![Telangana High Court On Naveen Mittal LOC Issue - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/21/HC-2.jpg.webp?itok=g0P8Cuti)
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ స్థలానికి సంబంధించి నవీన్ మిత్తల్ కమిటీ ఎన్‌ఓసీ జారీ చేసిన అంశంలో దర్యాప్తును మరో సంస్థకు అప్పగింతపై 3న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే రంగారెడ్డి జిల్లా గుడిమల్కాపూర్‌లోని 5,262 గజాల స్థలానికి ఎన్‌ఓసీ జారీ చేయడంపై దర్యాప్తును సిట్‌కు లేదా సీబీఐకి అప్పగించాలన్న మధ్యంతర పిటిషన్‌ను వచ్చే నెల 3కు వాయిదా వేసింది.
శాంతి అగర్వాల్ కొనుగోలు చేసిన దాదాపు 5వేల గజాల స్థలానికి తప్పుడు పత్రాలు సమర్పించిన వారికి నవీన్ మిత్తల్ కమిటీ ఎన్‌ఓసీ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ శాంతి 2011లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్‌ఓసీ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.
నవీన్ మిత్తల్, జాయింట్ కలెక్టర్ వి.వి.దుర్గాదాస్, తహసీల్దార్లు మధుసూధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుపై 2017లో ప్రైవేటు వ్యక్తులతోపాటు అధికారులు అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment