సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు బయటికి రావడం, ముఖ్యమంత్రే నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి నిందితులే కుట్రదారులని చెప్పడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తన తీర్పులో స్పష్టం చేశారు.
ఇలాంటివి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. అందువల్ల నిందితుల విజ్ఞప్తి మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన 26 కేసుల తీర్పులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు బుధవారం విడుదలైన తీర్పు ప్రతిలో కీలక కామెంట్లు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలోని ప్రధాన అంశాలివీ..
ఈ తీరుతో కేసు దర్యాప్తుపై ప్రభావం
‘‘ముఖ్యమంత్రే నేరుగా మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులతోపాటు పలువురిని కుట్రదారులని ముద్రవేశారు. వారే వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు ఒక్కోసారి కేసు దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేయడంతోపాటు మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించినా ప్రయోజనం ఉండకపోవచ్చు.
అంతేగాకుండా నిందితులు ఈ కేసు విచారణను మరో ఏజెన్సీకి బదిలీ చేయాలని మాత్రమే కోరారు. కేసును కొట్టివేయాలని ఏమీ విజ్ఞప్తి చేయలేదు. ఇక జీవో నంబర్ 268 ప్రకారం.. ఇలాంటి కేసులో ఏసీబీ విభాగంలోని పోలీసు అధికారే దర్యాప్తు చేయాలి తప్ప సాధారణ పోలీసులు కాదు. సాధారణ పోలీసులు కేసు నమోదు చేసినా ఏసీబీ విభాగానికి బదిలీ చేయాల్సి ఉంది. ఈ కేసులో అలా జరగలేదు.
అసలు సీఎంకు మెటీరియల్ ఎలా వెళ్లింది?
ముఖ్యమంత్రికి రాజేంద్రనగర్ ఏసీపీయే వీడియోలు, పెన్‌డ్రైవ్‌లు ఇచ్చారని పిటిషనర్లు (వారి న్యాయవాదులు) ఆరోపించారు. మరి ఏసీపీ ఇవ్వలేదని సిట్‌గానీ, పోలీసులుగానీ ఖండించలేదు. కౌంటర్‌లో ఎక్కడా పేర్కొనలేదు. కేసు మెటీరియల్‌ను ఇతరులకు ఇవ్వడం తీవ్ర ఆక్షేపణీయం. అసలు సీఎంకు మెటీరియల్ ఎలా వెళ్లిందనే విషయంలో పోలీసులు, సిట్ అధికారులు మౌనం వహించారు. ప్రెస్‌మీట్ పెట్టడం, మీడియాకు వీడియోలు ఇవ్వడం, తెలంగాణ సీజేతోపాటు ఇతర రాష్ట్రాల సీజేలకు ముఖ్యమంత్రి మెటీరియల్ పంపడంపై ప్రభుత్వ (సిట్) తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కూడా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను అనుమతిస్తున్నాం. సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63ను కొట్టివేస్తున్నాం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు నంబర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేస్తున్నాం. నిందితులు వేసిన పిటిషన్లను అనుమతిస్తున్నాం. ఇదే సమయంలో బీజేపీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని తీర్పు ప్రతిలో న్యాయమూర్తి పేర్కొన్నారు.
తీర్పు పూర్తి కాపీలో..
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ విచారణపై నమ్మకం లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారమే (ఈ నెల 26న) తీర్పు వెలువరించారు. ‘ఎర’ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని.. సిట్ వెంటనే దర్యాప్తు ఆపేసి, పూర్తి వివరాలు, మెటీరియల్‌ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీని కోర్టు బుధవారం విడుదల చేసింది.
నేడు రాష్ట్ర సర్కారు అప్పీల్!
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు సిద్ధమైంది. గురువారమే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ కేసులో తీర్పు ప్రతి విడుదలయ్యే వరకు అమలును ఆపాలంటూ ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ 26న విజ్ఞప్తి చేయడం, దానికి న్యాయమూర్తి అంగీకరించడం తెలిసిందే. తీర్పు ప్రతి అధికారికంగా విడుదలకావడంతో సీబీఐ ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తును తమ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా అప్పీల్‌కు వెళ్లాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది.
జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తూ.. ఎఫ్ ఐ ఆర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేయడంతో పాటు సిట్ చేసిన దర్యాప్తును సైతం రద్దు చేస్తున్నట్లు ఆ ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో 26 కేసుల జడ్జిమెంట్లను అందులో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment