మాట్లాడుతున్న జస్టిస్ రాధాకృష్ణన్, చిత్రంలో నేషనల్ లా యూనివర్సిటీ వీసీ వెంకట్రావు, జస్టిస్ డీవీ సోమయాజులు, తదితరులు
సాక్షి, విశాఖపట్నం: బార్ అసోసియేషన్‌లో కూర్చున్న వారే తర్వాతి రోజుల్లో బెంచ్‌లో తీర్పులిస్తుంటారని.. అందువల్ల బార్‌కు, బెంచ్‌కి మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ అన్నారు. దిగువ కోర్టు తీర్పులను కనీసం చదవకుండా పైస్థాయి కోర్టుల్లో వాదించడం వల్ల తీర్పులకు ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తున్నాయని, తద్వారా సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో శనివారం సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రాధాకృష్ణన్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ దివంగత డీవీ సుబ్బారావు స్మారకోపన్యాసం చేశారు. న్యాయవాదిగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, నగర మేయర్‌గా, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు అధ్యక్షుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందరి మన్ననలు అందుకున్న సుబ్బారావు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు.
కొందరు కక్షిదారులు కేసులో తమ తరఫున న్యాయవాదులను నియమించుకొని, విచారణ సమయంలో వారు కోర్టులకు రావట్లేదన్నారు. కక్షిదారులు విధిగా కోర్టులకు రావాలని, అప్పుడే తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది, న్యాయవాదులు ఏవిధంగా వాదిస్తున్నారో అర్థమవుతుందన్నారు. తీర్పు చెప్పేటప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్న వారు ఒకటి రెండుసార్లు ఆలోచించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీర్పులివ్వాలని సూచించారు. న్యాయస్థానాల్లో అందరూ సమానులేనని స్పష్టం చేశారు.
తాను న్యాయవాదిగా ఉన్నంత కాలం ఏనాడూ అలసత్వం వహించలేదని, సత్యం మాత్రమే ప్రకటించి కక్షిదారులకు సహాయం చేశానని గుర్తు చేశారు. సత్యాన్ని నమ్ముకుంటే న్యాయం దానంతట అదే వస్తుందన్న సిద్ధాంతాన్ని న్యాయవాదులు ముందుగా తెలుసుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ (బెంగుళూరు) ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీ సోమయాజులు, విశాఖకు చెందిన న్యాయనిపుణులు, విద్యావేత్తలు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment