sheshachalam
-
ద్వారకాతిరుమలలో కొత్త టోల్గేట్
సాక్షి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచలకొండపై దేవస్థానం నూతనంగా నిర్మించిన టోల్ గేటును ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు కుమారుడు నివృతిరావు ఆదివారం ప్రారంభించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహించబడిన ఈ టోల్ గేటును ఇక దేవస్థానమే సొంతంగా నిర్వహించనుంది. 2018–2019 సంవత్సరానికి గాను స్వామివారికి టోల్ గేటు ద్వారా సుమారు రూ.77 లక్షలు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం మరింతగా పెరుగుతుందన్న ఉద్దేశంతో దీన్ని దేవస్థానం స్వయంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.20 లక్షల వ్యయంతో టోల్ గేట్ వద్ద షెడ్డును, టికెట్ కౌంటర్‌ను, ఇతర నిర్మాణాలను జరిపారు. వీటిని ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు, ఈఈ వైకుంఠరావు, ఏఈవో బి.రామాచారి, డీఈలు టి.సూర్యనారాయణ, పి.ప్రసాద్, గుర్రాజు, సూపరింటిండెంట్లు నగేష్, జి.సుబ్రహ్మణ్యం, కిషోర్, ఏఈలు మధు, దిలీప్ తదితరులతో కలిసి నివృతిరావు ప్రారంభించారు. అనంతరం టికెట్ కౌంటర్లో చినవెంకన్న చిత్రపటాన్ని ఉంచి ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ ఈ టోల్ గేట్ నిర్వహణ ఇద్దరు సూపరింటిండెంట్ల పర్యవేక్షణలో ఉంటుందని, ఇందులో మూడు షిఫ్ట్‌లుగా 20 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అలాగే టోల్‌గేటు ధరలను పెంపుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు. లారీ, బస్సు, భారీ వాహనాలకు టోల్ పాత ధర రూ.100 కాగా దానిని రూ.150కి పెంచారు. మినీ బస్సు, వ్యాన్లకు రూ.50 నుంచి రూ.100కు, ట్రాక్టర్ టక్కు, ట్రాక్ ఆటో, ప్రయాణికుల వాహనాలకు రూ.30 నుంచి రూ.50కి పెంచారు. కారు, జీపు, వ్యాన్, స్కూటర్, బైక్, ఆటోకు టోల్ ఫీజును పెంచలేదు. -
శేషాచలం అడవుల్లో కూంబింగ్
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జామకాయకోన వద్ద 40 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించి ఎర్రచందనం దుంగలను పడేసి దట్టమైన అడవిలోకి స్మగ్లర్లు పారిపోయారు. 30ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం అటవీశాఖ అధికారులు ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టారు. -
శేషాచలం అడవుల్లోకి చొరబడటానికి ప్రయత్నించిన స్మగ్లర్లు
-
శేషాచలం అడవుల్లో మళ్లీ ఆలజడి
-
కదులుతోన్న‘ఎర్ర’ డంప్‌లు
– పుష్కర విధుల్లో జిల్లా పోలీసులు – ఇదే అదునుగా పేట్రేగుతున్న స్మగ్లర్లు – శేషాచలం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణా – బుధ, గురువారాల్లో 13 మంది స్మగ్లర్లు అరెస్ట్ – బడా స్మగ్లర్ శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు సాక్షి ప్రతినిధి తిరుపతి : శేషాచలంలోని ఎర్ర చందనం డంప్‌లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమిళనాడు నుంచి వస్తోన్న ఎర్ర స్మగ్లర్లు చాకచక్యంగా ఎర్రదుంగల తరలింపును ముమ్మరం చేశారు. జిల్లా పోలీసుల్లో 80 శాతం మంది కృష్ణా పుష్కర విధులకు హాజరవడం వీరికి కలిసొచ్చింది. ఇదే సరైన అదునుగా భావించిన స్మగ్లర్లు అడవుల్లో దాచిన ఎర్రచందనం దుంగల డంప్‌లను గుట్టూచప్పుడు కాకుండా బయటకు రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ రవాణా పెరిగినట్లు టాస్క్ఫోర్సు అధికారులు గుర్తించారు. బుధ, గురువారాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపి 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 58 ఎర్రచందనం దుంగలను (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలంలో ఇంకా 30 శాతం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇప్పటికే నరికిన చెట్ల తాలూకు దుంగల నిల్వలు పెద్ద ఎత్తున అడవుల్లో నిల్వ ఉన్నాయి. వీటిని బయటకు తరలించే విషయంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు స్మగ్లర్లు విస్తతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడచిన రెండు నెలల్లో సుమారు 20 టన్నులకు పైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 25 మందికి పైబడి స్మగ్లర్లును అరెస్టు చేశారు. రెడ్‌శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 13 బృందాలు శేషాచలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వెలిగొండ, పాలకొండ, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల్లో వీరి కూంబింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన జిల్లాకు చెందిన 80 శాతం మంది పోలీసులు కృష్ణా పుష్కర వి«ధులకు వెళ్లిపోయారు. దీంతో అన్ని మార్గాల్లోనూ పోలీసుల తనిఖీలు లేకుండా పోయాయి. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. 13 మంది అరెస్టు ...పరారీలో ముగ్గురు ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఉగ్గరాల తిప్ప దగ్గర కూంబింగ్‌లో ఉన్న టాస్క్ఫోర్సు పోలీసులకు ఎర్ర చందనం దుంగలను రవాణా చేసే ముగ్గురు తమిళనాడు స్మగ్లర్లు దొరికారు. వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి 58 దుంగలు (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్సు డీఎస్సీ శ్రీధర్‌రావు విలేకరులకు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు జూపార్కు సమీపంలోని పెరుమాళ్లపల్లి అడవుల్లో అడవిలోకి ప్రవేశిస్తోన్న ఎర్ర స్మగ్లర్లపై టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ వాసు, నర్సింహయ్యల టీములు ఒక్కసారిగా దాడులు జరిపాయి. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో రేణిగుంటకు చెందిన కె. శివ, తిరుచ్చికి చెందిన లక్ష్మన్ సెంథిల్ కుమార్, రాసు షణ్ముగం, పిలెందిరన్ అంగముత్తు, క్రిష్టన్మూర్తి, రామర్ నాగరాజన్, నల్లిస్వామి పెరుమాళ్, నగరాజన్ సత్యవేల్, సంథానమ్ రవి, సంథానమ్ రాములు ఉన్నారని డీఎస్పీ శ్రీథర్రావు వివరించారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న పేరూరి శ్రీనివాసరెడ్డి, మునస్వామి, రామానాయుడులు పరారయ్యారు. అరెస్టయిన వారి నుంచి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ పేరూరి శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు. సహకరిస్తోన్న అగ్రికల్చర్ కాలేజీ వాచ్మెన్, రైల్వే ఉద్యోగిలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలు
-
శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలు
– ‘ఎర్ర’స్మగ్లర్లను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ – పర్వత శిఖరాలపై 5 కిమీ రేంజ్ ఫోకస్ కెమెరాలు – ప్రతిపాదనలు తయారుచేసిన అటవీ శాఖ – డ్రోన్ల పనితీరుపై ప్రయోగాత్మక పరిశీలన సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎర్ర చందనం అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అధికారులు శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలను వినియోగించనున్నారు. వీటిద్వారా 5 కిలోమీటర్ల రేంజిలో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టడమే కాకుండా అడవుల్లో జరిగే అక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ముందుగా డ్రోన్ల ద్వారా శేషాచలంపై నిఘాను ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం చెన్నై టెక్వేర్ సిస్టం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రెండు డ్రోన్లను తెప్పించి పనితీరుపై ప్రయోగాత్మక పరిశీలన జరిపారు. గగనతలంలో డ్రోన్లు తీసిన ఫోటోలను పరిశీలించారు. తొలి విడతలో 6 డ్రోన్లు గురువారం సమావేశమైన టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అటవీశాఖ సీసీఎఫ్‌వో చలపతిరావు శేషాచలంపై ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు కట్టించడానికి డ్రోన్లు, లేజర్ కెమెరాల వాడకం అనివార్యమన్న నిర్ణయానికి వచ్చారు. చిత్తూరు జిల్లా కరకంబాడి, మంగళం, భాకరాపేట, వైఎస్ఆర్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో మొత్తం 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కూలీల చొరబాట్లు, స్మగ్లర్ల రవాణా తగ్గడం లేదు. పైగా ఇటీవల కాలంలో అక్రమ రవాణా బాగా పెరిగింది. దీంతో ఇటీవల తిరుపతిలో సమావేశమైన పోలీస్, టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు సంయుక్తంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన డ్రోన్లు, లేజర్ కెమెరాలను వాడి వాటి ద్వారా స్మగ్లర్ల కదలికలను గుర్తించాలని భావించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న కెమెరాలతో పాటు 5 కిలోమీటర్ల రేంజి ఉన్న లేజర్ బీమ్ కెమెరాలను కొండ శిఖరాలపై ఏర్పాటు చేయడం ద్వారా అవి రాత్రింబవళ్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ లేజర్ కిరణాలతో ఫోటోలు తీస్తుంటాయి. ఎక్కడ స్మగ్లర్లు ఉన్నా, ఎర్రచందనం చెట్లు నరుకుతున్నా వెంటనే ఆయా బొమ్మలను కంట్రోల్ రూంకు పంపుతాయి. ఇవన్నీ శాటిలైట్‌తో అనుసంధానం చేసి ఉండటం వల్ల పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఐవీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీటికితోడు 20కి పైగా లేజర్ బీమ్ కెమెరాలు, ఆరు డ్రోన్లను నిఘాకోసం వినియోగిస్తే 50 శాతం ఎర్రస్మగ్లర్లను అరికట్టవచ్చన్నది అధికారుల ఆలోచన. -
శేషాచలం అడవుల్లో మంటలు
తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాటగంగమ్మ గుడి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతుండగా ఆదివారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ అటవీ విభాగం సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కొంత మేర అటవీ ప్రాంతం దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
శేషాచలంలో మళ్లీ అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల శేషాచలం అడవిలో శనివారం మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలోని జింకల పార్కు వద్ద 41వ మలుపు కుడివైపు అడవిప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ అటవీశాఖ అధికారి శివరామ్‌ప్రసాద్, విజిలెన్స్, అగ్నిమాపక విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సుమారు రెండెకరాల అడవి కాలిపోయింది. 33 కేవీ విద్యుత్ లైను నుంచి వచ్చిన నిప్పు రవ్వల వల్లే మంటలు వ్యాపించాయని జేఈవో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించామన్నారు. -
మొదటి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఎర్రచందనం కూలీలకు నిర్వహించిన మొదటి పోస్టుమార్టం నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో సహా తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పోస్టు మార్టంకోసం దాఖలైన పిటిషన్ల మేరకు ధర్మాసనం ఆదేశాలతో ఆరుగురు కూలీల మృతదేహాలకు ఇటీవల తిరువణ్ణామలైలో నిర్వహించిన రెండో పోస్టుమార్టం నివేదికను ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను క్షుణ్ణంగా చదివిన ధర్మాసనం, మొదటి పోస్టుమార్టం నివేదిక కొంత అసంపూర్తిగా ఉందని, అందులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక లేదని, అందువల్ల దానితో కలిపి ఆ నివేదికను తమ ముందుంచాలని అదనపు ఏజీకి ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు ఆయన అంగీకరించారు. -
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన రెండు పిటిషన్లు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున అతని అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
రీ- పోస్టుమార్టం నివేదికను మా ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ కేసులో ఆరు మృతదేహాల రీ- పోస్టుమార్టం నివేదికను బుధవారం తమ ముందుంచాలంటూ ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మృతుల బంధువులు కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే సోమవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా.. ఎన్కౌంటర్లో మృతులకు తిరుపతి డాక్టర్లు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, దానిని తిరిగి సీల్డ్ కవర్లోనే ఉంచి రిజిస్ట్రార్ వద్ద భద్రపరచాలని ఆదేశించింది. రెండో పోస్టుమార్టం నివేదికను బుధవారం కల్లా తమ ముందుంచాలని పోస్టుమార్టం చేసిన ఉస్మానియా వైద్య కళాశాలల డాక్టర్లను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.