హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు | Three lawyers as High Court Judges | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు

Published Wed, Oct 16 2024 4:13 AM | Last Updated on Wed, Oct 16 2024 4:13 AM

Three lawyers as High Court Judges

కుంచం మహేశ్వరరావు, చల్లా గుణ రంజన్, తూట చంద్ర ధనశేఖర్‌ పేర్లు సిఫారసు 

సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం తీర్మానం.. ఈ ఏడాది మేలో మొత్తం ఆరుగురి పేర్లు పంపిన హైకోర్టు కొలీజియం 

ఐబీ నివేదిక అనంతరం ఇటీవల సుప్రీంకు పేర్లు పంపిన కేంద్ర న్యాయశాఖ.. తాజాగా వారిలో ముగ్గురి పేర్లకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర

సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. 

హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. 

మహేశ్వరరావు కుంచం
కుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998­­లో తిరుపతి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 

1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సీనియర్‌ న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్‌ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. 

ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, శ్రీరాం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.

తూట చంద్ర ధనశేఖర్‌
తూట శైలజ, చంద్రశేఖరన్‌ దంపతులకు 1975 జూన్‌ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్‌ గతంలో చిత్తూరు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని­చేశారు. సత్యవేడు జూనియర్‌ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్‌ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 

మాజీ అడ్వొకేట్‌ జనరల్, సీని­యర్‌ న్యాయ­వాది పరాంకుశం వేణుగోపాల్‌ వద్ద జూని­యర్‌గా పని­చేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితుల­య్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాద­నలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగు­తున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.

చల్లా గుణ రంజన్‌
చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయ­­వాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ సోదరుడి వరుస అవు­తారు. గుణ రంజన్‌ 2001లో న్యాయవాదిగా ఎన్‌­రోల్‌ అయ్యారు. సోదరుడు కోదండరామ్‌ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

 సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బి­ట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్‌ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.  

సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..
ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్ల­ను హైకోర్టు న్యాయమూ­ర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్‌ కుమార్‌ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. 

కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూ­ర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశ­మైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయ­మూ­ర్తు­లుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయ­మూ­ర్తులు కొనసాగు­తున్న నలుగురి అభిప్రా­యాలు కూడా అంతకు ముందే తీసుకుంది. 

వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వార­ని అభిప్రా­య­పడ్డారు. ఈ నేప­థ్యంలో తాజాగా జరిగిన కొలీ­జియం సమావేశంలో మహే­శ్వర­­­రావు, ధనశేఖర్, గుణ రంజన్‌ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసు­­కున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూ­ర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన  ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూ­ర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయ­వాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికా­రుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. 

ఏపీ జ్యుడీషి­యల్‌ అకాడమీ డైరెక్టర్‌ అవధానం హరిహర­నాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement