తరుణ్ ఛుగ్ నేతృత్వంలో ఈసీని కలిసి బయటకు వస్తున్న బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితాలో టీఆర్‌ఎస్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఇటీవల ఓటర్ల జాబితా లో చేరినవారి వివరాలను పరిశీలించాలని, అక్రమాలను అడ్డుకొనేందుకు వెంటనే పరిశీలకుడిని పంపించాలని కోరింది.
అనంతరం కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ సారంగి, తెలంగాణ బీజేపీ నాయకుడు రామచందర్‌రావులతో కలిసి తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడులో 25వేల కొత్త ఓటర్ల నమోదు జరిగింది. సాధారణంగా కొత్త ఓటర్ల నమోదు సమయంలో ఎన్నడూ ఈ నియోజకవర్గంలో 2,000 మంది దాటలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? 25 వేల కొత్త ఓటర్లు అంటే.. 40 వేల మందికిపైగా జనాభా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు భావించాలి. అంత భారీగా వలస ఎలా సాధ్యం? దీనిపై చర్యలు చేపట్టాలని ఈసీని కోరా’ అని తరుణ్ ఛుగ్ వెల్లడించారు.
అధికారులను బదిలీ చేయాలి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు మునుగోడు ప్రాంతంలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఈసీ అనుమతి లేకుండా అక్కడికి వెళ్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని మునుగోడుకు మార్చి అక్కడ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేశారని.. అధికార యంత్రాంగం, మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారని విమర్శించారు.
ఆ ఆరోపణలన్నీ అవాస్తవం
రాజగోపాల్‌రెడ్డిపై కేటీఆర్, టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. కాగా మునుగోడు లో ఓటర్ల నమోదు వ్యవహారంలో గోల్‌మాల్ ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్కొన్నారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఎన్నికల పర్యవేక్షకులను నియమించి అవకతవకలకు అడ్డుకట్ట వేయా లని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment