
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ మంగళవారం హైకోర్టు న్యాయవాదులకు తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన వద్దకు బయోడేటాలతో రావద్దని, విషయ పరిజ్ఞానంతో రావాలని స్పష్టం చేశారు. న్యాయవాదుల వ్యవహారశైలిని బట్టే న్యాయమూర్తుల తీరు ఉంటుందన్నారు. బార్ అండ్ బెంచ్(న్యాయవాదులు–న్యాయమూర్తులు) మధ్య సహకారం ఉండాలని, అయితే అది కేసుల విషయంలో కాదని, కక్షిదారులకు న్యాయం చేసే విషయంలోనేనని తెలిపారు. ఇప్పటివరకు తాను అవినీతిని దరిచేర నీయ లేదని, దాన్ని ప్రోత్సహించడం చేయలేదన్నారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల విజ్ఞప్తి మేరకు జస్టిస్ రాధాకృష్ణన్ మంగళవారం మధ్యా హ్నం భోజనవిరామంలో ఆ సంఘాలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యాయవాదులు సొంత శైలిని కలిగి ఉండాలి: ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఎవరినీ అనుకరించకుండా సొంత శైలిని కలిగి ఉండాలన్నారు. తన తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని, కొందరు తనను తన తండ్రిలా, మరికొందరు తనను తన తల్లిలా ఉండాలని సూచించారన్నారు. అయితే తాను మాత్రం సొంత శైలిని ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. పెద్ద పెద్ద లా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవలేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు.
ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదని, ఎంత కష్టపడ్డాం.. ఎంత నిబద్ధతతో పనిచేశాం.. అన్నదే ముఖ్యమని తెలిపారు. కట్ అండ్ పేస్ట్ విధానాలకు స్వస్తి పలికినప్పుడే జీవితంలో ముందుకెళ్లడం సాధ్యమవుతుందన్నారు. న్యాయవాదులు లేకుండా న్యాయమూర్తులు లేరని, వీరిద్దరి లక్ష్యం కూడా మారుమూల ఉన్న కక్షిదారులకు న్యాయం చేయడమేనన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను ఇరు సంఘాల ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment