
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో విలీనం చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కలిపిన ఆ 7 మండలాలు ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయో తేల్చకుండానే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుం డటంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది.
బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ, 7 మండలాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఆ వివరాలను తమ ముందుంచాలని అవినాశ్‌కు స్పష్టం చేసింది. ఈ సమయంలో మర్రి శశిధర్‌రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ, చట్టం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం ఈ మండలాల విలీనం జరగలేదని తెలిపారు. వచ్చే విచారణ సమయంలో ఈ అంశంపై వాదనలు వింటామంటూ విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది.