
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని, సవరించిన ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించలేదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హైకోర్టుకు నివేదించింది. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దకుండానే తుది జాబితా ప్రచురించారన్న ఆరోపణలు అర్థరహితమని తెలిపింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి తీసుకున్న వివరాల మేరకు పిటిషన్ దాఖలు చేయలేదని వివరించింది. 30.13 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారన్న ఆరోపణలకూ ఆధారాలు చూపలేదంది. అత్యాధునిక సాంకేతిక సాయంతో తప్పులను సవరించామని సీఈసీ తెలిపింది. ఊహాజనిత, అర్థరహిత ఆరోపణలతో శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరింది.
తన పిటిషన్‌లో సీఈసీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి తిరుగు సమాధానం ఇచ్చేందుకు అవకాశమివ్వాలని శశిధర్‌రెడ్డి తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధా కృష్ణన్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, వీటిని సవరించకుండా తుది ఓటర్ల జాబితాను ప్రచురించకుండా సీఈసీని ఆదేశించాలని కోరుతూ శశిధర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నామినేషన్ చివరి తేదీ వరకు సవరణ: సీఈసీ
శశిధర్‌రెడ్డి వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాల మేరకు సీఈసీ తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సత్యవాణి సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. శశిధర్‌రెడ్డి తన పిటిషన్‌లో చెప్పిన వివరాలన్నీ గతంలోనివని తెలిపారు. ప్రతీ ఏడాది ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఉంటుందని, ఎన్నికలు జరిగే చోట రెండోసారీ సవరణ ఉంటుందన్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం నామినేషన్ చివరి తేదీ వరకు సవరణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందన్నారు. ఎంతో తీవ్రస్థాయిలో పనిచేసి రెండో సవరణను పూర్తి చేశామన్నారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒకే రకమైన వివరాలున్న 4.92 లక్షల ఓటర్లను గుర్తించామని తెలిపారు. 2014 ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 2018 ఓటర్ల సంఖ్యలో 20 లక్షల తగ్గుదలను తప్పుపడుతున్నారని, ఇందుకు సహేతుక కారణాలున్నాయని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొందరు వలస వెళ్లడం, ఆధార్ అనుసంధాన ప్రక్రియ, అనర్హుల ఏరివేత వంటి కారణాల వల్ల ఓటర్ల సంఖ్య తగ్గిందని కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment