సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులపై నిత్యం అడ్డగోలు ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా నోళ్లు మూయిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఓటర్ల జాబితాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం చర్యలు సంతృప్తికరంగా ఉన్నందున ఈ వ్యవహారంలో తదుపరి తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారిన ఓటర్లు లేదా మరణించిన ఓటర్లు లేదా డూప్లికేట్‌గా నమోదైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో చట్ట నిబంధనల మేరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు, ఓటర్ల జాబితా సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపడుతున్నామన్న సీఈసీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.
ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు చట్ట ప్రకారం వారికి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక తదుపరి ఆదేశాలతో పనేముందని విచారణ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసిందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యంతో తదుపరి విచారణ అవసరం లేదంది.
ఓటర్ల జాబితా విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ ‘సన్సద్ బాచావో ట్రస్ట్’ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన విసృ్తత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సన్సద్ బచావో ట్రస్ట్ పిటిషన్‌పై విచారణ
రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం సవరణ ఓటర్ల జాబితాలను తయారు చేసేలా ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించాలని, అలాగే చిరునామా మారిన, మరణించిన, డూప్లికేట్‌గా నమోదైన ఓటర్ల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ సన్సద్ బాచావో ట్రస్ట్ 2023లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆరోరా వాదనలు వినిపిస్తూ.. డూప్లికేట్ ఓటర్ల విషయంలో ఎన్నికల అధికారులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అమిత్ శర్మ స్పందిస్తూ.. డూప్లికేట్ ఓటర్లతో సహా ఓటర్ల జాబితా విషయంలో తాము తీసుకుంటున్న అన్ని చర్యలనూ వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
‘చట్టానికి లోబడే చేస్తున్నాం’
ఈ నేపథ్యంలో అమిత్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఓ నోట్ కూడా ధర్మాసనం ముందుంచారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు సుప్రీం ధర్మాసనం ఆ నోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. చిరునామాలు మారడం, మరణించడం, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘం తన కౌంటర్‌లో వివరించింది.
చట్టానికి లోబడి తాము చేస్తున్న పనులన్నింటినీ కోర్టుకు తెలియచేసింది. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించదలచుకుంటే వారికి నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి ఆ తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సవివరంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ప్రతి దశలో ఏం చేస్తున్నాయో తెలియజేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయాన్ని కూడా చెప్పింది. లోపాలన్నింటినీ సవరించిన తరువాతే తుది జాబితాను ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది.
ఎల్లో మీడియా నిత్య రాద్ధాంతం
ఏపీలో ఓటర్ల జాబితాల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు చేసిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ప్రతిరోజూ ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివారుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న ఆందోళనను ప్రజల్లో కలిగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.
కొంతకాలంగా ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తోంది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో స్వచ్ఛత లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అడ్డగోలుగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపులు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎల్లో మీడియాకు గట్టిగానే షాకిచ్చేవిగా ఉన్నాయి.
మొత్తం ఓటర్లు 96.85కోట్ల మంది
2024 ఫిబ్రవరి 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 96,85,01,358 మంది ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇందులో 49.70 కోట్లు పురుషులు కాగా.. 47.13 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారని వివరించింది. 48,057 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని, దివ్యాంగ ఓటర్లు 88.24 లక్షలు ఉన్నారని వివరించింది. 18–19 సంవత్సరాల వయసు మధ్య 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 80 సంవత్సరాల పైబడిన వారు 1.86 కోట్లు ఉన్నారని వివరించింది.
100 ఏళ్లు దాటిన ఓటర్లు 2.40 లక్షల మంది ఉన్నారని తెలిపింది. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్)లో కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లుగా చేరారని వివరించింది. ఇందులో 1.41 కోట్ల మహిళలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. కొత్తగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చామని వివరించింది. 2024 ఎస్‌ఎస్‌ఆర్‌లో 1.65 కోట్ల మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 67.82 లక్షల మంది చనిపోయారని, 75.11 లక్షల మంది శాశ్వతంగా చిరునామాలు మారారని, 22.05 లక్షలు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపింది.
ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా సుప్రీం కోర్టుకు వివరించింది. పిటిషనర్ లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేసింది. బహుళ ఎంట్రీలు, ఏకరూప ఫొటోలు, భౌగోళికంగా ఓ ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంది. ఈ ఉత్తర్వులతో సన్సద్ బచావో ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రొసీడింగ్స్‌ను మూసివేస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment