
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెలువరించే ఓటర్ల జాబితాల్లో తప్పు, ఒప్పుల్ని పరిశీలించేందుకు ఈసీకి హైకోర్టు ఏమీ ఆడిటర్ కాదు. ఈసీ కూడా తన పనిని తాను సమర్థంగా చేయాలి. లోటుపాట్ల పాపాన్ని ఇంటర్నెట్‌పై మోపడం అన్యాయం. కొత్త ఓటర్లను చేర్చేందుకు ఇంటర్నెట్ పనిచేస్తుంది కానీ బోగస్ ఓట్లను తొలగించేందుకు పనిచేయడం లేదా?’అని ఈసీని ఉద్దేశించి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. నకిలీ ఓట్ల తొలగింపునకు ఇంటర్నెట్ మొరాయిస్తోందన్న ఈసీ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని లేదా ఇతర అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లవచ్చని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం సూచన చేసింది. నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ 19 వరకూ ఓటర్ల జాబితాల్లో మార్పుచేర్పులకు అవకాశం ఉందని, 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తామని ఈసీ చెబుతోందని గుర్తు చేసింది. ఈసీ దగ్గర పని అవ్వకపోతే ఎలక్షన్ ట్రిబ్యునల్ వద్ద కేసులు దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది.
నకిలీ ఓట్లు తొలగించడం లేదు..
ఓటర్ల జాబితాలో నకిలీల పేర్లు ఉన్నాయని.. శశిధర్‌రెడ్డి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనర్హులను తొలగించామని ఈసీ తరఫు న్యాయవాది వివరణ ఇవ్వగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 16కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
మేనిఫెస్టోలు విధిగా పాటించాలా?
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల్లోని హామీలకు ఆ పార్టీలు కట్టుబడి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలనే మరో పిల్‌పై హైకోర్టు స్పందించింది. పిల్‌లోని అంశాలపై వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చార్టెడ్ అకౌంటెంట్ ఎం.నారాయణాచార్యులు ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణను ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.