దీక్ష చేస్తున్న న్యాయవాదులు
కర్నూలు(లీగల్): హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే వరకు ఉద్యమం ఆపేది లేదని న్యాయవాదులు స్పష్టంచేశారు. కర్నూలులోని ధర్నా చౌక్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు నరసింహ, సంపత్‌కుమారి, బి.కృష్ణమూర్తి, సోమశేఖర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరం వద్దకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరితోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, డోన్, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాదులు వచ్చి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చౌదరి, కార్యదర్శి దస్తగిరి మరికొందరు మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు భాస్కర్‌రెడ్డి కూడా న్యాయవాదులకు మద్దతు తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కొలిమిగుండ్ల ప్రాంతంలో కలసి వినతిపత్రం సమరి్పస్తామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కాటం రంగడు, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, రాయలసీమ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నేత వై.జయరాజు, ఓంకార్ తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment