
మొదటి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎర్రచందనం కూలీలకు నిర్వహించిన మొదటి పోస్టుమార్టం నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో సహా తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
పోస్టు మార్టంకోసం దాఖలైన పిటిషన్ల మేరకు ధర్మాసనం ఆదేశాలతో ఆరుగురు కూలీల మృతదేహాలకు ఇటీవల తిరువణ్ణామలైలో నిర్వహించిన రెండో పోస్టుమార్టం నివేదికను ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను క్షుణ్ణంగా చదివిన ధర్మాసనం, మొదటి పోస్టుమార్టం నివేదిక కొంత అసంపూర్తిగా ఉందని, అందులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక లేదని, అందువల్ల దానితో కలిపి ఆ నివేదికను తమ ముందుంచాలని అదనపు ఏజీకి ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు ఆయన అంగీకరించారు.