1.87 లక్షల కేసులతో ప్రారంభం | Telangana High Court journey started with above one lakh cases | Sakshi
Sakshi News home page

1.87 లక్షల కేసులతో ప్రారంభం

Published Thu, Jan 3 2019 2:21 AM | Last Updated on Thu, Jan 3 2019 2:21 AM

Telangana High Court journey started with above one lakh cases - Sakshi

బుధవారం న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతున్న చీఫ్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా కొలువు దీరిన తెలంగాణ హైకోర్టు బుధవారం తొలిరోజు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేసుల విచారణకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) మొదటి కోర్టు హాలులో సమావేశమయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి, న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కావడం తనకు దక్కిన గౌరవం అని సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 1.87 లక్షల కేసులతో తెలంగాణ హైకోర్టు తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోందని వెల్లడించారు. అనేక చారిత్రక ఘట్టాలకు ఈ న్యా యస్థానం వేదికగా నిలిచిందన్నారు. న్యాయ వాదులు, న్యాయమూర్తులుగా అత్యుత్తమ స్థాయిలో విధులు నిర్వర్తించేందుకు బద్ధులుగా ఉంటామని మనకు మనం ప్రతిజ్ఞ చేసుకోవాలని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయవాదుల సంఘాలు, అడ్వొకేట్‌లు జనరల్, ప్రభుత్వ అపరిమిత మద్దతు వల్ల, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది కృషి వల్ల ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా రూపాంతరం చెందిందన్నా రు. సకాలంలో న్యాయా న్ని అందించే దిశగా క్రమశిక్షణ, సమతుల్యతను అలవరుచుకో వాలని న్యాయమూర్తులకు సూచించారు. 

బార్, బెంచ్‌ కలిస్తేనే.. 
న్యాయవాదులు(బార్‌), న్యాయమూర్తులు (బెంచ్‌) కలసి పరిమాణాత్మక, గుణాత్మక దిశ గా పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని సీజే ఆశాభావం వ్యక్తం చేశారు. బార్, బెంచ్‌ నాణేనికి రెండు ముఖాలు మాత్రమే కాదని, న్యాయరథానికి రెండు చక్రాలు కూడా అని అన్నారు. ఇవి న్యాయప్రతిష్టను ముందుకు తీసుకెళ్తాయన్నారు. తెలంగాణలో అత్యున్నత న్యాయస్థానం ఉన్న ఈ కేంద్రం నుంచి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు కలసి నడుద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ చారిత్రకఘట్టాలకు సాక్షులుగా నిలవడం గౌరవంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట, విలువను కాపాడేందుకు న్యాయవాదులంతా కృషి చేస్తామన్నారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి, న్యాయవ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు బార్‌కౌన్సిల్‌ కట్టుబడి ఉందన్నారు. న్యా యవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జడ్జీల ఖాళీలను భర్తీచేయాలని, అప్పుడే సత్వర న్యాయం సాధ్యమవుతుందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమం అనంతరం కేసుల విచారణ ప్రారంభమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement