హైకోర్టు సీజే రాధాకృష్ణన్‌ బదిలీ  | Telangana Highcourt Chief Justice Radhakrishnan Has Been Transfered | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజే రాధాకృష్ణన్‌ బదిలీ 

Published Sat, Jan 12 2019 2:34 AM | Last Updated on Sat, Jan 12 2019 2:34 AM

Telangana Highcourt Chief Justice Radhakrishnan Has Been Transfered - Sakshi

జస్టిస్‌ రాధాకృష్ణన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రా«ధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయిం చింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన డీకే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిజ్‌ రంజన్‌గొగాయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌మిశ్రాలతో కూడిన కొలీజియం గురువారం భేటీ అయ్యింది.

జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ భేటీలో తీర్మానించింది. కేరళకు చెందిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌ గతేడాది జూలై 1న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు. వచ్చిన 6 నెలలకే ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణన్‌ బదిలీ నేపథ్యంలో రెండో స్థానంలో కొనసాగుతున్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశముంది. కేరళలో పని చేస్తున్న జస్టిస్‌ దామ శేషాద్రినాయుడును బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. శేషాద్రినాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. 

జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేపథ్యమిదీ.. 
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ కేరళకు చెందినవారు. తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌.. కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్‌లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.

1988లో తన ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అతి తక్కువ కాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015న అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement