
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. వారి గుడిసెలను కూల్చివేయరాదని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారి జీవనానికి కావా ల్సిన కనీస సౌకర్యాలను కల్పించాలని తెలిపింది. అక్కడే నివాసం ఉంటున్న వారిని తాత్కాలిక ప్రాతిపదికన వ్యవసాయం చేసుకునేందుకు అనుమతించాలని పేర్కొంది. చెట్లను కూల్చి వ్యవసాయం చేయరాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అక్కడ ఉంటున్న వారు మినహా కొత్తవారు వెళ్లి వ్యవసాయ కార్యకలాపాలను విస్తరించడానికి వీల్లేదని తెలిపింది. మొత్తం వ్యవహారంలో తమ వైఖరిని తెలియచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులకు ఏ ఏ చట్టాలు వర్తిస్తాయి.. వాటి ప్రకారం వారికి రావాల్సిన ప్రయోజనాలు ఏమిటి.. వారికి అందాల్సిన పథకాలు ఏమిటి.. తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వలస వచ్చి రాష్ట్రంలోని పలు జిల్లాల అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గుత్తికోయలను ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించడం లేదని, వారికి ప్రభుత్వ పథకాలు సైతం అందడం లేదంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి.
కథనాలపై స్పందించిన హైకోర్టు, వీటిని సుమోటో పిల్‌గా మలిచింది. గుత్తికోయలకు సంబంధించి గతంలో దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కూడా పిల్‌కు జత చేసింది. ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో ధర్మాసనం ఇచ్చి న ఆదేశాల మేరకు మొత్తం వ్యవహారంపై ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఓ నివేదికను కోర్టు ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వలస వచ్చి దశాబ్దాలుగా నివాసం ఉంటున్న గుత్తికోయలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. గుత్తికోయల స్థితిగతులు తదితర అంశాలకు సంబంధించి తమకు ఓ నివేదికను సమర్పించాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్, జిల్లా కలెక్టర్‌లను ఆదేశించింది.