ప్రసంగిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
విశాఖ లీగల్/సింహాచలం/దొండపర్తి (విశాఖ దక్షిణ): భావితరాల మనుగడకు, పర్యావరణ పరి రక్షణకు ప్లాస్టిక్ నిషేధాన్ని తక్షణమే చేపట్టాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవా ప్రాధికారసంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ చెప్పారు. జాతీయ, రాష్ట్ర, విశాఖ జిల్లా న్యాయసేవా ప్రాధి కారసంస్థల ఆధ్వర్యంలో ‘పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, అసంఘటిత కార్మికులు’ అనే అంశంపై గురువారం విశాఖలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అందరం కలిసి ప్లాస్టిక్‌పై పోరాడదామన్నారు. ప్లాస్టిక్ నివారణకు విశాఖ మహా నగరపాలకసంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ప్లాస్టిక్ వినియోగంపై జూలై నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ఉత్పత్తి చేసే వారిని కూడా బాధ్యులుగా చేర్చాలని ఆయన సూచించారు.
ప్రత్యామ్నాయం అవసరం
ప్లాస్టిక్ వద్దు, పేపరు ముద్దు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం అవసరమని చెప్పారు. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ భావితరాల జీవితం, పర్యావరణ సంరక్షణ కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.
ఈ సదస్సులో విశాఖ జిల్లా ప్రధాన న్యాయాధికారి హరిహరనాథశర్మ, కలెక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దంపతులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని, విశాఖ పోర్టును సందర్శించారు. సింహాచలం ఆలయ రాజగోపురం వద్ద కళాకారులతో కలిసి కోలాటం ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment