హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే

Published Thu, Feb 8 2024 4:22 AM

Andhra Pradesh High Court angry On lawyers - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది.

సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. 
 
కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు 

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది.

సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. దీనికి బార్‌ కౌన్సిల్‌ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి సర్క్యులర్‌లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 
 
చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం 
అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది.

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్‌ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్‌ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్‌ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు.

రూ.20 వెల్ఫేర్‌ స్టాంపు విషయంలో బార్‌ కౌన్సిల్‌ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్‌ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది.   

Advertisement
 
Advertisement