఘట్టాల్లో వేలాదిగా ప్లాస్టిక్ వ్యర్థాలు తేలుతూంటాయి. నగరంలోని మురుగు కాలువల ద్వారా ఇవి నదిలో చేరుతున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.