హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు | Three more as Additional Judges of the High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు

Published Fri, Oct 25 2024 5:15 AM | Last Updated on Fri, Oct 25 2024 5:15 AM

Three more as Additional Judges of the High Court

మహేశ్వర రావు, ధనశేఖర్, గుణ రంజన్‌ల నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర 

నియామకాల నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం 

29కి చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 

శనివారం లేదా సోమవారం ప్రమాణం చేసే చాన్స్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణ రంజన్‌ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్‌ శ్రీనివాసన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది ఉన్నారు. 

ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 29కి చేరింది. దీంతో మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌కు ఉత్తరాఖండ్‌ సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

పంపింది ఆరుగురి పేర్లు..
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే15న ఆరుగురు న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజా­బాబు, గేదెల తుహిన్‌ కుమార్‌ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించింది. 

గతంలో ఆంధ్రప్రదేశ్‌ హై­కోర్టు­­లో పనిచేసి, ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారి నుంచి కూడా కొలీజియం అభిప్రాయాలు తీసుకుంది. అనంతరం హైకోర్టు ప్రతిపాదించిన ఆరుగురిలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌కు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. వారిని న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. 

వీరి నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. వారి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ ముగ్గురు ఎప్పు­డు ప్రమాణం చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.

మహేశ్వరరావు కుంచం
కుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 

1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సీనియర్‌ న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం స్వతంత్రంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. 

ముఖ్యంగా సివిల్‌ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూ్యరెన్స్‌ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూ్యరెన్స్‌ కంపెనీ, శ్రీరాం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.

చల్లా గుణరంజన్‌
చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఈయనకు సోదరుడి వరుస అవుతారు. గుణరంజన్‌ 2001లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సోదరుడైన కోదండరామ్‌ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కోదండరామ్‌ జడ్జి అయిన తరువాత ఆయన ఆఫీ­సును గుణ రంజన్‌ విజయవంతంగా నడిపించారు.

సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యు­నళ్ల ముందు పలు కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమి­నల్‌ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.

తూట చంద్ర ధనశేఖర్‌
తూట శైలజ, చంద్రశేఖరన్‌ దంపతులకు 1975 జూన్‌ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. తండ్రి చంద్రశేఖరన్‌ గతంలో చిత్తూరు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్‌ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌­లో చదివారు. నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో లా పూర్తి చేశారు. 

ధనశేఖర్‌ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్, సీనియర్‌ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్‌ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement