Telangana High Court Suspended For Merger Of VRAs Into Govt - Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల విలీనానికి నో

Aug 11 2023 3:47 AM | Updated on Aug 11 2023 11:17 AM

Telangana High Court Suspended For merger of VRAs into Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)లను క్రమబద్ధీకరించి, జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వీఆర్‌ఏల నియామకం చట్టవిరుద్ధమని, అది చెల్లదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85లను సస్పెండ్‌ చేసింది. రెవెన్యూ శాఖలో జూలై 24న జీవో 81 జారీకి ముందున్న పరిస్థితినే కొనసాగించాలని స్పష్టం చేస్తూ.. స్టేటస్‌కో ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా వీఆర్‌ఏలు ఇప్పటికే కొత్త విధుల్లో చేరినా వారు తిరిగి వెనక్కి వెళ్లాలని తేల్చిచెప్పింది.

ఇక పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు.. ప్రతివాదుల జాబితా నుంచి సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘం, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ను తొలగించింది. వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించడంపై వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ ఆఫీస్‌ సబార్డినేట్లు.. వయసు ఎక్కువున్న వారికి పింఛన్‌ వంటి ప్రయోజనాలు లేకుండా చేశారని వీఆర్‌ఏలు ఇలా వివిధ అంశాలపై హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి.. ప్రభుత్వం తరఫున జీపీ రామారావు వాదనలు వినిపించారు. నవీన్‌ మిట్టల్‌ తీరు సరిగా లేదు.. 

సబార్డినేట్లకు అన్యాయం 
తొలుత పిటిషనర్ల తరఫున పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి వాదిస్తూ.. ‘‘చట్ట ప్రకారం ఉద్యోగాల నియామకానికి ఒక ప్రక్రియ ఉంటుంది. వీఆర్‌ఏల విషయంలో ఆ ప్రక్రియ చేపట్టలేదు. సర్వీస్‌ రూల్స్‌లోనూ ఎలాంటి మార్పు చేయలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంలో రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు జీవోలు జారీ చేసింది. సీనియర్లలో 19వ స్థానంలో ఉన్న నవీన్‌ మిట్టల్‌ను ఉద్దేశపూర్వకంగా సీసీఎల్‌ఏగా నియమించింది. దీనికి కృతజ్ఞతగా ఆయన చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోకుండానే ప్రొసీడింగ్స్‌ ఇచ్చేస్తున్నారు. సీసీఎల్‌ఏగా మిట్టల్‌ నియామకం చెల్లదు.

రాత్రి జీవోలు ఇచ్చి ఉదయానికల్లా విధుల్లో చేరాలని ఆదేశించడం ఇంత వరకు ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. పైగా అంతా ఇప్పటికే విధుల్లో చేరారని కోర్టుకు చెప్పడం హాస్యాస్పదం. రాజ్యాంగబద్ధమైన కోర్టుల ముందు ఇలాంటి చర్యలను సమర్ధించుకోజాలరు. ఓ వైపు సర్వీస్‌ నిబంధనలు అవసరం లేదంటూనే.. మరోవైపు అవసరమైతే జారీ చేస్తామనడం శోచనీయం. రాష్ట్రంలో ఆఫీస్‌ సబార్డినేట్లు ఏళ్లతరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

వారిని కాదని వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించడం సరికాదు. వీఆర్‌ఏల సర్దుబాటు పేరిట ఆఫీస్‌ సబార్డినేట్లకు అన్యాయం చేయడం తగదు. అదేవిధంగా వీఆర్‌ఏలకు పదవీ విరమణ ఉండదు. దీన్ని అడ్డుపెట్టుకుని వారికి పింఛన్, గ్రాట్యుటీ వంటివి ఇవ్వకుండానే రిటైర్‌ అయ్యేలా చేయడం అన్యాయం. ఇది వయసు మీద పడిన వీఆర్‌ఏలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. దీనిపై పిటిషన్లు వేసిన వారిని ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోంది’’ అని కోర్టుకు విన్నవించారు. 
 
ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం.. రాజకీయ విమర్శలు చేయడమేంటి? 

పిటిషనర్ల వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున జీపీ రామారావు వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్లు ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సర్వీస్‌ నిబంధనల గురించి మాట్లాడకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు. సీసీఎల్‌ఏగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. సర్వీస్‌ నిబంధనలకు, ఎన్నికలకు, సీసీఎల్‌ఏకు ఏమిటి సంబంధం? వీఆర్‌ఏలను ఒక్క రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయడంలేదు. ఇతర శాఖలకూ పంపుతున్నాం. వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినంత మాత్రాన ఆఫీస్‌ సబార్డినేట్లపై ప్రతికూల ప్రభావం ఉండదు.

వీఆర్‌ఏల విలీనం కోసం ప్రభుత్వం సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించింది. అందువల్ల ఎవరికీ నష్టం ఉండదు. కొత్త పోస్టుల కోసం సర్వీసు నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉండదు. వీఆర్‌ఏలకు పింఛను, గ్రాట్యూటీ వంటివి ఇతర ఉద్యోగులకు వర్తించినట్లే ఉంటాయి. పెద్ద వయసు వారికి తక్కువ సర్వీసు ఉందనే కారణంగా మొత్తం ప్రక్రియ అక్రమమని చెప్పలేం.

ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం విధానపర నిర్ణయం తీసుకుంది. అందులో జోక్యం కూడదు. వీఆర్‌ఏలను ఇప్పటికే సర్దుబాటు చేశాం.. మెజారిటీ విధుల్లో చేరారు. ఈ పిటిషన్లు సమర్థనీయం కాదు..కొట్టివేయాలి’’ అని కోర్టుకు వాదనలు వినిపించారు. 

నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలిస్తారా? 
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వీఆర్‌ఏలు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. వారికి ఆ హోదా కల్పించి వేతనాలు ఇవ్వడం ఎలా సమర్థనీయమని నిలదీసింది. ‘‘వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు చేసినప్పుడు వీఆర్‌ఏలను ఎందుకు కొనసాగించారు? పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారిని కేటగిరీలుగా ఎలా విభజిస్తారు? ఎలాంటి ఎంపిక ప్రక్రియ లేకుండా ఎలా నియమిస్తారు? జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వారి ఎంపిక ప్రక్రియ ఏంటి? జూనియర్‌ అసిస్టెంట్‌ సమాన స్థాయి కలిగిన విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో)లను జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లోకి ఎందుకు తీసుకోలేదు? అంటే మీకు నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలు ఇస్తారా? రెవెన్యూ శాఖలో ఖాళీలు లేవంటూనే 50శాతం మందిని ఎలా సర్దుబాటు చేశారు?’’ అని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.

వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించే అంశంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆదేశాల ప్రతి కోసం ఎదురుచూడకుండా వెంటనే వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వివిధ చోట్ల పోస్టింగ్‌ పొందిన వీఆర్‌ఏలు తిరిగి వెనక్కి రానున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement