న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరిం చుకోవడంతో పాటు ఉమ్మడి హైకోర్టు
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానం
సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరిం చుకోవడంతో పాటు ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో జూలై 1న హైకోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులకు చెందిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు మోహనరావు తెలిపారు. హైకోర్టులో ప్రవేశానికి రిజిస్ట్రార్ జనరల్ పేరు మీద జారీ అయిన మార్గదర్శకాల్లో ఐదో క్లాజ్‌ను తొలగించాలని కూడా తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే కేటాయింపుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఏసీజేను కలిసిన బార్ కౌన్సిల్ సభ్యులు
హైకోర్టు విభజన, ప్రాథమిక కేటాయింపుల జాబితా ఉపసంహరణ అభ్యర్థనలతో బార్ కౌన్సిల్ సభ్యులు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం సమర్పించినట్లు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థనలపై దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనల పట్ల తాత్కాలిక సీజే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు.