Hicourt
-
న్యాయమూర్తులకు నైతికతే కీలకం
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్‌పై కొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ -
హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రా«ధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయిం చింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన డీకే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిజ్ రంజన్‌గొగాయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన కొలీజియం గురువారం భేటీ అయ్యింది. జస్టిస్ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ భేటీలో తీర్మానించింది. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ గతేడాది జూలై 1న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు. వచ్చిన 6 నెలలకే ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో రెండో స్థానంలో కొనసాగుతున్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశముంది. కేరళలో పని చేస్తున్న జస్టిస్ దామ శేషాద్రినాయుడును బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. శేషాద్రినాయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. జస్టిస్ రాధాకృష్ణన్ నేపథ్యమిదీ.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కేరళకు చెందినవారు. తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్.. కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1988లో తన ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అతి తక్కువ కాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015న అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. -
పల్లెపోరు
సాక్షి, వనపర్తి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం పల్లెపోరుకు సన్నద్ధమవుతోంది. దీనిపై అధికార యంత్రాంగం తగిన కార్యాచరణపై దృష్టిసారించింది. పంచాయతీ ఎన్నికలను గడువులోగా నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడంపై హైకోర్టు ఈనెల 11న తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండగలోపే ఎన్నికలు ముగించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆశలపై నీళ్లు! ఈ ఏడాది జూలైలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్ నాటికే ఓటరు తుదిజాబితా విడుదల, పోలింగ్ బూత్‌ల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేయడం, బ్యాలెట్ నమూనాలు, ప్రింటింగ్ వంటి పనులు పూర్తిచేసింది. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కానున్న సమయంలో రిజర్వేషన్ల ప్రక్రియ తేలే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని గత జూన్ 26న హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. ఎన్నికల సామగ్రిని సైతం స్టోర్‌రూమ్‌లకు తరలించారు. ఇంతలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలు కానుంది. అధికారులకు ప్రత్యేక శిక్షణ సెప్టెంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసిన ఓటరు తుదిజాబితా ఆధారంగానే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇటీవల జారీచేసింది. నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారంలోగా గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారుచేసి అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద అతికించనున్నారు. నవంబర్ నాలుగో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్ నాలుగో వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజీ –1, స్టేజీ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. డిసెంబర్ రెండో వరకు ఎన్నికల సమాచారాన్ని సేకరించడం, ఏర్పాట్లను పూర్తిచేయడం వంటి పనులను పూర్తిచేయనున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సబ్‌కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వేషన్ల అంశమే కీలకం గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం మేలో రిజర్వేషన్లను ప్రకటించింది. దీని ప్రకారం ఎస్టీలకు 5.17శాతం, ఎస్సీలకు 20.46శాతం, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కేటాయించింది. కానీ వీటిని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. పాత వాటి ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేక కొత్తగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రామాల్లో రాజకీయ వేడి ఆగస్టు 2న గ్రామపంచాయతీ పాలకవర్గాలకు గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అదేరోజు నుంచి కొత్త పంచాయతీలుగా అవతరించిన తండాలు, అనుబంధ గ్రామాల్లోనూ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు ప్రత్యేకాధికారులను నియమించారు. వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 255 గ్రామ పంచాయతీలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 255, నాగర్‌కర్నూల్‌లో 543, మహబూబ్‌నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే అన్నిపార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. దీనికితోడు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతుండటంతో గ్రామాల్లో మరింత రాజకీయ వేడి రాజుకోనుంది. -
‘తమ్ముళ్ల’ తెగింపు‘
నందిగాం : రోడ్డు నిర్మాణం విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న సమస్య హైకోర్టు ఆదేశాలతో సర్దుమనిగింది అనుకునేలోపే, టీడీపీ నాయకులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో మరలా మొదటికొచ్చింది. నర్సిపురం నుంచి జల్లపల్లి వరకు నిర్మిస్తున్న 35 అడుగుల రహదారి నిర్మాణం తమ్ముళ్ల అధికార దర్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ స్థలంలో రోడ్డు నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా ఉన్న నర్సింహమూర్తి ఇంటి వైపు నుంచే నిర్మాణానికి పూనుకున్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోడంతో నర్సింహమూర్తి కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందిచిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయినా అత్యుత్సాహంతో అధికార పార్టీ నాయకులు టెక్కలి ఆర్డీఓ సాయంతో బుధవారం ప్రహారీ గోడను కూల్చివేశారు. దీంతో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. -
విజయ్ తండ్రిపై కేసు నమోదు చేయండి
సాక్షి, చెన్నై: నటుడు విజమ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌పై ఆధారాలుంటే కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ గత నవంబరు నెలలో చెన్నైలో జరిగిన ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అప్పుడాయన భక్తులు తిరుపతి దేవస్థానంలో సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్లేనని వివాదాష్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయ హుండీల్లో కానుకలు వేస్తే పరిక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇక పరిక్షలే రాయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేకెత్తించాయి. కాగా ఈ వ్యవహారంపై హిందు మున్నాని సంఘం నిర్వాహకులు దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరచేవిగా ఉన్నాయనీ పేర్కొంటూ చెన్నై పోలీస్ కమీషనర్ కార్యలయంలో గత నెల 25వ తేధీన పిర్యాదు చేశారు. అయితే ఆ పిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో వారు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్లో దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్‌పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి ఎంఎస్.రమేశ్ సమక్షంలో విచారణకు రాగా తగిన ఆధారాలుంటే దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
జీవో నంబర్ 14పై హైకోర్టులో కేసు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 14పై హైకోర్టులో కేసు నమోదు అయింది. జీవో నెంబర్ 14ను నిలిపివేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మున్సిపాలిటీలోని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 14ను జారీ చేసిన విషయం తెలిసిందే. -
హెచ్‌సీఏపై హైకోర్టు సంచలన ఆదేశాలు
-
హెచ్‌సీఏపై హైకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్: నిధుల దుర్వినియోగానికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలన్ని వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది. తాజా మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, కార్యదర్శి మనోజ్, జాయింట్ సెక్రటరీ అగర్వాల్ సస్పెండ్ వేటు వేసింది. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలుచేయకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిటీ సిఫారసుల ప్రకారం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే పాత కమిటీని కూడా రద్దు చేసి వెంటనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలేవీ కూడా ఇప్పటి వరకు హెచ్‌సీఏ తీసుకోలేదు. గత ఐదేరాళ్లుగా హెచ్‌సీఏకు పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నట్లు సమాచారం. ఏటా దాదాపు 31కోట్లు వస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ నిధులను జిల్లాలో స్టేడియాల పేరిట దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎక్కడా ఒక్క స్టేడియాన్ని, ఇతర మౌలిక వసతులు ఏర్పాటుచేసినట్లుగానీ కనిపించని నేపథ్యంలో మరిన్ని నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే హైకోర్టు ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
పోచంపల్లిని సందర్శించిన హైకోర్టు జడ్జి
భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల కళా నైపుణ్యం అద్భుతంగా ఉందని హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ కొనియాడారు. బుధవారం ఆయన సతీసమేతంగా పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. అనంతరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆయన వెంట చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, కార్యదర్శి సూరపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సిద్దుల రాంచంద్రం, డైరెక్టర్లు అంకం మురళి, సీత చక్రపాణి, గంజి అంజయ్య తదితరులు ఉన్నారు. -
గాంధీ చూపిన మార్గంలో నడవాలి
నల్లగొండ (నల్లగొండ రూరల్) : గాంధీ చూపిన మార్గంలో నడవడం ద్వారా చక్కటి సమాజం నిర్మితం అవుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శివశంకర్‌రావు, రాజశేఖర్‌రెడ్డిలు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. అహింస, సత్యమే గాంధీ ప్రధాన సూత్రాలన్నారు. న్యాయవాదులు నిరంతరం కొత్త కొత్త చట్టాలను అధ్యయనం చేస్తూ, న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకుముందు న్యాయశాఖ అభివృద్ధి భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి కె.రాధారాణి, జేసీ సత్యనారాయణ, ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, న్యాయమూర్తులు శైలజాదేవి, సత్యనారాయణ, బార్అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్యగౌడ్, కొండ శ్రీనివాస్, శ్రీనివాసులు, ఎన్.నర్సింహారెడ్డి, అమరేందర్‌రెడ్డి, పాదం శ్రీనివాస్, సంధ్యారాణి, బీమార్జున్‌రెడ్డి, లెనిన్‌బాబు పాల్గొన్నారు. -
కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
నల్లగొండ (నల్లగొండ క్రైం): జైలు నుంచి విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా జీవించాలని హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా జైలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖైదీలకు జైళ్లలో యోగా నేర్పించడంతో పాటు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. అనంతరం జైలులో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సింగపూర్‌ని మించిన కంపెనీలు ఇండియాలో..
హైదరాబాద్: స్విస్ చాలెంజ్‌పై ప్రతి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాస్తోందని ఆదిత్యా కన్స్ట్రక్షన్స్, ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరుపున న్యాయవాదులు ప్రకాశ్ రెడ్డి, వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. విదేశీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. స్విస్ ఛాలెంజ్‌పై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణ రేపటికి వాయిదా పడింది. గురువారం ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించనున్నారు. బుధవారం నాటి వాదనల సందర్భంగా పిటిషనర్ల తరుపున పలు అంశాలను న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విదేశాల్లో అనుభవం ఉండాలనే నిబంధన సరికాదని కోర్టుకు తెలిపారు. సింగపూర్ కన్సార్టియంకు లబ్ది చేకూర్చేందుకే ఆ నిబంధన పెట్టారని చెప్పారు. సింగపూర్ కన్నా ఎక్కువ ప్రాజెక్టులను డెవలప్ చేసిన కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయని గుర్తుచేశారు. స్విస్ చాలెంజ్ విషయంలో ప్రభుత్వం ప్రతి విషయాన్నిదాస్తోందని, సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమకు అనుకూలమైన వారికి టెండర్ దక్కేలా బిడ్డింగ్ ప్రాసెస్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. -
‘నిమ్జ్’కు లైన్ క్లియర్
భూముల కొనుగోలు చేసుకోవచ్చన్న హైకోర్టు రిజిస్ట్రేషన్లకూ ఓకే.. అంతా తుది తీర్పునకు లోబడే తదుపరి ఉత్తర్వులదాకా ఎవరినీ ఖాళీ చేయించొద్దు మాకిచ్చిన హామీలు అమలు చేసి నివేదిక ఇవ్వండి నివేదికపై మేం సంతృప్తి చెందితేనే ఖాళీ ప్రక్రియ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు భూముల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో లైన్‌క్లియర్ అయింది. 123 జీవో కింద భూముల కొనుగోలుకు, రిజిస్ట్రేషన్లకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే కొనుగోళ్లన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ‘‘తదుపరి ఉత్తర్వుల దాకా భూ యజమానులను గానీ, ఇతరులను గానీ ఖాళీ చేయించరాదు. 2013 భూ సేకరణ చట్టం షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలన్నింటినీ బాధితులకు వర్తింపజేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేసి, సంబంధిత నివేదికను మా ముందుంచండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాన్ని తాము పరిశీలించి, సంతృప్తి చెందాకే భూముల నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సవరణ జీవో ఇదిగో... గత విచారణ సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 190లో ధర్మాసనం కొన్నింటిపై స్పష్టత కోరిన నేపథ్యంలో దానికి సవరణలు చేస్తూ జీవో 191 జారీ చేశామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వివరించారు. జీవో కాపీని ధర్మాసనం ముందుంచారు. ‘‘ఉమ్మడి కుటుంబమన్న పదంపై అభ్యంతరం నేపథ్యంలో దాన్ని తొలగించి కుటుంబం అన్న పదం చేర్చాం. ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.3 వేలు, ఇతరులకు రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తామని జీవో 190లో పేర్కొన్నగా, ఆ మొత్తాలను ధరల సూచీకి అనుగుణంగా చెల్లిస్తామని తాజాగా చేర్చాం’’ అని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కుటుంబమంటే వితంతువు, భార్య చనిపోయిన వ్యక్తి, విడిగా ఉంటున్న మేజర్లు కూడానని పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి గుర్తు చేశారు. వితంతువు విడిగా ఉంటే రూ.1.5 లక్షలు చెల్లిస్తామని, ఉద్యోగాల్లో బాధితులకు ప్రాధాన్యమిస్తామని ధర్మాసనం ప్రశ్నలకు బదులుగా ఏజీ చెప్పారు. 2014 పారిశ్రామిక విధానం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలిస్తామన్నారు. అలా జరగడం లేదని, మెదక్ జిల్లాలో విడ్మిల్ కంపెనీలో ఛత్తీస్‌గఢ్ వారికే అత్యధిక ఉద్యోగాలు దక్కాయని మూర్తి అన్నారు. రేపు నిమ్జ్ విషయంలోనూ ఇదే జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాజ్యం ప్రాథమిక దశలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి చర్చ సరికాదని ఏజీ అన్నారు. ఉద్యోగం, కుటుంబం పదాల్లో 191 జీవోలో సందిగ్ధత ఉండటం నిజమేనన్న ధర్మాసనం, వీటిపై స్పష్టతనిచ్చేదాకా భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దంది. జీవో 123 ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు భూ కొనుగోళ్లపై దాఖలైన వ్యాజ్యాలపై ఇప్పటికిప్పుడు విచారణకు ధర్మాసనం నిరాకరించింది. వచ్చే వారం విచారిస్తామని, బాధితులెవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. పార్టీల పిటిషన్లను మాత్రం అనుమతించబోమంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడ్డందున ప్రతి అంశాన్నీ లోతుగా పరిశీలిస్తామంది. -
'రెండు మూడురోజులు ఆగలేకపోయారా'
హైదరాబాద్: వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. కేసు పెండింగ్‌లో ఉండగా నియామకాలు ఎలా చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రెండు, మూడు రోజులు ఆగలేరా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు రిజర్వులో ఉంచింది. తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్ వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సాంబశివరావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతిష్టాత్మక ఉస్మానియ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం నియమితులయ్యారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రవీణ్ రావులను నియమించారు. -
హైకోర్టు వద్ద టెన్షన్.. టెన్షన్
హైదరాబాద్: తెలంగాణలో హైకోర్టు వివాదం రోజుకింత ముదురుతుంది. 11మంది న్యాయాధికారులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు వచ్చే నెల 15వరకు సామూహిక సెలవులు పెట్టారు. దీంతోపాటు నేడు న్యాయవాదులు చలో హైకోర్టు పిలుపునివ్వడంతో వారితోపాటు న్యాయమూర్తులు కూడా కలిసి వెళ్లే అవకాశం ఉంది. చలో హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు తరలి వస్తున్నారని ఇప్పటికే న్యాయవాదుల జేఏసీ చెప్పడంతో హైకోర్టు వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇప్పటికే పలు మార్గాల గుండా న్యాయవాదులు హైకోర్టు వద్దకు భారీ సంఖ్యలో వస్తున్నారు. మదీనా వద్ద కొంతమంది న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, మొన్న గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లుగానే ఈ రోజు కూడా న్యాయాధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా గత రోజులకంటే ఈ వివాదం మరింత ముదురుతోందని చెప్పవచ్చు. హైకోర్టులో న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ తరుపు న్యాయాధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
హైకోర్టులో వీహెచ్ రచ్చ
♦ ‘హెచ్‌సీయూ’ ఘటనపై పిటిషన్ విచారణలో గందరగోళం ♦ తమ న్యాయవాదిని ధర్మాసనం నిలదీయడంతో అసహనం ♦ నేను ఎంపీని.. కావాలంటే అరెస్ట్ చేసుకోండి ♦ జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటిన వీహెచ్ ♦ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం.. వెనక్కి తగ్గిన వీహెచ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీగా అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పజెప్పడంపై దాఖలైన పిటిషన్ విచారణలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు గందరగోళం సృష్టించారు. హైకోర్టులోనే గట్టిగా మాట్లాడుతూ.. గ్యాలరీ దాటి ముందుకెళ్లేం దుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గారు. ఇక ఈ పిటిషన్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వీసీ అప్పారావు, సైబరాబాద్ కమిషనర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 20కి వాయిదా వేస్తూ... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌సీయూ వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ ఎంపీ వి.హనుమంతరావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి స్పం దిస్తూ... హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. దాంతో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిందని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థుల హక్కులు ప్రభావితమవుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వీసీని సస్పెండ్ చేశారా, సెలవుపై వెళ్లారా అనే స్పష్టత లేకుంటే ఎలాగని నిలదీసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది చెప్పగా... విద్యార్థుల ప్రయోజనాలను తాము పరిరక్షిస్తామని, దాని గురించి పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. భావోద్వేగాలు, మీడియా కథనాల ఆధారంగా కేసులను విచారించడం సాధ్యం కాదని పేర్కొంది. వీహెచ్ రగడ.. అసలు ఈ వ్యాజ్యంలో మీరు ఏం కోరుతున్నారో కూడా చెప్పాలని న్యాయవాదిని ధర్మాసనం పలుమార్లు ప్రశ్నించింది. ఈ సమయంలో కక్షిదారుల గ్యాలరీలో ఉన్న వీహెచ్ లేచి తనదైన యాసలో పెద్దగా మాట్లాడడం ప్రారంభించారు. ఓ వ్యక్తి కోసం 6 వేల మంది విద్యార్థులు రోడ్డుపై ఉన్నారని అరుస్తూ గ్యాలరీ దాటి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో న్యాయవాదులు వారించడంతో వెనక్కి తగ్గారు. ధర్మాసనం మళ్లీ న్యాయవాదిని స్పష్టత కోరడంతో వీహెచ్ సహనం కోల్పోయారు. తాను ఎంపీనని, తనను అరెస్ట్ చేసుకోవచ్చని, జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటి ముందుకెళ్లారు. తన వాదన వినాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను పిలిచేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో న్యాయవాదులు వీహెచ్‌ను వారించడంతో వెనక్కి వెళ్లారు. అయితే పోలీసులు కోర్టు హాల్లోకి రావడం, వీహెచ్ మరో ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగాయి. అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
భూముల వేలం పర్యవేక్షిస్తాం..
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తామే స్వయంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు గాను ఎప్పటికప్పుడు సంబంధిత వివరాలను తమ ముందుంచాలని పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్‌కు స్పష్టం చేసింది. ఆస్తుల వేలం నిమిత్తం మరో 10 ఆస్తులను సిద్ధం చేసి వివరాలను తమ ముందుంచాలని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డిని ఆదేశించింది. ఏ ఆస్తులు అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందో చెప్పాలని అగ్రిగోల్డ్ చైర్మన్‌ను ఆదేశించింది. తామిచ్చే తుది అవకాశం ఇదేనని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం వాటిని శుక్రవారం మరోసారి విచారించింది. -
పురోగతి నివేదిక సమర్పించండి
► అక్షయ గోల్డ్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం ► ఇకపై ప్రతి విచారణకు హాజరు కావాలని సంస్థ ఎండీకి స్పష్టీకరణ ► తదుపరి విచారణ 24కు వాయిదా సాక్షి, హైదరాబాద్: అక్షయ గోల్డ్ వ్యవహారంలో ఇప్పటివరకు సాగిన దర్యాప్తునకు సంబంధించిన పురోగతితో నివేదిక సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేగాక అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై ప్రతి విచారణకు స్వయంగా హాజరు కావాలని అక్షయ గోల్డ్ మేనేజింగ్ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమంది బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు అక్షయ గోల్డ్‌లో ఉన్నారు.. ఏ ఏ సంవత్సరాల్లో వారు ప్రాతినిథ్యం వహించారు.. అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిందితులెవరు.. డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి?.. తదితర వివరాలను తేల్చాలని, ఇందుకు అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)ను ఆశ్రయించాలని ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి దాదాపు 600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి వాటిని తిరిగి చెల్లించకుండా అక్షయగోల్డ్ యాజమాన్యం ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్, అక్షయగోల్డ్ తరఫు న్యాయవాది ధనుంజయ వాదనలు వినిపించారు. -
ఏం చర్యలు తీసుకుంటున్నారు
* రైతు ఆత్మహత్యల ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు * పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుని వారి ఒత్తిళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేయడంతో పాటు,ఆత్మహత్యల నివారణకు 2006లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేలా ఉభయ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ. 1 లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారంపై రుణాలను వన్ టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, మరొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాల తీసుకోవడం ద్వారా దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పిటిషనర్లు తమకు వివరాలిచ్చారని తెలిపారు. ఈ ఆత్మహత్యలు గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో జరిగాయన్నారు. వాటిని జిల్లా కలెక్టర్లకు పంపి, ఒక్కో రైతుకు చెందిన పూర్తి వివరాలతో కోర్టుకు నివేదిక సమర్పిస్తామని వివరించారు. రైతులను వేధించే వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంది. వాటి ఆధారంగా ఈ వ్యాజ్యాలపై విచారణను ముగిస్తామని తెలిపింది. -
' నియామకంపై వివరణ ఇవ్వండి'
► టీఎస్పీఎస్సీ సభ్యురాలి నియామకంపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: డాక్టర్ చంద్రావతిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలుగా నియమించడంపై ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వివరణను కోరింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీఎస్పీఎస్సీ కార్యదర్శులతో పాటు చంద్రావతికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా కొనసాగేందుకు చంద్రావతికి తగిన అర్హతలు లేవన్నారు. మంచి ప్రవర్తన, ప్రజల్లో విశ్వాసం పెంచేవారు, నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తులే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉండాలన్నారు. చంద్రావతిపై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆమె విధి నిర్వహణలో అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, చంద్రావతి నియామకంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
బీఆర్ఎస్ ప్రక్రియకు హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్: క్రమబద్ధీకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. జంట నగరాల పరిధిలో ఉన్న పలు భవనాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టవద్దంటూ వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా జంట నగరాల పరిధిలోని ఇళ్ల యజమానులు షాక్ తిన్నారు. ఇప్పటివరకు వేలాది సంఖ్యలో ఇళ్ల యజమానులు తమ దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జీహెచ్ఎంసీ సర్టిఫైడ్ ఇంజనీర్లు మాత్రమే ముందుగా భవనాల కొలతలు తీసుకుని, అందులో ఎంత మేర అతిక్రమణలు ఉన్నాయన్నది నిర్ధారించి, ఫైళ్లను అప్లోడ్ చేయాలని నిబంధన విధించడంతో ఇప్పటికే ఇంజనీరింగ్ సంస్థలు, ఆర్కిటెక్టులు భారీ మొత్తంలో ఇళ్ల యజమానుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉన్న ఇళ్లకు రూ. 10వేలు, జి+1 ఇళ్లకు రూ. 15 వేల వంతున కేవలం అంచనా వేసి ఇచ్చి, ఫైళ్లు అప్లోడ్ చేసేందుకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో ఇటు ఇళ్ల యజమానులకు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే. గత అక్టోబర్‌లోనే దీనికి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా దానికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీకి మొత్తం 25 వేలకు పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు తాము అడ్డు చెప్పబోమని, క్రమబద్ధీకరణ మాత్రం తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. -
హైకోర్టుకు అదనపు జడ్జీల నియామకం
హైదరాబాద్: హైకోర్టుకు గురువారం అదనపు జడ్జీల నియామకం జరిగింది. అదనపు జడ్జీలుగా నియామకం అయినవారిలో రామలింగేశ్వరరావు, శివశంకర్ రావు, సీతారామమూర్తి, రవికుమార్, దుర్గా ప్రసాద్ రావు, సునీల్ చక్రవర్తి, సత్యనారాయణ మూర్తి, సునీల్ కిషోర్, శంకర్ నారాయణ, మతి అనీష్ ఉన్నారు. -
'నమ్మి ఇస్తే ఇంత మోసం చేస్తారా'
హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మి భూములు ఇస్తే తమకు నష్టపరిహారం కూడా సరిగా చెల్లించడం లేదని ఏపీ రైతులు హైకోర్టు మెట్లెక్కారు. దాదాపు 54 మంది రైతులు ఏపీ ప్రభుత్వ చేష్టలతో ఆవేదన చెంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నమ్మి తమ భూములను ఇస్తే రైతులను మోసం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
యూజీసీ కార్యదర్శికి మరోసారి రూ.1500 ఫైన్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శిపై హైకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాము ఆదేశించిన మేర నిర్ణీత వ్యవధిలోపు కౌంటర్ దాఖలు చేయనందుకు రూ.1500 జరిమానా విధించినా పద్ధతి మార్చుకోకపోవడాన్ని తప్పుపట్టింది. గురువారం నాటి విచారణకు సైతం కౌంటర్ దాఖలు చేయకుండా సమయం కోరడంతో మండిపడ్డ హైకోర్టు మరోసారి రూ.1500 జరిమానా విధించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఉభయ రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలు యూజీసీ అనుమతి లేకుండానే పలు కోర్సులను నిర్వహిస్తున్నాయని, ఈ విషయంలో విశ్వవిద్యాలయాలను నిలువరించేలా యూజీసీని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జి.శివారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారించింది. తాము ఆదేశించిన విధంగా నిర్ణీత కాల వ్యవధి లోపు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో యూజీసీ కార్యదర్శికి రూ.1500 విధిస్తూ విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా యూజీసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కౌంటర్ సిద్ధమైందని, అయితే అది ఇంకా కోర్టులో దాఖలు చేసేందుకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇప్పటికే ఓసారి జరిమానా విధించినా పద్దతి మార్చుకోలేదా..? అంటూ ప్రశ్నించింది. మరోసారి రూ.1500 జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది.1200మంది ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలు 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ ప్రభుత్వాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.