![High Court Command to the Central Election Commission - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/3/ELECTION-BUILDING-5.jpg.webp?itok=kbW5MMCY)
సాక్షి, హైదరాబాద్: ఏకపక్షంగా తొలగించిన ఓటర్లకు తిరిగి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించేందుకు ప్రత్యేక దరఖాస్తును అందుబాటులో ఉంచే విషయంలో వైఖరి తెలియచేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపునకు గురైన ఓటర్లు, తిరిగి ఓటర్ల జాబితాలో స్థానం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడమే మార్గమని, అయితే దీని బదులు వారికోసం ప్రత్యేక దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ప్రతీ అగర్వాల్ మరో 25 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దసంఖ్యలో ఓటర్లను జాబితా నుంచి తొలగించారన్నారు. పిటిషనర్ల పేర్లను కూడా అలాగే తొలగించారని తెలిపారు. ఎన్నికల సంఘం తీరు వల్ల పిటిషనర్లు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారని, అందువల్ల రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకునే దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాక పరిహారం కూడా ఇప్పించాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, తొలగింపునకు గురైన ఓటర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చే విషయంలో ప్రత్యేక దరఖాస్తును తీసుకురావడంపై వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment