
సాక్షి, హైదరాబాద్ : అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనంలో న్యాయవాదులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని సీనియర్ న్యాయవాదులు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకున్న సమాచారం ప్రకారం న్యాయవాదులకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని, హైకోర్టును అమరావతికి తరలించేలోపే అడ్వకేట్లకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తే తదుపరి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు సీజేకు వివరించారు.
తినేందుకు చిన్నపాటి హోటళ్లు కూడా లేవని తెలిపారు. సీనియర్ న్యాయవాదులకు చాంబర్లను ఏర్పాటు చేయాలని కోరారు. హైకోర్టు భవన నిర్మాణం నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తయ్యే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయని వారు సీజే దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ చూస్తోందని, చెప్పిన సమయానికి భవనాన్ని అప్పగిస్తామని అది హామీ ఇచ్చిందని సీజే ఈ సందర్భంగా వారికి తెలిపారు. తాము (న్యాయమూర్తుల కమిటీ) కూడా ఆ హామీని నిలబెట్టుకుంటుందని నమ్ముతున్నామని ఆయన వారికి చెప్పారు.
సానుకూలంగా స్పందించిన సీజే..
సీనియర్ న్యాయవాదులు చెప్పిన విషయాలను రాసుకున్న ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు విభజన కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రామసుబ్రమణియన్‌తో మాట్లాడి లాయర్లకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. కొన్ని రకాల కేసులను హైకోర్టు విభజనకు ముందే తేల్చాల్సిన అవసరం ఉందని, విభజన జరిగితే వాటిని సుప్రీంకోర్టు మాత్రమే తేల్చాల్సి ఉంటుందని వారు సీజే దృష్టికి తీసుకొచ్చారు.ఆ పరిస్థితి తలెత్తకుండా విభజనకు ముందే ఆ కేసుల పరిష్కరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సీజే జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ సానుకూలంగా స్పందించారు.