
శేషాచలం అటవీ ప్రాంతంలో బుధవారం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న అధికారులు
– ‘ఎర్ర’స్మగ్లర్లను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ
– పర్వత శిఖరాలపై 5 కిమీ రేంజ్ ఫోకస్ కెమెరాలు
– ప్రతిపాదనలు తయారుచేసిన అటవీ శాఖ
– డ్రోన్ల పనితీరుపై ప్రయోగాత్మక పరిశీలన
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎర్ర చందనం అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అధికారులు శేషాచలంపై డ్రోన్లు, లేజర్ కెమెరాలను వినియోగించనున్నారు. వీటిద్వారా 5 కిలోమీటర్ల రేంజిలో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టడమే కాకుండా అడవుల్లో జరిగే అక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ముందుగా డ్రోన్ల ద్వారా శేషాచలంపై నిఘాను ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం చెన్నై టెక్‌వేర్ సిస్టం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రెండు డ్రోన్లను తెప్పించి పనితీరుపై ప్రయోగాత్మక పరిశీలన జరిపారు. గగనతలంలో డ్రోన్లు తీసిన ఫోటోలను పరిశీలించారు.
తొలి విడతలో 6 డ్రోన్లు
గురువారం సమావేశమైన టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అటవీశాఖ సీసీఎఫ్‌వో చలపతిరావు శేషాచలంపై ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు కట్టించడానికి డ్రోన్లు, లేజర్ కెమెరాల వాడకం అనివార్యమన్న నిర్ణయానికి వచ్చారు. చిత్తూరు జిల్లా కరకంబాడి, మంగళం, భాకరాపేట, వైఎస్‌ఆర్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో మొత్తం 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కూలీల చొరబాట్లు, స్మగ్లర్ల రవాణా తగ్గడం లేదు. పైగా ఇటీవల కాలంలో అక్రమ రవాణా బాగా పెరిగింది. దీంతో ఇటీవల తిరుపతిలో సమావేశమైన పోలీస్, టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు సంయుక్తంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన డ్రోన్లు, లేజర్ కెమెరాలను వాడి వాటి ద్వారా స్మగ్లర్ల కదలికలను గుర్తించాలని భావించారు.
రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న కెమెరాలతో పాటు 5 కిలోమీటర్ల రేంజి ఉన్న లేజర్ బీమ్ కెమెరాలను కొండ శిఖరాలపై ఏర్పాటు చేయడం ద్వారా అవి రాత్రింబవళ్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ లేజర్ కిరణాలతో ఫోటోలు తీస్తుంటాయి. ఎక్కడ స్మగ్లర్లు ఉన్నా, ఎర్రచందనం చెట్లు నరుకుతున్నా వెంటనే ఆయా బొమ్మలను కంట్రోల్ రూంకు పంపుతాయి. ఇవన్నీ శాటిలైట్‌తో అనుసంధానం చేసి ఉండటం వల్ల పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఐవీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీటికితోడు 20కి పైగా లేజర్ బీమ్ కెమెరాలు, ఆరు డ్రోన్లను నిఘాకోసం వినియోగిస్తే 50 శాతం ఎర్రస్మగ్లర్లను అరికట్టవచ్చన్నది అధికారుల ఆలోచన.